Begin typing your search above and press return to search.

కుక్కలు చింపిన విస్తరిలా `మా`ని మార్చకూడదు

By:  Tupaki Desk   |   4 July 2021 2:30 AM GMT
కుక్కలు చింపిన విస్తరిలా `మా`ని మార్చకూడదు
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల సెగ అంత‌కంత‌కు సినీపెద్ద‌ల్లో విసుగు తెప్పిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. నేనంటే నేను! అంటూ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డేందుకు ఆరుగురు రెడీ అవ్వ‌డం వీళ్లంతా వివాదాల‌తో ర‌చ్చ చేస్తుండ‌డంతో అది కాస్తా సినీ పెద్ద‌ల్ని పున‌రాలోచ‌న‌లో ప‌డేసిన‌ట్టే క‌నిపిస్తోంది.

కొద్ది రోజులుగా అన్ని ప‌రిణామాల్ని గ‌మ‌నించిన సినీపెద్ద‌లు ఏక‌గ్రీవంగా అధ్య‌క్షుడిని ఈసీ క‌మిటీని ఎంపిక చేసుకునేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. తాజాగా మూవీ ఆర్టిస్టుల సంఘం మాజీ అధ్య‌క్షుడు ముర‌ళీమోహ‌న్ రంగంలోకి దిగి సినీపెద్ద‌ల‌తో మంత‌నాలు సాగించారు. ఈసారి ఎన్నిక‌ల పేరుతో ర‌చ్చ చేయ‌డం అన‌వ‌స‌ర‌మ‌ని అంతా ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని ఆయ‌న వెల్ల‌డించ‌డం పెద్ద షాకిస్తోంది.

ప్ర‌ముఖ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో తెర‌వెన‌క‌ అస‌లేం జ‌రుగుతోందో బ‌య‌ట‌పెడుతూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ``వరదలు వచ్చినప్పుడు గేట్లు ఎత్తినట్టుగా ఎవరికి పడితే వాళ్లకి మా సభ్యత్వం ఇస్తున్నారు. అసలు ఎవరు మా మెంబరో ఎవ‌రు కాదో తెలియకుండా పోయింది. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నారు. 500 అంటేనే ఎక్కువ.. మా స‌మ‌యంలో ప‌ద్ధ‌తిగా ఉండేది`` అని ఆయ‌న‌ అన్నారు. త‌మ హ‌యాంలో బ్రహ్మాండంగా మాని న‌డిపించామ‌ని స‌మ‌ర్థించుకున్న ముర‌ళి మోహ‌న్.. పాత రోజులు మళ్లీ రావాల‌ని ఆకాంక్షించారు.

ఇలా ఒక‌రిపై ఒక‌రు వివాదాల‌కు దిగి `మా`ని కుక్క‌లు చింపిన విస్త‌రిని చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మాని స‌రైన దారిలో పెట్టేందుకు సినీపెద్ద‌లంతా ఓచోట స‌మావేశ‌మై చ‌ర్చిస్తున్నామ‌ని కూడా తెలిపారు. చిరు-ఎంబీ-జ‌య‌సుధ‌-కృష్ణం రాజు త‌దిత‌రుల‌తో భేటీ అయ్యాన‌ని ఆయ‌న తెలిపారు. మా అసోసియేష‌న్ ని దారికి తెస్తామ‌ని ఈసారి ఎన్నిక‌ల‌ను ఏక‌గ్రీవం అయ్యేలా చేస్తామ‌ని .. సినీపెద్ద‌లు నిర్ణ‌యించిన వారే అధ్య‌క్షులు అవుతార‌ని అలాగే ఈసీ టీమ్ ని కూడా మేమే నిర్ణ‌యిస్తామ‌ని ముర‌ళి మోహ‌న్ బిగ్ బాంబ్ పేల్చారు.

ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఇప్ప‌టికే వివాదాల ర‌చ్చ‌తో బ‌య‌ట‌ప‌డిపోయినందుకు ప్ర‌కాష్ రాజ్ .. వీకే న‌రేష్ ..జీవిత‌ వంటి వారికి ఇది చెంప పెట్టు లాంటిదే. రెండు చాంబ‌ర్ లు కావాలి.. ఏపీ- తెలంగాణ డివైడ్ అంటూ ప్ర‌చారం చేయ‌బోయిన తెలంగాణ న్యాయ‌వాది కం న‌టుడు సీవీఎల్ కి ఇది చెంప పెట్టులాంటిదేన‌ని భావించాలి.

ఇలా అల్ల‌రి పాల‌వ్వ‌డం స‌రికాద‌ని ముర‌ళి మోహన్ ఆ ఇంట‌ర్వ్యూలో అన్నారు. అందుకే పెద్ద‌లు నిర్ణ‌యించిన వారికే అంద‌రూ ఓకే చెప్పాల్సి ఉంటుంద‌ని తాము ఒప్పిస్తామ‌ని కూడా అన్నారు. ఇక మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్య‌క్ష ప‌ద‌వి అంటే సంపాదించేదేమీ ఉండ‌ద‌ని అది కేవ‌లం హోదా మాత్ర‌మేనని ఆయ‌న అన‌డం షాకిస్తోంది.