Begin typing your search above and press return to search.

'లవ్ స్టోరీ' చేసినందుకు గర్వంగా ఉంది: నాగచైతన్య

By:  Tupaki Desk   |   20 Sep 2021 5:30 AM GMT
లవ్ స్టోరీ చేసినందుకు గర్వంగా ఉంది: నాగచైతన్య
X
నాగచైతన్య తన కెరియర్లో ప్రేమకథలు చేశాడు .. యాక్షన్ సినిమాలు చేశాడు. అయితే ప్రేమకథలే ఆయనకి ఎక్కువ గుర్తింపును తెచ్చిపెట్టాయి .. ఎక్కువ విజయాలను అందించాయి. అలాంటి చైతూ నుంచి మరో ప్రేమకథగా 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చైతూ మాట్లాడాడు .. 'ఈ సినిమా టీమ్ కి మెగాస్టార్ ఇచ్చిన సపోర్ట్ ను మరచిపోలేము. కరోనా సమయంలో ఇండస్ట్రీకి చిరంజీవిగారు అందించిన సహాయ సహకారాలు స్ఫూర్తిని కలిగించాయి. అలాగే ఆమిర్ ఖాన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఆమిర్ సార్ ట్రైలర్ చూసి నాకు మెసేజ్ చేశారు. ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందనే విషయం ఆ సమయంలోనే నేను చెప్పాను. వెంటనే ఆయన నేను వస్తాను అని చెప్పేసి వచ్చారు .. నిజంగా ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. 'లాల్ సింగ్ చద్దా' సినిమా కోసం ఆయనతో కలిసి నేను 45 రోజులు పనిచేశాను. ఆ అనుభవం .. ఆ జ్ఞాపకాలు నా కెరియర్ కి ఎంతో ఉపయోగపడతాయి. నిజంగా నాకు దక్కిన గొప్ప అవకాశం అది. ఇక చాలా కాలం తరువాత నా అభిమానుల ముందుకు వచ్చాను. కోవిడ్ నిబంధనల వలన క్రౌడ్ ను లిమిట్ గా మాత్రమే అనుమతించవలసి వచ్చింది.

'లవ్ స్టోరీ' విషయానికొస్తే నేను ఏ సినిమాను కూడా ఇంత ఇన్వాల్వ్ అవుతూ .. డెప్త్ కి వెళుతూ చేయలేదు. ఏ పాత్ర కూడా నన్ను ఇంతగా ప్రభావితం చేయలేదు. అందుకు కారణంగా శేఖర్ కమ్ములగారే. షూటింగు మొదలైన తరువాత నాకు శేఖర్ గారి స్టైల్ కొంచెం కొత్తగా అనిపించింది. ఒకటి రెండు వారాల పాటు ఆయన స్టైల్ ను పరిశీలిస్తూ ఉండిపోయాను. కథాకథనాలకు .. పాత్రలకు ఆయన ఎంత ప్రాధాన్యతను ఇస్తారనే విషయం నాకు అర్థమైంది. ఈ మనిషి కోసం ఎంత దూరమైనా వెళ్లవచ్చని అప్పుడు నాకు అనిపించింది.

ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోవద్దనే నేను నా తోటి నటీనటులకు చెప్పేమాట. ఆయన ప్రత్యేకించి నేర్పరు .. నేర్చుకునేలా చేస్తారు. ఈ సినిమా ద్వారా ఆయన రెండు ముఖ్యమైన విషయాలను చెప్పబోతున్నారు. అలాంటి అంశాలను గురించి సున్నితంగా చెప్పవలసి ఉంటుంది .. అది శేఖర్ కమ్ముల వలన మాత్రమే అవుతుంది. ఆ రెండు విషయాలను చెప్పే ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నాకు గర్వంగా అనిపిస్తోంది. ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనే నిర్మాతల పట్టుదలను అభినందించకుండా ఉండలేం. సాయిపల్లవి నాలోని నటుడిని మరింత ఎలివేట్ అయ్యేలా చేసింది. ఆమెతో మరిన్ని సినిమాలు చేయాలనుంది" అంటూ చెప్పుకొచ్చాడు.