Begin typing your search above and press return to search.

ఎలాగైతేనేం.. హిట్లు కొడుతున్నాడు

By:  Tupaki Desk   |   22 Jan 2022 3:39 AM GMT
ఎలాగైతేనేం.. హిట్లు కొడుతున్నాడు
X
అక్కినేని నాగ‌చైత‌న్య‌కు కాలం భ‌లే క‌లిసొస్తోంది ఈ మ‌ధ్య‌. ఒక‌ప్పుడు నిల‌క‌డ‌గా విజ‌యాలందుకోలేక బాగా ఇబ్బంది ప‌డ్డ అత‌ను.. కొన్నేళ్ల నుంచి వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. అయితే అత‌డి సినిమాలకు వ‌స్తున్న టాక్‌తో పోలిస్తే అవి సాధిస్తున్న విజ‌యాలు చాలా పెద్ద‌వి. చివ‌ర‌గా అత‌ను ఫ్లాప్ ఎదుర్కొంది స‌వ్య‌సాచి సినిమాతో. 2018లో విడుద‌లైన ఆ చిత్రం పెద్ద డిజాస్ట‌ర్ అయింది. ఆ త‌ర్వాత మాత్రం చైతూకు ఫెయిల్యూర్ లేదు. త‌ర్వాతి ఏడాది మ‌జిలీతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు చైతూ.

ఆ సినిమాకు మంచి టాకే వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యే సినిమా మాత్రం కాద‌ది. ఇందులో చైతూను మించి స‌మంత పాత్ర, న‌ట‌న హైలైట్ అయింది. ఆమె స్టార్ ప‌వ‌ర్, రిలీజ్ టైమింగ్ కూడా తోడై సినిమా పెద్ద హిట్ట‌యింది. ఇక చాలా యావ‌రేజ్ మూవీ అయిన వెంకీ మామ‌కు కూడా టైమింగ్ క‌లిసొచ్చి హిట్ట‌యింది.

ఇక గ‌త ఏడాది విడుద‌లైన ల‌వ్ స్టోరి సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ఎక్కువ‌గా నెగెటివ్ టాకే వ‌చ్చింది. స‌మీక్ష‌లు బాగా లేవు. ప్రేక్ష‌కుల నుంచి కూడా మిశ్ర‌మ స్పంద‌నే వ‌చ్చింది. అయినా ఆ సినిమా రిలీజ్‌కు ముందు హైప్, క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత ప్రేక్ష‌కులు క్రేజీ మూవీ కోసం చూస్తున్న టైంలో విడుద‌ల కావ‌డం బాగా క‌లిసొచ్చింది. వ‌సూళ్ల ప‌రంగా చూస్తే అది హిట్ మూవీనే. ఇక సంక్రాంతికి రిలీజైన బంగార్రాజుది మ‌రో చిత్ర‌మైన క‌థ‌. ఈ సినిమా చూసిన ఎవ్వ‌రూ సంతృప్తిగా లేరు. స‌మీక్ష‌లు ప్ర‌తికూలంగా వ‌చ్చాయి. మౌత్ టాక్ కూడా బాగా లేదు.

కానీ సంక్రాంతికి పేరున్న సినిమాలేవీ లేని టైంలో రిలీజ్ కావ‌డం, పోటీగా వ‌చ్చిన చిన్న సినిమాల‌కు బ‌జ్ లేక‌పోవ‌డం, వాటికి టాక్ మ‌రీ బ్యాడ్‌గా ఉండ‌టం దీనికి క‌లిసొచ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా ఏపీలో ఈ సినిమా భారీ వ‌సూళ్లే రాబ‌ట్టింది. తెలంగాణ‌లో వ‌సూళ్లు త‌క్కువున్న‌ప్ప‌టికీ ఓవ‌రాల్‌గా ఈ సినిమా సూప‌ర్ హిట్ అనే చెప్పాలి. ఇలా చైతూకు కొన్నేళ్లుగా భ‌లేగా క‌లిసొచ్చి వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్లిపోతున్నాడు.