Begin typing your search above and press return to search.

ముంబై డైరీస్ ట్రైలర్: 26/11 దాడులపై ఆర్జీవీని మించి తీశారా?

By:  Tupaki Desk   |   26 Aug 2021 5:06 PM IST
ముంబై డైరీస్ ట్రైలర్: 26/11 దాడులపై ఆర్జీవీని మించి తీశారా?
X
ముంబైలో పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు 26/11 దాడుల గురించి తెలిసిందే. ముంబైలోని తాజ్ హోట‌ల్ .. ఛ‌త్ర‌ప‌తి టెర్మిన‌ల్ స‌హా ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి.. రైల్వేస్టేష‌న్ స‌హా కీల‌క మైన ర‌ద్ధీ ప్ర‌దేశాల్లో దారుణ మార‌ణహోమానికి పాల్ప‌డిన క‌స‌బ్ అండ్ గ్యాంగ్ ఉదంతాన్ని ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. 26/11 ముంబై ఎటాక్స్ పేరుతో తెర‌కెక్కించ‌గా ఆ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. అస‌లు తీవ్ర‌వాద ఘాతుకం ఇంత ఘోరంగా జ‌రిగిందా? అనిపించేంత‌గా ఆ సినిమాని తెర‌కెక్కించిన ఘ‌న‌త ఆర్జీవీకే చెల్లింది. వంద‌లాది మంది ప్ర‌జ‌లు ఘోరంగా తుపాకుల‌కు బ‌ల‌వుతున్న తీరును క‌ళ్ల‌కు గ‌ట్టిన‌ట్టు చూపించారు ఆర్జీవీ. నిజానికి ముంబై ఎటాక్స్ అనంత‌రం కొద్ది సేప‌టికే ఆ స్పాట్ ని ఆర్జీవీ విజిట్ చేయ‌డం అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న లైవ్ లీ నెస్ ని ప‌రిశీలించేందుకు ఆ స‌మ‌యంలో రిస్క్ తీసుకుని మ‌రీ వెళ్లారు. దీంతో అత‌డిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ సినిమాలో వ్య‌వ‌స్థ ఫెయిల్యూర్ ని పోలీస్ అధికారుల ధైర్య సాహ‌సాల‌ను ఎమోష‌న్ ని కూడా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా క‌స‌బ్ ఆప‌రేష‌న్ ని టేక‌ప్ చేసిన నానా ప‌టేక‌ర్ ఎమోష‌న్ ని ఒక రేంజులో ఎలివేట్ చేసారు.

ఇప్పుడు అదే క‌థ‌తో ముంబై డైరీస్ వెబ్ సిరీస్ వ‌స్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది విడుద‌ల‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుద‌లైంది. ముంబై డైరీస్ కథ భయంకరమైన 26/11 దాడుల నేపథ్యంలో త‌యారు చేసిన‌ది. ఈ కథ ఒక ఆసుపత్రిలో దాడి సమయంలో దానిలో జరిగిన సంఘటనలు.. ఆ సమయంలో వైద్యులు ఎదుర్కొన్న ఒత్తిడిని చూపించడానికి మెజారిటీ భాగం మేకర్స్ ప్రయత్నించారు. వారు బందీలుగా ఉన్న త‌మ‌వారిని కాపాడుకోలేని ధైన్యాన్ని ఈ సిరీస్ లో చూపించారు.

ట్రైలర్ ఆద్యంతం చాలా ఆసక్తిని కలిగించింది. డైలాగ్స్ థ్రిల్స్ ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా ఆస్ప‌త్రిలో పేషెంట్ల‌ను కాపాడేందుకు డాక్ట‌ర్ చేసే త్యాగం డేర్ ప్ర‌తిదీ హైలైట్ గా చూపించారు. డి-డే ఫేమ్ నిఖిల్ అద్వానీ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో సందేశ్ కులకర్ణి- మోహిత్ రైనా -కొంకోణా సేన్ శర్మ- సత్యజీత్ దుబే - శ్రేయా ధన్వంతరి ముఖ్య పాత్రలు పోషించారు. ఇది సెప్టెంబర్ 9 నుండి ప్రైమ్ వీడియోలో ప్రసారమ‌వుతుంది. ట్రైల‌ర్ ఆద్యంతం మ‌ర‌ణాలు దారుణాల‌తో గ‌గుర్పొడిచే విన్యాసాల‌ను ఆ స‌మ‌యంలో మ‌నుషుల ఆర్త‌నాదాలు ఆవేద‌న‌ను చూపించారు. టీవీ తెర‌కు క‌ళ్ల‌ప్ప‌గించి చూసేంత ఎమోష‌న్ క‌నిపిస్తోంది. నిజ‌ఘ‌ట‌న‌ల ఆధారంగా ఓ సిరీస్ ని రూపొందిస్తే అందులో బోలెడంత ఎమోష‌న్ ని పండించేందుకు ఆస్కారం ఉంటుంది. అందునా టెర్ర‌ర్ ఎటాక్స్ పై సిరీస్ అంటే చాలా డెప్త్ గా ఎమోష‌న్స్ కి ఆస్కారం ఉంది. మ‌రి ఈ సిరీస్ ని ఆర్జీవీని మించి తీశారా లేదా? అన్న‌ది తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.