Begin typing your search above and press return to search.

ఇంటర్యూ: అప్పటికంటే 100 రెట్లు కష్టపడాలి

By:  Tupaki Desk   |   22 Nov 2015 5:30 PM GMT
ఇంటర్యూ: అప్పటికంటే 100 రెట్లు కష్టపడాలి
X
యువ హీరోల్లో అక్కినేని యువ కెరటం నాగ చైతన్య ది స్పెషల్ ప్లేస్. యంగ్ జనరేషన్ యూత్ స్టోరీలకు ఫస్ట్ చాయిస్ చైతూనే. కెరీర్ లో మాస్ సినిమాలు కూడా చేసినా.. క్లాస్ మూవీస్ విషయంలో నాగచైతన్యకు పట్టం కట్టారు అభిమానులు. జోష్ వంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో అరంగేట్రం చేయడం ఒక్క చైతూకే చెల్లింది. ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్ టెయినర్ల విషయంలో ఈ కుర్ర హీరోకి పోటీ లేదని చెప్పాలి. ఏం మాయ చేశావే మూవీలో సమంతతో ఆడిన సయ్యాట నుంచి లేటెస్ట్ మనం వరకూ.. అన్నింటిలోనూ తనలోని విభిన్నమైన నటుడిని ఆవిష్కరించుకుంటూ వస్తున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో చిత్రం రిలీజ్ రెడీ చేశాడు చైతూ. ఈ మూవీ డిసెంబర్‌ లో విడుదల కానుండగా... నవంబర్‌ 23, సోమవారం పుట్టినరోజు సందర్భంగా నాగచైతన్యతో ఎక్స్‌ క్లూజివ్‌ ఇంటర్వ్యూ..

ఈ బర్త్ డే స్పెషాలిటీ ఏంటి ?
– పుట్టినరోజుకి ప్రత్యేకించి సెలబ్రేషన్స్‌ అలావాటు లేదు. అభిమానులందరినీ సంతోషంగా ఉంటే నచ్చుతుంది. బర్త్ డే వేడుకలకు ప్రాముఖ్యతనివ్వను.

‘మనం’ చిత్రంలో ఏఎన్నార్‌ వంటి లెజెండరీతో కలిసి భయం లేకుండా నటించారు. తాత-నాన్నగారితో కాంబినేషన్‌ సన్నివేశాల్లో చాలా మెచ్యూర్డ్‌ గా కనిపించారు. అదెలా సాధ్యమైంది ?
– స్క్రిప్టు చెప్పినప్పుడే చాలా భయం వేసింది. తాత ముందు ఇలా బిహేవ్‌ చేయమంటాడేంటి డైరెక్టర్‌ అనిపించింది. ఇంట్లో వేరేలా ఉంటాం. కానీ సెట్స్‌లో అంతా సడెన్‌ గా రివర్స్‌ అయిపోతుంది. తాతని బూతులు తిడుతూ.. ఏరా పోరా ముసలోడా అంటూ మాట్లాడ్డం అంటే మొదట్లో భయపడ్డాను. కానీ ఆయనే మార్గనిర్దేశం చేశారు. అందుకే భయం పోయింది.

నాన్నని బిట్టు అని పిలవడంపై !
– నాన్నతో ఫ్రీగానే ఉంటాను. మేం ఫాదర్‌ అండ్‌ సన్‌లా ఉండం. ఫ్రెండ్సులా, బ్రదర్స్‌ లా ఉంటాం. నాన్నతో నటించే సన్నివేశాల్లో ఎక్కువగా టెన్షన్‌ పడలేదు.

నాన్నగారితో కలిసి పియో పియోనే.. సాంగ్‌ కి స్టెప్పులేశారు..!
– నాన్నతో కలిసి డ్యాన్స్‌ చేసేప్పుడు స్టెప్‌ లు మిస్సవ్వకూడదని జాగ్రత్త తీసుకున్నా. రెండు రోజుల ముందే రిహార్సల్స్‌ చేశా. సెట్స్‌ లో మాత్రం ఫుల్ ఎంజాయ్‌ మెంట్ .

కెరీర్‌ గ్రాఫ్‌ గురించి చెప్పుకుంటే ముందుగా జోష్‌ తో ఏం నేర్చుకున్నారు?
– ప్రతి సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటా. జోష్‌ టైముకి నాకు ఏ అనుభవం లేదు. అప్పుడే యాక్టింగ్‌, డ్యాన్సులు, ఫైట్స్‌ నేర్చుకున్నా. నాన్నగారు చెప్పింది చేశానంతే. దిల్‌ రాజుగారు అనుభవజ్ఞుడైన నిర్మాత. ఆయన్ని నమ్మి ముందుకు వెళ్లాం. బైట ప్రేక్షకులు, అభిమానుల నుంచి ఎలాంటి పుల్లింగ్‌ ఉంటుందో జోష్‌ రిలీజయ్యాకే అసలు సంగతి తెలిసింది. జనం మారుతున్నారు. ట్రెండ్‌ మారింది. నాన్నగారి టైమ్‌ లో ఎంత కష్టపడ్డారో దానికంటే 100 రెట్లు ఎక్కువ కష్టపడాలని అర్థం చేసుకున్నా.

‘ఏమాయ చేశావే’ ఏం నేర్పింది?
– జోష్‌ టైమ్‌ లో బి - సి కేంద్రాల ఆడియెన్స్ కి ఏం నచ్చుతుంది? అనేది లెక్కలు వేసుకున్నాం. కానీ ఏమాయ చేశావే దర్శకుడు నా బాడీ లాంగ్వేజ్‌ కి తగ్గ క్యారెక్టర్‌ ఇచ్చాడు. అది నాకు పెద్ద ప్లస్‌ అయ్యింది. ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్‌ కి తగ్గ కథల్ని ఎంచుకోవాలని అర్థమైంది.

