Begin typing your search above and press return to search.

మ‌హానాయ‌కుడు ట్రైల‌ర్‌!... వీరి సైలెన్స్ క‌థేమిటో!

By:  Tupaki Desk   |   20 Feb 2019 5:34 PM GMT
మ‌హానాయ‌కుడు ట్రైల‌ర్‌!... వీరి సైలెన్స్ క‌థేమిటో!
X
తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఎన్టీఆర్ బ‌యోపిక్‌లోని రెండో పార్ట్ *ఎన్టీఆర్‌- మ‌హానాయ‌కుడు* పెను ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు గానీ... మాజీ సీఎం నాదెండ్ల భాస్క‌ర‌రావు, కాంగ్రెస్ పార్టీలు మాత్రం దీనిపై విరుచుకుప‌డే అవ‌కాశాలున్నాయ‌న్న వార్త‌లు వినిపించాయి. ఎన్టీఆర్ నుంచి అధికారం లాగేసుకున్న నాదెండ్ల.. ఈ సినిమాలో త‌న‌ను విల‌న్‌గా చూపిస్తే... హీరో బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు క్రిష్‌ల‌పై కోర్టుకెక్కుతానంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అంతేకాకుండా ఆయ‌న ఇప్ప‌టికే బాల‌య్య‌, క్రిష‌ల‌తో పాటు సెన్సార్ బోర్డుల‌కు కూడా నోటీసులు పంపారు.

ఇక మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీని కూడా ఈ సినిమాలో విల‌న్‌గా చూపే అవ‌కాశాలున్నాయ‌ని అనుమానం వ్య‌క్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నేత‌లు తామూ సైలెంట్‌గా ఉండేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మ‌హానాయకుడు ట్రైల‌ర్ విడుద‌ల కావ‌డం, మ‌రో రెండు రోజుల్లో ఈ చిత్రం విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఇటు నాదెండ్ల‌తో పాటు అటు కాంగ్రెస్ పార్టీ నేత‌లు కూడా సైలెంట్‌గా ఉంటున్న వైనంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ట్రైల‌ర్ చూస్తుంటే... నాదెండ్ల‌ను నిజంగానే విల‌న్‌గా చూపించేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఇందిర‌ను కూడా విల‌న్‌గానే చూపించార‌న్న ఆధారాలు కూడా ట్రైల‌ర్‌లో ఉన్నాయి.

అయిన‌ప్ప‌టికీ ఇటు నాదెండ్ల గానీ, అటు కాంగ్రెస్ నేత‌లు గానీ ఎందుకు సైలెంట్‌గా ఉండిపోయార‌న్న‌దే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. నాదెండ్ల భాస్క‌ర‌రావు విష‌యానికి వ‌స్తే... ట్రైల‌ర్ పెద్ద‌గా ఆసక్తిక‌రంగా లేద‌న్న భావ‌న‌తోనే ఆయ‌న సైలెంట్‌గా ఉండిపోయార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఈ ట్రైల‌ర్‌ను కెలుక్కోవ‌డం ద్వారా అన‌వ‌స‌ర ఇబ్బందులు కొని తెచ్చుకోవ‌డం ఎందుక‌న్న భావ‌న‌తో హ‌స్తం పార్టీ నేత‌లున్న‌ట్లుగా స‌మాచారం. మొత్తానికి అంచ‌నాలు అందుకోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైన ఈ చిత్రంపై ఇటు జ‌నాల‌తో పాటు ఈ సినిమా కార‌ణంగా తాము విల‌న్ల‌మైపోతామ‌ని భావించిన వారు కూడా సైలెంట్ అయిపోయార‌న్న వాద‌న వినిపిస్తోంది.