Begin typing your search above and press return to search.

మాస్ జరుపుతున్న జాతరే 'అఖండ'

By:  Tupaki Desk   |   3 Dec 2021 7:30 AM GMT
మాస్ జరుపుతున్న జాతరే అఖండ
X
ఈ మధ్య కాలంలో తమన్ సంగీతాన్ని సమకూర్చిన ప్రతి సినిమా హిట్ కొడుతోంది. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆయనకి మరింత మంచి పేరును తీసుకొస్తోంది. ఇక తమన్ తాను ఏ సినిమాకి పనిచేస్తున్నా, ఆ సినిమాకి సంబంధించిన విషయాలను అభిమానులతో కలిసి పంచుకుంటూ ఉంటాడు.

ఆ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందనేది కూడా చెబుతూ, ఆ హీరో అభిమానులలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటాడు. అలాగే ఆయన కొన్ని రోజులుగా 'అఖండ' గురించి మాట్లాడుతూనే వస్తున్నాడు.

'అఖండ' ఒక ప్రత్యేకమైన సినిమా అనీ .. సంచలనం సృష్టించడం ఖాయమనీ .. ఈ సినిమాలో బాలకృష్ణ విశ్వరూపం చూస్తారని చెప్పుకుంటూ వచ్చాడు. నిన్న విడుదలైన ఈ సినిమా నిజంగానే అలాంటి టాక్ తెచ్చుకుంది.

దాంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్లో తమన్ మాట్లాడుతూ .. 'అఖండ' సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి ఒక ట్రాన్స్ లో ఉన్నాము. 2020 మార్చిలో ఈ కథను విన్నాను. కథ విన్న తరువాత ఈ సినిమాతో ఒక ఏడాది పాటు ట్రావెల్ చేశాను. ఇప్పటి ట్రెండ్ కి తగినట్టుగా ఈ సినిమాకి ఏం చేయాలనేది ఆలోచించాను.

సినిమాలో మంత్రాలు నిజమైనవిగా ఉండాలి .. సన్నివేశాలకు సింక్ అవుతూ ఉండాలి. అఘోర పాత్రకి తగినట్టుగా ఉండాలి. అందుకోసం నేను .. బోయపాటిగారు ఎంతో రీసెర్చ్ చేశాము. అఘోరాల గురించి .. శివుడి గురించి తెలుసుకోవడానికి ఎన్నో బుక్స్ చదివాము. లిరిక్ రైటర్స్ తో కూర్చుని చర్చించాము.

అలా ఈ సినిమా కోసం చాలా కసరత్తు చేశాము. భక్తికి సంబంధించిన ఎపిసోడ్స్ యంగ్ స్టర్స్ ను కూడా ఆకట్టుకునేలా చేశాము. అందుకోసం మేము ఒక 40 రోజుల నుంచి సరిగ్గా నిద్రపోలేదు.

ఈ రోజున ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన కొంతసేపటికి వరుసగా మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాను ఒక మాస్ జాతర చేశారు. బాలకృష్ణగారికి హిట్ వస్తే ఇండస్ట్రీకి హిట్ వచ్చినట్టే. పెద్ద ఎన్టీఆర్ గారికీ .. బాలకృష్ణగారికి మాత్రమే ఏ దేవుడు వేషం వేసినా నిజంగా అనిపిస్తుంది.

ఇదే మాటను నేను బాలకృష్ణగారికి కూడా చెప్పాను. అలాంటి ఒక గొప్ప నటుడితో కలిసి పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. 'అఖండ'కు అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు .. నందమూరి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఇండస్ట్రీ నుంచి వరుస హిట్లు రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.