Begin typing your search above and press return to search.

సీనియర్ వెర్సస్ జూనియర్.. గెలిచేదెవ్వరు?

By:  Tupaki Desk   |   2 Feb 2018 4:03 AM GMT
సీనియర్ వెర్సస్ జూనియర్.. గెలిచేదెవ్వరు?
X
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఈ వీకెండ్లో ఒక సీనియర్ హీరో.. ఒక యంగ్ హీరో అమీతుమీకి రెడీ అయ్యారు. ఆ సీనియర్ మాస్ రాజా రవితేజ కాగా.. జూనియర్ బబ్లీ బాయ్ నాగశౌర్య. వీళ్లిద్దరూ భిన్నమైన సినిమాలతో పోరుకు రెడీ అవుతున్నారు. మాస్ రాజా ఎప్పట్లాగే తనదైన శైలిలో చేసిన మాస్ సినిమా ‘టచ్ చేసి చూడు’. ఈ సినిమాలో కొత్తదనం ఏమీ ఉండేలా కనిపించట్లేదు ప్రోమోలు చూస్తే. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో కనిపించడం కొత్తేమీ కాదు. ‘విక్రమార్కుడు’.. ‘పవర్’ సినిమాల్లో ఆ క్యారెక్టర్లు చూసేశాం. ఇప్పుడు కొత్తగా ఏం చూపిస్తారో చూడాలి. యాక్షన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కలగలిపిన సినిమాలా ఉందిది.

ఇక నాగశౌర్య సినిమా ‘ఛలో’ విషయానికి వస్తే.. ఇది క్లాస్ టచ్ ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తోంది. ఆంధ్రా.. తమిళనాడు సరిహద్దుల్లోని ఒక గ్రామంలో నడిచే ఈ కథ హిలేరియస్ గా ఉంటుందని టీజర్.. ట్రైలర్ సంకేతాలిచ్చాయి. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. కెరీర్లో మంచి పేరు.. విజయాలు ఉన్నప్పటికీ పెద్ద కమర్షియల్ సక్సెస్ లేని లోటు నాగశౌర్యకు ఉంది. అది ఈ సినిమా తీర్చేస్తుందని ఆశిస్తున్నాడు. ‘టచ్ చేసి చూడు’ సినిమాతో విక్రమ్ సిరికొండ అనే కొత్త దర్శకుడు పరిచయం కానుండగా.. ‘ఛలో’ను రూపొందించింది కూడా వెంకీ కుడుముల అనే కొత్త దర్శకుడే. మరి వీళ్లిద్దరిలో ఎవరు సత్తా చాటుకుంటారు.. ఈ రెండు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ విజేతగా నిలుస్తుంది అన్నది ఆసక్తికరం.