Begin typing your search above and press return to search.

నా ప్రేయ‌సి బ‌యోపిక్ నేనే తీస్తాః విశాల్

By:  Tupaki Desk   |   24 March 2021 7:00 AM IST
నా ప్రేయ‌సి బ‌యోపిక్ నేనే తీస్తాః విశాల్
X
త‌న ప్రేయ‌సి బ‌యోపిక్ తీయ‌బోతున్నట్టు ప్ర‌క‌టించారు కోలీవుడ్‌ యువ న‌టుడు విష్ణు విశాల్. ఆయ‌న అప్ క‌మింగ్ మూవీ 'కాడ‌న్' ఈ నెల 26న రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది త‌న సినిమాలు నాలుగు విడుద‌ల కానున్నాయ‌ని, అందులో 'కాడ‌న్' మొద‌ట‌గా రాబోతోంద‌ని చెప్పారు.

ఇందులో రెండు చిత్రాల‌ను తానే స్వ‌యంగా నిర్మించిన‌ట్టు చెప్పారు. 'ఎఫ్ఐఆర్‌', 'మోహ‌న్ దాస్‌' చిత్రాలకు తానే నిర్మాతగా ఉన్నట్టు తెలిపారు విష్ణు విశాల్. ఇదే సమయంలో తన పెళ్లి వార్తను కూడా మీడియాతో పంచుకున్నారు. బ్మాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. వీళ్లిద్దరూ ఎంతోకాలంగా సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే.. వీళ్లిద్దరికీ ఇది రెండో పెళ్లికావడం గమనార్హం.

ఈ పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఇది ప్రేమ వివాహం కాద‌ని చెప్పాడు విష్ణు విశాల్‌. గ‌తంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాన‌ని, కానీ.. ఆ వైవాహిక జీవితం విషాదాన్నే మిగిల్చింద‌ని చెప్పారు. అందువ‌ల్ల తాము ఇద్ద‌రం ఇప్పుడు ఒక‌రినొక‌రు గౌర‌వించుకొని, అర్థం చేసుకుని పెళ్లి చేసుకోబోతున్నామ‌ని చెప్పుకొచ్చారు.

ఇదే కాకుండా మ‌రో విష‌యం కూడా వెల్ల‌డించారు విష్ణు విశాల్‌. త‌న‌కు కాబోయే భార్య గుత్తాజ్వాల జీవిత చ‌రిత్ర‌ను సెల్యూలాయిడ్ పై ఆవిష్క‌రించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఆమె బ‌యోపిక్ తీయ‌బోతున్నాన‌ని, ఈ విష‌యం గురించి ఎప్ప‌టి నుంచో ఆలోచిస్తున్న‌ట్టు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాన‌ని చెప్పారు విశాల్‌.

కాగా.. గుత్తాజ్వాల గ‌తంలో బ్యాడ్మింట‌న్ క్రీడ‌కారుడు చేత‌న్ ఆనంద్ ను పెళ్లి చేసుకుని, 2011లో విడిపోయారు. విష్ణు విశాల్ కూడా రజనీ నటరాజన్ ను పెళ్లి చేసుకొని, ఆ తర్వాత 2018లో విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత నుంచి వీరిద్ద‌రూ ద‌గ్గ‌ర‌గా ఉంటూ వ‌చ్చారు.