Begin typing your search above and press return to search.

ఇలాంటి గాసిప్స్ నిజమైతే ఎంత బాగుంటుందో కదా...!

By:  Tupaki Desk   |   1 May 2020 8:00 PM IST
ఇలాంటి గాసిప్స్ నిజమైతే ఎంత బాగుంటుందో కదా...!
X
సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలకి ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌ లో చూడాలని సినీ అభిమానులు ఆశిస్తూ ఉంటారు. దర్శకులు కూడా స్టార్ హీరోలను ఒకేసారి డైరెక్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. టాలీవుడ్‌ లో మొదటి తరం హీరోలు మల్టీస్టారర్ మూవీలు చేయడానికి ఆలోచించేవారు కాదు. అక్కినేని నాగేశ్వరరావు - ఎన్టీఆర్ - కృష్ణ - కృష్ణం రాజు - శోభన్ బాబు ఇలా అందరు హీరోలు కలిసి నటించిన వారే. ఆ తర్వాతి జనరేషన్ హీరోలు చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - బాలయ్య వంటి వారు మాత్రం ఈ తరహా సినిమాలు చేయలేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సీనియర్ హీరోల త్రయం చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ లతో సినిమా తీయాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పటి జనరేషన్ హీరోలు మాత్రం ప్రయోగాలు చేయడానికి ఇష్ట పడుతున్నారు. అందుకే గతంతో పోలిస్తే ఇప్పుడు మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ కోసం విక్టరీ వెంకటేశ్ - సూపర్ స్టార్ మహేష్‌బాబు లాంటి స్టార్ హీరోలు కలిశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి స్టార్ హీరోలు ముందుకొస్తున్నారు. ఈ మధ్య వచ్చిన మల్టీస్టారర్ లలో చాలా వరకు సూపర్ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా ‘గోపాల గోపాల', ‘ఎఫ్ 2', ‘వెంకీమామ' వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అందుకే మిగిలిన హీరోలు సైతం అలాంటి సినిమాలు చేయాలని భావిస్తున్నారు. దర్శకనిర్మాతలు కూడా వాటిపై దృష్టి సారిస్తున్నారు.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. వీటితో పాటు నాని - సుధీర్ బాబు కలిసి 'వి' సినిమాలో నటిస్తున్నారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య'లో సైతం చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. వీటితో పాటు 'లూసీఫర్' రీమేక్, ‘మహాసముద్రం', ‘ఎఫ్ 3' వంటివి పట్టాలెక్కాల్సి ఉంది. తెలుగులో మల్టీస్టారర్ మూవీల హవా నడుస్తున్న ఈ సమయంలో మరో భారీ మల్టీస్టారర్ రాబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకి వచ్చింది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - నేచురల్ స్టార్ నాని కలయికలో ఆ మూవీ రాబోతోందట. ఈ సినిమాకి ‘సంతోషం' ‘మిస్టర్ పర్‌ఫెక్ట్' సినిమాలు రూపొందించిన దశరథ్ దర్శకత్వం వహించనున్నాడట. ఈ సినిమాను వాల్‌ పోస్టర్ బ్యానర్‌ పై నాని.. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌ పై పవర్ స్టార్ కలిసి నిర్మిస్తున్నారని.. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పకుడిగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది. ముగ్గురు అన్నాదమ్ముల కథతో ఈ సినిమా తెరకెక్కబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్‌ లో మరో భారీ మల్టీస్టారర్ రాబోతుందన్న వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తోంది. ఇది పుకారుగానే మిగిలిపోనుందా.. లేదా నిజం కానుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. నిజానికి ఇలాంటి గాసిప్స్ నిజమైతే ఎంత బాగుంటుందో కదా...!