Begin typing your search above and press return to search.

మల్టిప్లెక్సుల బిజినెస్ రికవరీకి అదే మార్గమా?

By:  Tupaki Desk   |   17 May 2020 5:00 AM IST
మల్టిప్లెక్సుల బిజినెస్ రికవరీకి అదే మార్గమా?
X
రెండు నెలల నుంచి సింగిల్ స్క్రీన్స్.. మల్టి ప్లెక్స్ స్క్రీన్స్ అనే తేడా లేకుండా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. సినిమా రిలీజులు వాయిదా పడ్డాయి. వడ్డీల భారం భరించేకంటే ఓటీటీ రిలీజులకు పోవడం మంచిదని కొందరు ఫిలింమేకర్లు ఇప్పటికే రెడీ అయ్యారు. హిందీలో స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీ కి రెడి అవుతున్నాయి. త్వరలో తమిళం.. హిందీ కన్నడ తెలుగులో దాదాపు 8 సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.

భవిష్యత్తులో కూడా ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. దీంతో మల్టిప్లెక్స్ ఆపరేటర్లు ఏం చేస్తే తమ బిజినెస్ పుంజుకుంటుందా అనే చర్చలు జరుపుతున్నారు. అమెరికాలో గతంలో నెలకు $10 రుసుముతో 'మూవీ పాస్' ప్రవేశ పెట్టారు. నెలలో ఎన్ని సినిమాలైనా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో కూడా అలాగే ఒక పాస్ ను ప్రవేశపడితే ఎలా ఉంటుందని ఇండియన్ మల్టిప్లెక్స్ ఆపరేటర్స్ వారు ఆలోచిస్తున్నారట. దీనికి ధర ఎంత ఉండాలనేది నిర్ణయించుకున్న తర్వాత ఆఫర్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారట. ఇలాంటి ఆఫర్లేవో తీసుకురాకపోతే ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకులు మల్టిప్లెక్స్ లకు రప్పించడం కష్టం అవుతుందని భావిస్తున్నారట.

సింగిల్ స్క్రీన్స్ లో రేట్ తక్కువ కాబట్టి కరోనా క్రైసిస్ తర్వాత ప్రేక్షకులు వెళ్లే అవకాశం ఉంటుంది. మల్టిప్లెక్సుల రేట్లు సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి.. ఇప్పుడున్న పరిస్థితులలో జనాలు అంత ఖర్చు పెడతారా అనేది సందేహమే. ఇలాంటి సినిమా పాస్ ఉంటే మాత్రం ప్రేక్షకులు తిరిగి మల్టిప్లెక్స్ ల బాట పట్టే అవకాశం ఉంది. లాక్ డౌన్ విరమణ తర్వాత.. మల్టిప్లెక్స్ లు రీ ఓపెన్ చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.