Begin typing your search above and press return to search.

వియ్యంకుడిపై ప్రశంసలు కురిపించిన నాగబాబు...!

By:  Tupaki Desk   |   29 Aug 2020 10:00 PM IST
వియ్యంకుడిపై ప్రశంసలు కురిపించిన నాగబాబు...!
X
మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదెల‌ నిశ్చితార్థం వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్య‌తో నిహారిక పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో ఇటీవల నిహారిక - చైతన్యల ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో గ్రాండ్ గా జ‌రిగింది. అయితే త్వరలో వియ్యంకుడు కాబోతున్న ఐజీ ప్రభాకర్ రావు త్వరలో పదవీవిరమణ చేస్తుండటంతో ఆయన గురించి నాగబాబు మాట్లాడారు. తన యూట్యూబ్ ఛానల్‌ 'మన ఛానల్ మన ఇష్టం'లో దీనికి సంబంధించిన వీడియో విడుదల చేశారు నాగబాబు.

నాగబాబు మాట్లాడుతూ.. ''ఈ నెల ఆగస్టు 31న రిటైర్డ్ కాబోతున్న ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు గారికి.. అభినందనలు తెలియజేస్తున్నా. వారితో త్వరలో వియ్యం అందుకోబోతున్నాను. మా ఫ్యామిలీకి పోలీస్ డిపార్ట్మెంట్‌ తో తెలియని అనుబంధం ఉంది. మా నాన్న ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్‌ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేశారు. నాన్నకి మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరినో ఒకరిని ఐపీఎస్ చేయాలని కోరిక ఉండేది. కాని మేము ఎవరం ఆ ఫీట్ సాధించలేకపోయాం. ఇన్నాళ్లకు కాకతాళీయంగా ప్రభాకర్ గారితో వియ్యం అందుకునే అవకాశం వచ్చింది. ఆ విధంగా ఓ పోలీస్ ఆఫీసర్ మా కుటుంబంలో భాగం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది'' అని చెప్పారు.

ఐజీ ప్రభాకర్ వివరాలు తెలియజేసిన నాగబాబు.. ఆయన డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో గుంటూరులో ఓ రౌడీ షీటర్ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకుని వెళ్లి రౌడీయిజాన్ని కట్టడి చేశారని చెప్పుకొచ్చారు. అలాగే రాజమండ్రిలో టెర్రరిస్టులు చొరబడినప్పుడు వాళ్లని చాకచక్యంగా పట్టుకుని జాతీయ స్థాయిలో సెన్సేషన్ అయ్యారని వెల్లడించారు. అంతేకాకుండా రాయలసీమలో పనిచేస్తున్నప్పుడు ఫ్యాక్షన్ వల్ల వచ్చే నష్టాన్ని తెలియజేస్తూ వాళ్లలో మార్పు తీసుకొచ్చి మంచి వైపుకు మళ్లే విధంగా చేశాడు.. ఇలా ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయని నాగబాబు కాబోయే వియ్యంకుడి గురించి చెప్పుకొచ్చారు.

''నాకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే.. ప్రభాకర్ గారి అబ్బాయి చైతన్యకి మా అమ్మాయి నిహారికను ఇవ్వడం. ఇంత మంచి ఫ్యామిలీకి మా అమ్మాయి కోడలుగా వెళ్లడం ఆనందంగా ఉంది. మంచి వ్యక్తులతో వియ్యం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. బావగారూ.. మీ రిటైర్డ్మెంట్ అయిన తరువాత కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అంటూ వీడియో ద్వారా తనకు కాబోయే బావగారిపై మెగా బ్రదర్ నాగబాబు ప్రశంసలు కురిపించారు.