Begin typing your search above and press return to search.

చైతు సోలో సినిమాలు చేయడా ?

By:  Tupaki Desk   |   19 July 2019 10:39 AM IST
చైతు సోలో సినిమాలు చేయడా ?
X
సక్సెస్ కు గత రెండేళ్లుగా దూరంగా ఉన్న నాగ చైతన్యకు మజిలీ ఆ లోటుని పూర్తిగా తీర్చేసింది. భార్య సమంతానే జోడిగా చేసుకుని హిట్ కొట్టిన చైతు ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. ప్రస్తుతం వెంకీ మామ కీలకమైన స్టేజిలో ఉంది. సెప్టెంబర్ లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఆలస్యమైనా అక్టోబర్ లో పక్కానే. దీని తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందే మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

మరోవైపు నాన్నతో కలిసి చేయాల్సిన సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఇది కూడా మన్మథుడు 2 విడుదల కాగానే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు కమిట్ అయిన మూడు సినిమాల్లో చైతుకి రెండు మల్టీ స్టారర్స్ ఉన్నాయి. ఒకటి మేనమామతో రెండోది నాన్నతో. కాంబినేషన్ పరంగా ఈ రెండింటికి మంచి క్రేజ్ ఉంది.

ఈ లెక్కన నాగ చైతన్యను ఎక్కువగా సోలో సినిమాల్లో చూడాలనుకుంటున్న అభిమానులు ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు. పైగా చైతు చేస్తున్న మల్టీ స్టారర్లు సీనియర్ మోస్ట్ స్టార్లతో. ఎంత లేదన్నా తెరమీద వాళ్ళ డామినేషన్ ఉంటుంది. అందులోనే చైతు షేర్ చేసుకుని సర్దుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక్కడే ఉన్న కథ అయితే సింగిల్ గా దున్నేయొచ్చు.

ఫాన్స్ కోరుకుంటున్నది కూడా ఇదే. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ కథా చర్చల దిశలో ఉంచిన నాగ చైతన్య అందులోనూ ఒకటి మరో యూత్ హీరోతో షేర్ చేసుకునేది అని టాక్. మజిలీతో అందుకున్న సక్సెస్ ట్రాక్ ని తిరిగి కంటిన్యూ చేయాలన్న పట్టుదలతో ఉన్న చైతుకు ఈ ఏడాది రెండో సక్సెస్ వెంకీ మామతో అందుతుందా లేదా ఇంకో రెండు మూడు నెలల్లో తేలిపోతుంది