Begin typing your search above and press return to search.

ఊర మాస్ అల్లుడిగా.. ఈగో ఉన్న హీరోగా..

By:  Tupaki Desk   |   4 Jan 2018 12:30 AM GMT
ఊర మాస్ అల్లుడిగా.. ఈగో ఉన్న హీరోగా..
X
గత ఏడాది మొదట్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అక్కినేని నాగ చైతన్య ఆ తరువాత యుద్ధం శరణం సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్నాడు. అయితే 2018లో మాత్రం అలాంటి కథలను సెలెక్ట్ చేసుకోవద్దని కంటెంట్ ఉన్న కథలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. అంతే కాకుండా హిట్ ఫార్ములాను చాలా ఈజీగా క్యాచ్ చేస్తున్నాడట.

అదే తరహాలో ఆలోచించి మారుతి సినిమాని ఫైనల్ చేశాడు. అయితే ఆ సినిమా అత్తా అల్లుడి మధ్యన సాగుతోందని దర్శకుడు ముందే చెప్పేశాడు. అలాగే శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు చాలా వార్తలు వచ్చాయి. ఇక అసలు విషయానికి వస్తే.. సినిమా కథ గురించి ఒక రూమర్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అందుకు ఈ కంటెంట్ కథ కూడా అనుమానాలను రేపుతోంది. ఈ సినిమా కంటెంట్ గతంలో నాగార్జున నటించిన అల్లరి అల్లుడు సినిమా తరహాలో ఉండబోతోందట.

1993లో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. సినిమాలో నాగ్ అల్లుడిగా ఊర మాస్ రచ్చ చేయగా వాణిశ్రీ పొగరు అత్తగా సూపర్ అనేలా నటించారు. సినిమా మొత్తంగా మంచి విజయాన్ని అందుకొని నాగ్ కెరీర్ కు మరో ఉపును ఇచ్చింది. అయితే అదే ఫార్మాట్ లో చైతు కూడా అత్తగా కనిపించే రమ్యకృష్ణ తో పోటీ పడటానికి సిద్ధమవుతున్నాడట. ఈగో ఉన్న వ్యక్తిగా చైతు క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుందట. మరి నాగ్ హిట్టు కొట్టినట్లు ఆ ఫార్మాట్ తో చైతు హిట్టు కొడతాడో లేదో చూడాలి.