Begin typing your search above and press return to search.

నాగ‌బాబుకు మెగా బ్ర‌ద‌ర్స్ త‌లంటారా?

By:  Tupaki Desk   |   20 May 2020 4:30 AM GMT
నాగ‌బాబుకు మెగా బ్ర‌ద‌ర్స్ త‌లంటారా?
X
మెగా బ్ర‌ద‌ర్స్ ముగ్గురిలోకి చిరంజీవి చాలా సాత్వికంగా ఉంటారు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్ల‌రు. ఆయ‌న చాలా నెమ్మ‌ద‌స్తుడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌ప్పుడు ఆవేశంతో క‌నిపించేవాడు కానీ.. గ‌త కొన్నేళ్ల‌లో అత‌నెంతో మారాడు. దూకుడు త‌గ్గించుకున్నాడు. రాజ‌కీయాల్లో ఉంటున్నా కూడా అన‌వ‌స‌ర వివాదాల జోలికి వెళ్ల‌ట్లేదు. కానీ నాగ‌బాబు రూటు మాత్రం వేరు. నా ఇష్టం పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి అందులో చేసే వ్యాఖ్యానాల‌తో అనేక‌ సార్లు వార్త‌ల్లో నిలిచాడాయ‌న‌. ట్విట్ట‌ర్ వేదిక‌గా కూడా నాగ‌బాబు అప్పుడ‌ప్పుడూ వివాదాల్లో త‌ల‌దూరుస్తుంటాడు. ఐతే ఈ క్ర‌మంలో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని టార్గెట్ చేస్తే జ‌న‌సైనికులు గ‌ట్టిగానే మద్ద‌తిస్తున్నారు. కానీ ఆయ‌న తాజాగా అవ‌స‌రం లేని అంశంలో వేలు పెట్టారు. మ‌హాత్మా గాఃధీని హ‌త్య చేసిన గాడ్సేను దేశ‌భ‌క్తుడిగా అభివ‌ర్ణిస్తూ అసంద‌ర్భోచిత ట్వీట్ వేశారు.

దీనిపై పెద్ద దుమార‌మే రేగింది. నాగ‌బాబు ఉద్దేశం ఏదైనా స‌రే.. ఈ ట్వీట్లు అయితే చెడు సందేశాన్ని తీసుకెళ్లాయి. మ‌హాత్మా గాంధీని అభిమానించే వాళ్లంతా నొచ్చుకున్నారు. స్వ‌యంగా జ‌న‌సైనికులే నాగ‌బాబుపై విరుచుకుప‌డ్డారు. ఇది జ‌న‌సేన‌కు ఇబ్బందిగా ప‌రిణ‌మించింది. నాగ‌బాబును డిఫెండ్ చేయ‌లేక మెగా ఫ్యామిలీ, జ‌న‌సేన మ‌ద్ద‌తుదారుల‌కు క‌ష్ట‌మైంది. ప‌రిస్థితి చూసి ఇటు చిరంజీవి, అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ నాగ‌బాబుతో మాట్లాడార‌ని.. ఆయ‌న్ని మంద‌లించార‌ని.. వెంట‌నే వివ‌ర‌ణ ఇస్తూ ట్వీట్ చేయ‌మ‌న్నార‌ని స‌మాచారం.

మామూలుగా తన వ్యాఖ్య‌లు ఎంత‌ వివాదాస్ప‌దం అయినా వివ‌ర‌ణ ఇవ్వ‌ని నాగ‌బాబు.. ఈ ఇష్యూలో మాత్రం భిన్నంగా స్పందించాడు. దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు.నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను.నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం .ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం అంటూ వివ‌ర‌ణ ఇచ్చాడు నాగ‌బాబు.