Begin typing your search above and press return to search.

'లక్ష్య' టార్గెట్ పూర్తయ్యింది.. తదుపరి లక్ష్యం అదే..!

By:  Tupaki Desk   |   30 Aug 2021 1:30 PM GMT
లక్ష్య టార్గెట్ పూర్తయ్యింది.. తదుపరి లక్ష్యం అదే..!
X
నాగ శౌర్య హీరోగా రూపొందుతోన్న స్పోర్ట్స్ డ్రామా ''లక్ష్య''. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇండియాలో ప్రాచీన విలువిద్య (ఆర్చరీ క్రీడ) నేపథ్యంలో తెరకెక్కుతున్న మొట్ట మొదటి సినిమా. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తైనట్లు మేకర్స్ వెల్లడించారు.

'లక్ష్య' షూటింగ్ టార్గెట్ పూర్తి చేయబడింది.. త్వరలో థియేటర్లలోకి వచ్చి మీ హృదయాలను గెలుచుకోవాలనేదే తదుపరి లక్ష్యం అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. చిత్రీకరణ కంప్లీట్ అవడంతో ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. వీలైనంత త్వరగా మిగతా పనులన్నీ పూర్తి చేసి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

'లక్ష్య' శౌర్య కెరీర్ లో మైలురాయి 20వ చిత్రం. ఇందులో నాగశౌర్య ఇంత‌కు ముందెన్న‌డూ కనిపించని స‌రికొత్త‌ లుక్‌ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో యువ హీరోని చూసి అందరూ షాక్ అయ్యారు. దీని కోసం కఠోర వ్యాయామాలు చేసి ఆరు పలకల దేహాన్ని సిద్ధం చేశాడు.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన 'లక్ష్య' ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతి బాబు - సచిన్ కేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే శౌర్య 'లక్ష్య' సినిమాతో పాటుగా 'వరుడు కావలెను' షూటింగ్ కూడా పూర్తి చేసాడు. అలానే హోమ్ బ్యానర్ లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.