తర్వా మూవీస్ ఎక్స్‌ పీరియెన్స్‌ గురించి చెప్పండి..?
100 పర్సంట్‌ లవ్‌ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ పవర్‌ ఏంటో తెలిసింది.. యాక్షన్‌ సినిమా కంటే ఫ్యామిలీ సెంటిమెంట్‌ ఉన్న సినిమాకే శక్తి ఎక్కువని తెలిసొచ్చింది. బెజవాడ రామ్‌ గోపాల్‌ వర్మ మీద ఉన్న ప్రేమతో చేశాను. మంచి అనుభవం ఇచ్చిన సినిమా తడాఖా . అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా. ఆటోనగర్‌ సూర్య నేను బాగా నమ్మిన సినిమా. అయితే ఆలస్యంగా రిలీజవ్వడమో, ఇంకేదో నెగెటివ్‌ అయ్యింది. ఇక మనం నా కెరీర్‌ లో ది బెస్ట్‌ మూవీ. ఒక లైలా కోసం మూవీతో నాన్నగారు ప్రొడక్షన్‌ చూసుకుంటూ నటించమని చెప్పారు. ప్రొడక్షన్‌ అంటే నాకు ఇష్టమైన పని. నటుడిగా పూర్తిగా నిరూపించుకున్నాక సినిమాల నిర్మాణంపైనా దృష్టి సారిస్తాను.

గౌతమ్‌ మీనన్‌ తో రెండో సినిమా చేస్తున్నారు.. అప్పటికి ఇప్పటికీ ఆయనలో గమనించిన మార్పు?
– గౌతమ్‌ లో ఏ మార్పూ లేదు. నేనే మారానంతే. ఏమాయ చేశావే .. రొమాంటిక్‌ హీరోగా గుర్తింపునిచ్చింది.. సాహసం శ్వాసగా సాగిపో.. సినిమా కూడా ప్రథమార్థం రొమాంటిక్‌గా ఉంటుంది. సెకండాఫ్‌ నుంచి యాక్షన్‌ కంటెంట్‌ పెరుగుతుంది.

సాహసం శ్వాసగా సాగిపో రోడ్‌ ట్రిప్‌ మూవీనా?
– అవును ..ఫస్టాఫ్‌ లో ఓ లవ్‌స్టోరీ రోడ్‌ ట్రిప్‌ లో రన్‌ అవుతుంది. సెకండాఫ్‌ లో యాక్షన్‌ ఎక్కువగా ఉంటుంది.. అది కూడా సహజంగా ఉంటుంది.

ప్రేమమ్‌ రీమేక్‌ గురించి ?
– ప్రేమమ్‌ కథ నచ్చింది. స్కూల్లో ఉన్నప్పుడు ప్రేమ, కాలేజ్‌ లో ఉన్నప్పుడు ప్రేమ, మెచ్యూర్డ్‌ ఏజ్‌ లో పెళ్లి చేసుకున్నప్పుడు ఉండే ప్రేమ.. వీటన్నిటికీ మధ్య వేరియేషన్‌ ఒకే క్యారెక్టర్‌ ద్వారా చూపిస్తున్నాం. లైఫ్‌ జర్నీలో హీరో క్యారెక్టర్‌ మారే తీరు ఇంట్రెస్టింగ్‌ గా ఉంటుంది.

అఖిల్‌ గురించి మీ ఉద్దేశ్యం ఏంటి?
అఖిల్‌ చాలా బాగా నటించాడు. మొదటి సినిమాకే నాలుగైదు సినిమాల హీరోలా చేశాడు. నటుడిగానూ తొలి సినిమాతోనే నిరూపించుకున్నాడు. డ్యాన్సులు - ఫైట్స్‌ సూపర్బ్. దానికోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేశాడు. అఖిల్‌ పెర్ఫామెన్స్‌ విషయంలో మేం చాలా హ్యాపీ.

మీ పెళ్లి గురించి రకరకాల రూమర్స్‌ పై మీరేమంటారు?
ఆ రూమర్‌ ఎవరు మొదలు పెట్టారో వాళ్లకే తెలియాలి. వాళ్లనే అడగండి. ఆ అమ్మాయి ఎవరో చెప్పమనండి .. నేను కూడా తెలుసుకుంటాను! పెళ్లి చేసుకుంటే హ్యాపీగా చేసుకుంటా. అది దాచుకునే విషయం కాదు. ఓపెన్‌ గా హ్యాపీగా చెప్పుకుని చేసుకునేదే పెళ్లి.

మీ లక్ష్యంఏంటి?
అన్ని రకాల వెరైటీ సినిమాలు చేసి నన్ను నేను నిరూపించుకోవాలన్నదే నా గోల్.

భవిష్యత్‌లో దర్శకుడయ్యే ఆలోచన?
అలాంటి ఆలోచన లేదు. అయితే ప్రొడక్షన్‌లో కొనసాగుతాను.

డ్యూయల్‌ రోల్‌ చేసే ఉద్దేశ్యం లేదా?
హలోబ్రదర్‌ .. లాంటి సినిమా చేయాలి. అలా చేయాలంటే కథలు, దర్శకులు రావాలి.

అక్కినేని ఫ్యాన్స్‌ గురించి ?
నా ఫస్ట్‌ సినిమా జోష్‌ నుండి ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నిటినీ చూసి నన్ను బాగా ఎంకరేజ్‌ చేశారు. అభిమానుల ప్రోత్సాహంతోనే, వారికి నచ్చే విధంగా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నా.