Begin typing your search above and press return to search.

తమాషా మీద మ‌న‌సుపారేసుకున్న నాగచైతన్య..?

By:  Tupaki Desk   |   5 Feb 2022 3:30 AM GMT
తమాషా మీద మ‌న‌సుపారేసుకున్న నాగచైతన్య..?
X
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతూ బిజీగా గడుపుతున్న హీరోల్లో అక్కినేని నాగచైతన్య ఒకరు. గతేడాది 'లవ్ స్టోరీ' సినిమాతో మ్యాజికల్ బ్లాక్ బస్టర్ అందుకున్న చైతూ.. ఈ ఏడాది ప్రారంభంలో తన తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' వంటి మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో జోష్ లో ఉన్న చైతన్య.. ఇప్పుడు బాలీవుడ్ మూవీ 'తమాషా' మీద మ‌న‌సుపారేసుకున్నారని టాక్ వినిపిస్తోంది.

ర‌ణ‌బీర్ క‌పూర్ - దీపిక ప‌దుకుణే జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా ''తమాషా''. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. 2015లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూప‌ర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ హిందీ సినిమాని తెలుగులోకి రీమేక్ చేయ‌డానికి నాగచైతన్య ఆసక్తి కనబరుస్తున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

నిజానికి 'తమాషా' సినిమా చేసే సమయానికి ర‌ణ‌బీర్ - దీపిక జంట బ్రేకప్ చెప్పుకొని ఉన్నారు. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరూ కలిసి నటించడంతో ఈ సినిమాపై అప్పట్లో మంచి హైప్ క్రియేట్ అయింది. మరి ఇటీవలే సమంతతో తన నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన చైతన్య.. బాలీవుడ్ మూవీని తెలుగులోకి రీమేక్ చేస్తే హీరోయిన్ గా ఎవర్ని సెట్ చేసుకుంటారో చూడాలి. ఇకపోతే చైతూ సోదరుడు అఖిల్ ఫేవరేట్ చిత్రాల్లో 'తమాషా' కూడా ఒకటని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ లో ఎంట్రీ రెడీ అయ్యారు. అమీర్ ఖాన్ తో కలిసి చైతూ చేసిన ఈ పాన్ ఇండియా మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. అలానే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' అనే సినిమా చేస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

ఇదే క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించే ఓ హారర్ వెబ్ సిరీస్ తో చై డిజిటల్ స్పేస్ లో ఎంటర్ అవ్వనున్నారు. విక్రమ్ కె కుమార్ రూపొందించే ఈ ఒరిజినల్ లో అక్కినేని వారసుడు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇక చైతూ లైనప్ లో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ఓ సినిమా.. 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడలతో ఓ మూవీ ఉన్నాయి. అలానే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు - కిషోర్ తిరుమల వంటి దర్శకులు నాగచైతన్యతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ రానుంది.