Begin typing your search above and press return to search.

ఈ మూవీ కోసం 9 రోజులు నీళ్లు ముట్టుకోలేదట

By:  Tupaki Desk   |   10 Dec 2021 10:22 AM IST
ఈ మూవీ కోసం 9 రోజులు నీళ్లు ముట్టుకోలేదట
X
గత వారం విడుదలైన బాలయ్య ‘అఖండ’ సందడి ఒక కొలిక్కి రాక ముందే.. ఈ వారం మరిన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ వారం విడుదలవుతున్న చిత్రాల్లో పలువురిని ఆకర్షిస్తున్న మూవీ ‘లక్ష్య’. నాగశౌర్య హీరోగా నటించిన ఈ మూవీకి సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రత్యేకత ఏమంటే.. ఆర్చరీ క్రీడ మీద దేశంలో తీసిన మొదటి సినిమా ఇదే.

ఈ మూవీలో నాగశౌర్య లుక్ ఇప్పటికే అందరిని ఆకర్షిస్తోంది. సిక్స్ ప్యాక్ మాత్రమే కాదు.. చాక్లెట్ బాయ్ ఇమేజ్ కు భిన్నంగా.. కండలు మెలి తిరిగినట్లుగా.. ఫిట్ గా ఉన్న అతడి బాడీని హైలెట్ చేస్తూ వచ్చిన ప్రచార చిత్రాలు.. ఈ సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి. ఈ మూవీ కోసం నాగశౌర్య ఎంతగా శ్రమించాడన్న మాటకు.. అతడు చెప్పిన ఒక్క ఉదాహరణ సరిపోతుందేమో.

ఈ మధ్యనే అతడు నటించిన ‘వరుడు కావలెను’ మూవీ విడుదల కావటం.. అది పాజిటివ్ టాక్ రావటం తెలిసిందే. తక్కువ వ్యవధిలోనే నాగశౌర్య నటించిన మరో మూవీ ఈరోజు విడుదలవుతుంది. గత చిత్రం కంటే ఈ సినిమా మరింత సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. కథ విన్నంతనే.. తనకు నచ్చిందని.. నూటికి నూరు శాతం కమిట్ మెంట్ తో తాను నటించినట్లు చెప్పాడు.

‘లక్ష్య’తో నాగశౌర్యను సరికొత్తగా చూడటం ఖాయమని చెబుతున్నాడు. ఇలాంటి కథలు రావటమే అదృష్టమన్న అతడు.. ఏ ఆట అయినా సరే ప్రొఫెషనల్ గా వెళ్లాలంటే చాలా కష్టమని.. కానీ ఈ సినిమా కోసం తాను ఆర్చరీ నేర్చుకున్నట్లు చెప్పాడు. అంతేకాదు.. సినిమా షూటింగ్ లో భాగంగా తొమ్మిది రోజుల పాటు కనీసం మంచి నీళ్లు కూడా తీసుకోకుండా ఉన్నట్లు చెప్పాడు. ఇంతలా కష్టపడిన మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఏమైనా.. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు.. ఈ సినిమా కోసం నాగశౌర్య పడిన కష్టాన్ని తెలిపేలా ఉన్నాయనటంలో సందేహం లేదు.