Begin typing your search above and press return to search.

చైతూ సత్తా ఏంటో చూపించాల్సిన టైమొచ్చింది..!

By:  Tupaki Desk   |   15 Jun 2022 2:30 AM GMT
చైతూ సత్తా ఏంటో చూపించాల్సిన టైమొచ్చింది..!
X
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య గత కొన్నేళ్లుగా వరుస విజయాలు అందుకుంటూ.. ఫుల్ ఫార్మ్ లో కొనసాగుతున్నాడు. 'మజిలీ' 'వెంకీమామ' 'లవ్ స్టొరీ' 'బంగార్రాజు' వంటి నాలుగు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ చైతూ ఖాతాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన సినిమాలే కావడం విశేషం.

హిట్లు - బాక్సాఫీస్ లెక్కలను బట్టి చూస్తే, ప్రస్తుతం టాలీవుడ్ టైర్-2 హీరోల్లో చైతన్య టాప్ లో ఉన్నాడని చెప్పాలి. అయితే వరుస విజయాలు అందుకుంటున్నప్పటికీ. ఈ సినిమాల సక్సెస్ క్రెడిట్ కేవలం చైతన్య ఒక్కడికే ఇవ్వలేమని.. అందులో ఇతర నటీనటులు లేదా స్టార్ హీరోయిన్లకు కూడా భాగం ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'మజిలీ' విజయంలో సమంత కీలక పాత్ర పోషించగా.. 'లవ్ స్టోరీ' సక్సెస్ క్రెడిట్‌ లో సాయి పల్లవికి వాటా ఉంది. 'వెంకీమామ' మరియు 'బంగార్రాజు' అనేవి మల్టీస్టారర్లు. ఇక్కడ సీనియర్ స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున మరియు విక్టరీ వెంకటేష్ లు ఓపెనింగ్స్ మరియు కలెక్షన్లలో నాగ చైతన్యతో సమానంగా క్రెడిట్ పొందుతారు.

అందుకే వీటిని చైతూ సోలో హిట్స్ గా పరిగణించలేమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కినేని వారసుడు తన సత్తా ఏంటో చాటిచెప్పాల్సిన అవసరం ఉంది. ఇతర స్టార్స్ సపోర్ట్ లేకుండా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించాల్సి ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నాగ చైతన్య ''థ్యాంక్యూ'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా మోతాన్ని తన భుజస్కంధాలపై మోయవలసి ఉంది. ఇప్పటి వరకు చెప్పుకున్నట్లు ఇందులో ఇతర బిగ్ స్టార్స్ - అగ్ర కథానాయికలు లేరు. చైతూ పేరు మీదుగానే ఈ సినిమా మార్కెట్ చేయబడుతుంది.

ఇది కనుక భారీ ఓపెనింగ్స్ రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మాత్రం ఇప్పటి వరకు కామెంట్స్ చేసిన వాళ్లకు సమాధానం చెప్పినట్లు అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే చైతూ స్టార్ డమ్ కు ఇదే నిజమైన పరీక్ష. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో వేచి చూడాలి.

''థాంక్యూ'' చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. 'మనం' మరియు ప్రస్తుతం సెట్స్‌ పై ఉన్న 'ధూత' వెబ్ సిరీస్ తర్వాత దర్శక హీరోల హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో చై మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. రాశీ ఖన్నా - మాళవికా నాయర్ - అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు - శిరీష్‌ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బీవీఎస్ రవి దీనికి కథ అందించగా.. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'థ్యాంక్యూ' చిత్రాన్ని 2022 జూలై 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఇకపోతే నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ మూవీ 'లాల్ సింగ్ చద్దా' ఆగస్టు రెండో వారంలో థియేటర్లలోకి రాబోతోంది. దీని తర్వాత తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ ద్విభాషా చిత్రం చేయనున్నారు. పరశురాం పెట్లా - కిశోర్ తిరుమల - బొమ్మరిల్లు భాస్కర్ వంటి దర్శకులు చైతూ తో సినిమాలు చేయనున్నారు.