Begin typing your search above and press return to search.

చిరు కెరీర్ బెస్ట్ నిర్మాత‌ చ‌ర‌ణ్.. మ‌రి అర‌విందో?

By:  Tupaki Desk   |   30 Sep 2019 6:20 AM GMT
చిరు కెరీర్ బెస్ట్ నిర్మాత‌ చ‌ర‌ణ్.. మ‌రి అర‌విందో?
X
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు.. జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! .. మెగాస్టార్ ఆనందం చూస్తుంటే సుమ‌తీ శ‌త‌కం గుర్తుకు రావాల్సిందే. నిన్న‌టి సాయంత్రం బెంగ‌ళూరు మీడియా మీట్ లో చిరు ఎమోష‌న్ అయిన తీరు ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

సైరా ప్ర‌చారంలో చిరంజీవి ఎంతో ఎమోష‌న‌ల్ గా మాట్లాడుతూ త‌న క‌ల‌ల ప్రాజెక్ట్ సైరాను తన‌కు రామ్ చ‌ర‌ణ్ కానుక‌గా ఇచ్చార‌ని అన్నారు. నా కెరీర్ బెస్ట్ ప్రొడ్యూస‌ర్ రామ్ చ‌ర‌ణ్ అంటూ కితాబిచ్చారు చిరు. మ‌గ‌ధీర టైమ్ లో అలాంటి క్యారెక్ట‌ర్ నాకు రానందుకు జెల‌సీ ఫీల‌య్యాన‌ని క‌న్నడిగుల‌కు చెప్పారు చిరు. రామ్‌ చరణ్‌ రెండో సినిమా మగధీరలో చేసిన క్యారెక్టర్‌ చూసీ నేను ఇన్ని సినిమాలు చేసినా.. ఇలా కత్తి పట్టుకుని చేసే అవకాశం నాకు రాలేదని చరణ్ తో అన్నాను. ఆ తర్వాత దాన్ని వదిలేశాను. నాడు ఆ మాట‌ను తాను మ‌ర్చిపోయినా చ‌ర‌ణ్ మ‌ర్చిపోకుండా ఇంత భారీ చిత్రం సైరాను త‌న‌కు కానుక‌గా ఇచ్చాడ‌ని అన్నారు. వేదికపై చ‌ర‌ణ్ ని కౌగిలించుకుని ముద్దాడారు. తండ్రి త‌న‌యుల ఈ ఆప్యాయ‌త క‌న్న‌డిగ అభిమానుల‌కు చూడ‌ముచ్చ‌టైన దృశ్య‌మే. అయితే చిరుకి కెరీర్ ఆరంభం వెన్నంటి నిలిచిన అల్లు అర‌వింద్ ని మెగాస్టార్ మ‌ర్చిపోయారేమిటో. పుత్రోత్సాహం ముందు అది నిల‌వ‌లేద‌ని అంద‌రికీ అర్థ‌మైంది.

ఇక ఇదే వేదిక‌పై క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్ నా దేవుడు.. అంటూ చిరు ఎంతో విన‌మ్ర‌త‌ను చాటుకున్నారు. ఇందులో నేప‌థ్యంలో వాయిస్ ని శివ‌న్న (శివ‌రాజ్ కుమార్) చేత చెప్పించాల్సింది కుద‌ర‌లేదు. వేరొక‌రితో చెప్పించాం. తెలుగులో నా త‌మ్ముడు ప‌వ‌న్ వాయిస్ ఇచ్చారు...అంటూ తెలిపారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్, కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌, నిర్మాత రామ్‌చరణ్‌, హీరోయిన్‌ తమన్నా హాజరయ్యారు.

చిరంజీవి- నయనతార జంటగా అమితాబ్‌ బచ్చన్- జగపతిబాబు- తమన్నా- సుదీప్- విజయ్‌ సేతుపతి- రవికిషన్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. అక్టోబర్‌ 2న సినిమా అత్యంత భారీగా విడుదలవుతోంది.