Begin typing your search above and press return to search.

OTT కి చెక్ పెట్టే దిశ‌గా మల్టీప్లెక్స్ యాజమాన్యాలు?

By:  Tupaki Desk   |   14 Oct 2020 8:45 AM IST
OTT కి చెక్ పెట్టే దిశ‌గా మల్టీప్లెక్స్ యాజమాన్యాలు?
X
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించి ఈనెల 15 నుంచి సినిమా హాళ్లకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన అనంత‌రం టాలీవుడ్ నిర్మాత‌ల ఎగ్జిబిట‌ర్ల స‌మావేశాలు వేడెక్కిస్తున్నాయ్. ప్ర‌స్తుతం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలి? అన్న డైల‌మా కొన‌సాగుతోంది. డి.సురేష్ బాబు వంటి టాప్ ప్రొడ్యూస‌ర్ కం ఎగ్జిబిట‌ర్ తాను మాత్రం వేచి చూసే ధోర‌ణితోనే ఉన్నాన‌ని ఇదివ‌ర‌కూ వెల్ల‌డించారు.

అయితే చాలామంది థియేట‌ర్లు తెరుచుకోవాల‌నే కోరుకుంటున్నారు. కానీ ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా? రోజూ వంద‌లాది పాజిటివ్ కేసులు తెలంగాణ .. ఏపీలో వ‌స్తూనే ఉన్నాయి. అవి ఎక్క‌డా త‌గ్గ‌లేదు. త‌గ్గిన‌ట్టు క‌నిపించినా నివ‌రుగ‌ప్పిన నిప్పులా పరిస్థితి ఏమాత్రం మార‌లేదు. కాక‌పోతే ఆరంభం భ‌య‌ప‌డినంత భ‌య‌ప‌డ‌ట్లేదు అంతే. రిక‌వ‌రీ రేటు ఒక్క‌టే శాంతింప‌జేస్తోంది కానీ క‌రోనా ప్ర‌భంజ‌నం త‌గ్గింద‌ని అనుకోవ‌డం స‌రికాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన న‌గ్న‌స‌త్యం.

థియేట‌ర్లు తెర‌వాలా వ‌ద్దా? అన్న‌ది రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించుకోవాల్సి ఉంటుంది. కాబ‌ట్టి ప్ర‌భుత్వాధినేత‌ల‌తో సినిమా నిర్మాత‌లు ఎగ్జిబిట‌ర్లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌.అయితే థియేట‌ర్ల‌ను తెర‌వాల‌న్న ప్ర‌తిపాద‌న ఉంది కాబ్టి... ఓటీటీల్లో ఆశించిన ఫలితం రాబట్టుకోలేకపోయిన సినిమాలను ఆయా చిత్రాల నిర్మాతలు థియేటర్లు ఓపెన్ కాగానే రీరిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. అయితే దీనికి మ‌ల్టీప్లెక్స్ య‌జ‌మానులు స‌సేమిరా అనేస్తున్నార‌ట‌. ఒక‌సారి ఓటీటీలో చూసిన‌వి థియేట‌ర్ల‌లో చూస్తారా? అన్న సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ మ‌ల్టీప్లెక్సుల్లో రీరిలీజ్ కి అంగీక‌రించేందుకు సిద్ధంగా లేర‌ట‌.

థియేటర్లు మూసివేసే సమయానికి ఏ సినిమాలైతే ఆడుతున్నాయో తిరిగి వాటినే ప్రదర్శించాల‌ని లేకపోతే కొత్త సినిమాలను విడుద‌ల చేయాల‌ని.. ఓటీటీల్లో వ‌చ్చిన‌వి వేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించార‌ట‌. మొత్తానికి ఓటీటీ హ‌వాకి అలా చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌న్న‌మాట‌. థియేట‌ర్లు తెరిస్తే ఓటీటీ హ‌వా త‌గ్గుతుందా లేదా? అంటే డిజిట‌ల్ కి ఎలాంటి ఢోఖా లేద‌ని ప‌లువురు అంటున్నారు.