Begin typing your search above and press return to search.

ముంతాజ్ ఆంటీని సోష‌ల్ మీడియాలో చంపేశారు

By:  Tupaki Desk   |   4 May 2019 5:20 AM GMT
ముంతాజ్ ఆంటీని సోష‌ల్ మీడియాలో చంపేశారు
X
టీవీ ఛాన‌ళ్లు వ‌చ్చాక‌.. అందునా వాటి మ‌ధ్య పోటీ విప‌రీతంగా పెరిగిపోయి.. కాలంతో పరుగులు పెట్టాల‌న్న అత్యుత్సాహంతో ప‌లువురు ప్ర‌ముఖుల్ని చంపేసే తీరు గురించి తెలిసిందే. అనారోగ్యంతో ఉన్నారంటే.. ఆ త‌ర్వాత చ‌నిపోవ‌ట‌మేగా.. ఆ ప‌నేదో ముందే చేసేద్దాం..మ‌నం ముందున్న‌ట్లు అవుతుంద‌న్న దారుణ‌మైన మైండ్ సెట్ తో కొంద‌రు చేసే త‌ప్పులు.. ఎంద‌రినో వేద‌న‌కు గురి చేశాయి.

మీడియాకు మించిన సోష‌ల్ మీడియా రావ‌టం.. ఎవ‌రికి ఏమ‌నిపించినా దాన్ని పోస్ట్ చేసేఅవ‌కాశం ఉండ‌టంతో.. కొంద‌రి అత్యుత్సాహం..త‌మ‌కొచ్చిన స‌మాచారాన్ని క్రాస్ చెక్ చేసుకునే గుణం లేక‌పోవ‌టం ఇప్పుడు ఇబ్బందిక‌రంగా మారుతోంది. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి చోటు చేసుకుంది. బాలీవుడ్ పాత‌త‌రం హీరోయిన్ ముంతాజ్ చ‌నిపోయారంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది.

ఈ మొత్తం గంద‌ర‌గోళానికి కార‌ణంగా సినీ.. ట్రేడ్ అన‌లిస్ట్ కోమ‌ల్ నాహ్తా ట్వీట్ తో మొద‌లైంద‌ని చెప్పాలి. గుండెపోటుతో ముంబైలోని ఒక ఆసుప‌త్రిలో ఆమె మ‌ర‌ణించిన‌ట్లుగా పేర్కొంటూ.. ముంతాజ్ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలంటూ ఒక ట్వీట్ ను ఆయ‌న పోస్ట్ చేశారు. దీంతో.. ఆమె అభిమానులు.. ఆమె గురించి తెలిసిన వారు.. ఇలా వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా.. త‌మ‌కొచ్చిన స‌మాచారాన్ని పోస్ట్ చేయ‌టంతో ఇది వైర‌ల్ గామారింది. బాల‌న‌టిగా కెరీర్ స్టార్ట్ చేసి 70ల‌లో త‌న న‌ట‌న‌తో ఒక ఊపుఊపిన ముంతాజ్ 1970లో వ్యాపార‌వేత్త మ‌యూర్ మాంధ్వానిని పెళ్లాడారు. ఆమెకు ఇద్ద‌రు కుమార్తెలు.

అయితే.. ముంతాజ్ మ‌ర‌ణ వార్త‌లో నిజం లేద‌ని.. ఆమె బ‌తికే ఉన్నార‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమె మ‌ర‌ణంపై సాగుతున్న ప్ర‌చారంపై బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మిలాప్ జ‌వేరి స్పందిస్తూ.. ముంతాజ్ ఆంటీ వాళ్ల మేన‌ల్లుడితో తానిప్పుడు మాట్లాడాన‌ని.. ఆమె ఆరోగ్యంగా ఉన్నార‌న్నారు. ముంతాజ్ బ‌తికే ఉన్నార‌ని.. రూమ‌ర్ల‌కు చెక్ పెట్టాల‌ని కోరారు. దీంతో.. తొలుత ట్వీట్ చేసిన కోమ‌ల్ నాహ్తా చెంప‌లేసుకొని.. ముంతాజ్ గురించి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చినందుకు క్ష‌మించాల‌ని సోష‌ల్ మీడియాలో వేడుకున్నారు. కొత్త విష‌యాన్ని అంద‌రికి చెప్పాల‌న్న ఆత్రుత ఇలాంటి అన‌ర్థాల‌కు అవ‌కాశం ఇస్తుంది. ఈ విష‌యంలో ఎవ‌రి స్థాయిల్లో వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉందన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.