Begin typing your search above and press return to search.

పవన్ సినిమాలు చేయడం ఖాయమే!

By:  Tupaki Desk   |   30 Oct 2018 5:50 PM IST
పవన్ సినిమాలు చేయడం ఖాయమే!
X
అజ్ఞాతవాసి తర్వాత ఇక సినిమాలు చేయను పూర్తిగా జనసేనకు అంకితమైపోతాను అని ప్రకటించి షూటింగ్ లకు పూర్తిగా స్వస్తి పలికేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాకపోయినా వచ్చే ఏడాదో లేక ఆపై సంవత్సరమో తిరిగి వస్తాడని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. వాళ్ళ ఆశలకు బలం చేకూర్చేలా మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు సవ్యసాచి ప్రమోషన్స్ లో మాట్లాడ్డం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది. గతంలో మైత్రి సంస్థకు ఓ సినిమా చేసేందుకు పవన్ అడ్వాన్స్ తీసుకున్నాడు. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తమిళ బ్లాక్ బస్టర్ తేరి రీమేక్ ని తెలుగీకరించి స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసాడు. కానీ ఈలోపు పవన్ నిర్ణయం మారిపోయింది. దీంతో సహా ఇంకే సినిమాలు చేయనని చెప్పేసాడు. దీంతో మైత్రి సంస్థ తామిచ్చిన అడ్వాన్స్ వెనక్కు తీసేసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

వాటికి మైత్రి పార్ట్ నర్స్ నవీన్-రవి శంకర్-మోహన్ క్లారిటీ ఇచ్చేసారు. పవన్ తో అడ్వాన్స్ వెనక్కు తీసుకోలేదని ఆయనతో సినిమా చేయడం మా లక్ష్యమని ఇప్పుడు కాకపోయినా పవన్ భవిష్యత్తులో ఎప్పుడు కం బ్యాక్ ఇచ్చినా తమకే చేస్తారని చెప్పడం చూస్తే ఎన్నికలు అయ్యాక పవన్ వీళ్ళతో చేసే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. అంతే కాదు పవన్ బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ తో కూడా వీళ్లకో సినిమా ఉందట. నవంబర్ లో సవ్యసాచి-అమర్ అక్బర్ ఆంటోనీ విడుదలతో బాగా బిజీగా ఉన్న మైత్రి మేకర్స్ చిన్నా పెద్ద తేడా లేకుండా ఛాన్స్ ఉన్న హీరోలందరితోనూ ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకెళ్ళిపోతోంది. వీళ్ళ స్పీడ్ చూసి అగ్ర నిర్మాతలు సైతం ఆశ్చర్యపోతున్నారు.