Begin typing your search above and press return to search.

చైతూ ఈగోకి పోకుండా ఆ దర్శకుడికి మళ్లీ ఛాన్స్‌

By:  Tupaki Desk   |   29 April 2022 11:30 PM GMT
చైతూ ఈగోకి పోకుండా ఆ దర్శకుడికి మళ్లీ ఛాన్స్‌
X
అక్కినేని హీరో నాగ చైతన్య ఈ ఏడాది ఆరంభంలో బంగార్రాజు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక హిందీలో ఈయన కీలక పాత్రలో నటించిన ఆమీర్ ఖాన్‌ సినిమా లాల్‌ సింగ్ చద్దా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా రూపొందింది. ఆ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. విడుదల తేదీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

థ్యాంక్యూ సినిమాను ముగించిన వెంటనే నాగ చైతన్య మరియు విక్రమ్‌ లు కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం 'దూత' అనే వెబ్‌ సిరీస్ ను చేస్తున్నారు. ఆ వెబ్‌ సిరీస్ కూడా ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక నాగ చైతన్య తదుపరి సినిమా ఏమై ఉంటుంది అనుకుంటున్న సమయంలో దర్శకుడు పరశురామ్‌ ఒక క్లారిటీ ఇచ్చాడు.

ఆయన తెరకెక్కించిన సర్కారు వారి పాట సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాకు సంబంధించిన ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో పరశురామ్‌ మాట్లాడుతూ తదుపరి సినిమాను నాగ చైతన్యతో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. తమ ఇద్దరి కాంబో సినిమాను 14 రీల్స్ బ్యానర్‌ నిర్మించబోతున్నట్లుగా కూడా ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.

వీరిద్దరి కాంబోలో ఇప్పటికే సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది. గీత గోవిందం సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నాగ చైతన్య హీరోగా ఒక సినిమాను అధికారికంగా పరశురామ్‌ ప్రకటించాడు. సినిమా నిర్మాణ పనులు కూడా మొదలు అయిన సమయంలో పరశురామ్‌ కు అనూహ్యంగా మహేష్ బాబు నుండి ఆఫర్ వచ్చింది. దాంతో నాగ చైతన్య సినిమా ను పరశురామ్‌ పక్కన పెట్టేశాడు.

అలా తన సినిమా ను అనౌన్స్ చేసి పక్కన పెట్టేస్తే ఏ హీరోకి అయినా కోపం వస్తుంది. మహేష్ బాబు తో సినిమా కోసం తనను పక్కన పెట్టాడు అనే కోపం ను పరశురామ్‌ పై నాగ చైతన్య చూపించకుండా తర్వాత చేసేందుకు ఒప్పుకోవడం అనేది ఆయన మంచితనం కు నిదర్శనం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పరశురామ్‌ సర్కారు వారి పాట సినిమా తో సక్సెస్ దక్కించుకుంటే చైతూ సినిమాకు భారీ క్రేజ్ దక్కే అవకాశం ఉంది. నాగ చైతన్య మరియు పరశురామ్‌ కాంబోలో సినిమా రెండేళ్ల క్రితమే చర్చలు జరిగాయి కనుక.. స్క్రిప్ట్‌ లో పెద్దగా మార్పులు ఏమీ లేకుండా సినిమా ను జులై లేదా ఆగస్టులో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.