Begin typing your search above and press return to search.

సందేహాలక్కర్లేదు.. చైతూ ఓకే చేశాడు

By:  Tupaki Desk   |   20 Aug 2015 3:33 PM GMT
సందేహాలక్కర్లేదు.. చైతూ ఓకే చేశాడు
X
ప్రేమమ్.. రెండు నెలలుగా సౌత్ ఇండియన్ మూవీ సర్కిల్స్ లో ఈ పేరు ప్రకంపనలు రేపుతోంది. మలయాళంలో విడుదలైన తొలి రోజు నుంచి బీభత్సమైన కలెక్షన్లతో దుమ్మురేపుతున్న ఈ సినిమా గురించి పక్క ఇండస్ట్రీలు కూడా జోరుగా చర్చించుకుంటున్నాయి. రీమేక్ కోసం అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా కర్చీఫ్ వేసింది తెలుగు ఇండస్ట్రీనే. ముందు రామ్ హీరో అన్నారు. కానీ అతను వెనక్కి తగ్గాడు. నాగచైతన్య ముందుకొచ్చాడు. ఐతే చైతూ చేస్తున్నది నిజమా కాదా అన్న సందేహాలున్నాయి. ఐతే ఇప్పుడు చైతూ స్వయంగా చెప్పేశాడు ‘ప్రేమమ్’ రీమేక్ చేస్తున్నట్లు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని.. తెలుగులోకి రీమేక్ చేస్తున్నామని ప్రకటించాడు.

ప్రేమమ్ రీమేక్ గురించి సందేహాలు నెలకొనడానికి దానికి ఎంచుకున్న దర్శకుడే కారణం. కార్తికేయ లాంటి సెన్సేషనల్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన చందూ మొండేటి రెండో సినిమాగా రీమేక్ చేస్తాడా అని సందేహాలు నెలకొన్నాయి. ముందు చైతూకు చెప్పిన కథతోనే సినిమా చేస్తాడేమో.. రీమేక్ కు ఒప్పుకోడేమో అని అనుమానాలు వచ్చాయి. ఐతే పెద్ద హీరో, పెద్ద బ్యానర్ అనేసరికి చందూ తిరస్కరించలేకపోయినట్లున్నాడు. ఐతే మంచి ఫీల్ గుడ్ సినిమా కాబట్టి.. చందూ ప్రతిభ చూపించడానికి అవకాశం లేకపోలేదు. పైగా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసే బాధ్యత అతడికి కట్టబెట్టారు. మరి అతను తనదైన ముద్ర వేస్తాడేమో చూడాలి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల నిర్మాత రాధాకృష్ణ హారిక హాసిన క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది. ప్రస్తుతం చైతూ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.