Begin typing your search above and press return to search.

నేను గర్వంగా చెప్పుకునే సినిమా 'వరుడు కావలెను': నాగశౌర్య

By:  Tupaki Desk   |   24 Oct 2021 3:58 AM GMT
నేను గర్వంగా చెప్పుకునే సినిమా వరుడు కావలెను: నాగశౌర్య
X
నాగశౌర్య కథానాయకుడిగా 'వరుడు కావలెను' సినిమా రూపొందింది. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నాగశౌర్య జోడీగా రీతూ వర్మ కనువిందు చేయనుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ కి తగినట్టుగా, హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ లో 'సంగీత్' పేరుతో ఈవెంట్ ను నిర్వహించారు. పూజ హెగ్డే ముఖ్య అతిథిగా ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడాడు.

" చాలా మాట్లాడాలి .. ఎందుకంటే ఇప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టాము. ఈ సినిమా ఒక రేంజ్ లో వచ్చింది. మన కుటుంబం గురించి చెప్పుకునేటప్పుడు, మా కుటుంబం చాలా మంచిది అని ఎలాగైతే గర్వంగా చెప్పుకుంటామో. అలాగే మా సినిమా కూడా బాగా వచ్చిందని అంత గర్వంగా చెబుతున్నాను .. ఇది నా సినిమా. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది .. అందరూ కూడా థియేటర్లలో చూడండి. ఓటీటీలో వస్తుందని థియేటర్లలో చూడకుండా ఉండకండి. ఓటీటీలో రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.

2018లో ఈ కథను వినడం జరిగింది .. 2019 చివరలో ఈ సినిమాను స్టార్ట్ చేశాము. 2021 ఎండింగ్ లో ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం .. ఫస్టువేవ్ .. సెకండ్ వేవ్ రెండూ చూశాము. ఈ మధ్యలో నిర్మాతలకు ఫోన్లు పగిలిపోయేలా ఓటీటీ ఆఫర్లు వచ్చే ఉంటాయి. ఈ సినిమా బాగా వస్తోందనే విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అయినా నిర్మాతలు ఆ సినిమాను అలా హోల్డ్ చేసి ఉంచారు. అలా చేయడం వల్లనే ఈ రోజున నేను ఈ స్టేజ్ పై గర్వంగా మాట్లాడుతున్నాను. అందువలన నిర్మాతలకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను.

లక్ష్మీ సౌజన్యగారు ఎన్నో ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఈ కథ రాసుకుని, బాగా తీయాలని పోరాడింది. ఆమె కష్టం ఫలిస్తుందనీ .. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని నేను నమ్ముతున్నాను. ఇక విశాల్ చంద్రశేఖర్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ .. ఈ రోజున ఇన్ని వేదికలపై సందడి జరగడానికి కారణం, ఆయన అందించిన పాటలు హిట్ కావడమే. ఆ గర్వంతోనే .. ఆనందంతోనే ఉన్నాము. సప్తగిరి నాకు ఏడెనిమిదేళ్లుగా తెలుసు .. ఆయనకి ఈ సినిమాలో మంచి రోల్ పడింది .. చాలా అద్భుతంగా చేశాడు.

సూర్యదేవర నాగవంశీ గారి విషయానికి వస్తే .. చాలా వండర్ఫుల్ వ్యక్తి. ఆయన ఎలాంటి లోపలు లేని మనిషి .. దగ్గరికి వెళ్లినా కొద్దీ ప్రేమ చూపిస్తూనే ఉంటారు. కథను నమ్మి డబ్బులు పెట్టే ఇలాంటి నిర్మాతల అవసరం ఇండస్ట్రీకి ఎప్పుడూ ఉంటుంది. ఇక చినబాబుగారు కూడా అంతే. నిజంగా ఒక పెళ్లి చేయాలంటే ఎంత కష్టపడాలో ఆయన ఈ సినిమాకి అంతగా కష్టపడ్డారు. రీతూ చాలామంచి నటి .. చాలా బాగా చేసింది. ఆమెతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. ఇక పూజ హెగ్డే ఈ ఫంక్షన్ కి గెస్టు అని నేను చెప్పలేను. నా కంటే ముందే ఈ బ్యానర్లో హిట్లు ఇచ్చేసి ఈ ఇంట్లో సెటిలైపోయారు .. ఒక ఫ్యామిలీ మెంబరులాగా. ఆమె ఈ సినిమా వేడుకలో పాలుపంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.