Begin typing your search above and press return to search.

మరీ అతిగా ఉంటుందేమో చైతూ..

By:  Tupaki Desk   |   7 Sep 2015 6:15 PM GMT
మరీ అతిగా ఉంటుందేమో చైతూ..
X
సౌండింగ్ బాగుందనుకున్నారో.. లేక తెలుగులో ఇంకే టైటిలూ దొరకలేదో కానీ.. నాగచైతన్య కథానాయకుడిగా రూపొందబోతున్న మలయాళ రీమేక్ ‘ప్రేమమ్’కి తెలుగులోనూ అదే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమాను తెలుగులో సమర్పించబోతున్న స్రవంతి మూవీస్ ‘ప్రేమమ్’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించడమే దీనికి నిదర్శనం. హారిక హాసిని క్రియేషన్స్ ప్రేమమ్ రీమేక్ ను రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి దర్శకుడు. ప్రేమమ్ అంటే మలయాళంలో ప్రేమ అనే అర్థం. ఐతే తెలుగు వెర్షన్ కి ప్రేమ అనే టైటిల్ పెడదామంటే ఇప్పటికే ఆ పేరుతో ఓ క్లాసిక్ ఉంది. ఐతే ‘ప్రేమమ్’ అనే సౌండింగేదో బాగుందనుకున్నారో ఏమో.. ఇదే టైటిల్ ఖాయం చేస్తున్నట్లున్నారు. ఐతే ఓ హిట్ మూవీని రీమేక్ చేస్తూ టైటిల్ కూడా అక్కడిదే పెడితే.. మరీ అతిగా ఉంటుందేమో కూడా ఆలోచించుకోవాలి.

ప్రస్తుతం గౌతమ్ మీనన్ తో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా చేస్తున్న నాగచైతన్య ఈ నెలఖార్లో ఫ్రీ అయిపోతాడు. వచ్చే నెలలో ‘ప్రేమమ్’ రీమేక్ మొదలవుతుంది. ‘కార్తికేయ’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన చందూ మొండేటి.. ప్రస్తుతం ‘ప్రేమమ్’ స్క్రిప్టును తెలుగు ఆడియన్స్ టేస్టుకు తగ్గట్లు తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు. ఓ కుర్రాడి జీవితంలో వివిధ దశల ప్రేమను చూపించే ప్రయత్నమే ‘ప్రేమమ్’. గతంలో ఆటోగ్రాఫ్ సినిమా కూడా ఇలాంటిదే కానీ.. దీని ప్రత్యేకతలు దీనికున్నాయి. మలయాళంలో రూ.60 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ప్రేమమ్ ఇటీవలే వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుని.. బ్లాక్ బస్టర్ స్టేటస్ సంపాదించింది. తెలుగు వెర్షన్ కు ఇప్పటికే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తయింది. బాలీవుడ్ భామ పరిణీతి ఓ కథానాయికగా నటించే అవకాశాలున్నాయి. మిగతా ఇద్దరు హీరోయిన్ల పాత్రల్ని దిశా పఠాని, అనుపమ పరమేశ్వరన్ పోషిస్తారు.