Begin typing your search above and press return to search.

కామాక్షిని రూమ్మేట్ చేసుకున్న హీరో

By:  Tupaki Desk   |   3 March 2016 7:30 PM GMT
కామాక్షిని రూమ్మేట్ చేసుకున్న హీరో
X
కళ్యాణ వైభోగమే చిత్రంలో హీరోకి ఓ రూమ్ మేట్ గా మరో కేరక్టర్ ఉంది. ఈ పాత్ర పేరు కామాక్షి. మరి కామాక్షిని తెచ్చి ఏకంగా రూమ్ లోనే ఉంచుకున్నాడంటే.. ఖచ్చితంగా ఓ అమ్మాయి అనే అనుకుంటాం. కానీ ఈ కామాక్షి లెక్క వేరు. నందినీ రెడ్డి క్రియేటివిటీకి ఈ కామాక్షి ఓ సూపర్ ఎగ్జాంపుల్ అంటున్నాడు హీరో నాగశౌర్య.

ఈ కామాక్షి కేరక్టర్ హీరోతో పాటు రూమ్ లోనే నివాసం ఉంటుంది. ఇంతకీ ఈ కామాక్షి ఎవరంటే ఓ కోడి. అవును.. హీరో పెంచుకునే కోడి. దీనితోనే రోజూ మాట్లాడుతూ ఉంటాడు. ఒంటరిగా ఉన్నపుడు బాధ చెప్పుకుంటాడు హీరో. సాధారణంగా సినిమాల్లో చిలకలనో, పావురాలనో పెంచుకున్నట్లు చూపిస్తారు కానీ.. డైరెక్టర్ నందినీరెడ్డి మాత్రం.. హీరోకి రూమ్మేట్ గా ఓ కోడిని సెటప్ చేసిందట. దీనితో వచ్చే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయని తెలుస్తోంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా కోడితో ఉండడం విశేషం.

ఈ సీన్స్ ను పిక్చరైజ్ చేయడానికి.. నిజమైన కోడితో పాటు.. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ని కూడా ఉపయోగించామని చెబుతున్నాడు హీరో నాగశౌర్య. సిటీల్లో కోడిని పెంచుకోవడం, రోజూ దానితో మాట్లాడ్డం అనే కాన్సెప్ట్ ఆఢియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడీ హీరో. మరికొన్ని గంటల్లోనే కళ్యాణ వైభోగమే రిలీజ్ కానున్నా.. రిజల్ట్ పై మాత్రం మహా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు నాగశౌర్య చెబుతున్నాడు.