Begin typing your search above and press return to search.

రాముడు.. క్రిష్ణుడు బాడీ బిల్డర్స్ కాదు.. ఉతికేసిన శక్తిమాన్

By:  Tupaki Desk   |   6 Oct 2022 4:44 AM GMT
రాముడు.. క్రిష్ణుడు బాడీ బిల్డర్స్ కాదు.. ఉతికేసిన శక్తిమాన్
X
గతానికి భిన్నంగా వర్తమాన పరిస్థితులు ఉన్నాయి. గడిచిన కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూసినప్పుడు.. ఇటీవల కాలంలో సెంటిమెంట్లకు.. భావోద్వేగాలకు ప్రజలు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. గతంలో మాదిరి.. తమకు తోచినట్లుగా పురాణాల్ని.. చరిత్రను చూపిస్తే చూస్తూ ఉండే రోజులు పోయాయి. సోషల్ మీడియాను ఆస్త్రంగా చేసుకొని ఉతికి ఆరేయటమే కాదు.. తాము చెబుతున్న వాదనల్లో న్యాయాన్ని వివరిస్తూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. యూట్యూబ్ లతో వీడియోలతో విరుచుకుపడుతున్నారు.

భారీ అంచనాలతో.. దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆదిపురుష్ మూవీపై ఇప్పుడు భారీగా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. రామాయణాన్ని ఇప్పుడున్న సాంకేతికత సాయంతో సరికొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసిన ఈ మూవీ టీజర్ విడుదలైన నాటి నుంచి విమర్శల వాయిస్ లు అంతకంతకూ పెరుగుతున్నాయి. వారి వాదనలకు మిగిలిన వారు అవునంటూ తమ మద్దతు తెలుపుతున్న వైనం పెరుగుతోంది.

ఈ టీజర్ పై రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. ఆదిపురుష్ లోని పాత్రధారుల రూపాలపై మండిపడుతున్నారు. తాజాగా శక్తిమాన్ ముఖేష్ ఖన్నా టీజర్ పై రియాక్టు అయ్యారు. తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. సినిమాకు ఆదిపురుష్ అన్న పేరు బాగానే ఉన్నా.. ఆ పేరు పెట్టుకొని రాతియుగపు మనిషి కథను చెప్పి ఉండాల్సిందన్నారు.

'తాము తీసేది రామాయణాన్ని అని చెబుతూ.. వారి ఆహార్యాన్ని మార్చేయటమా?' అంటూ మండిపడుతున్నారు. ప్రేక్షకుల విశ్వాసాలతో ఆడుకుంటారా? అంటూ ఫైర్ అయ్యారు. 'అవతార్ స్ఫూర్తిగా తీసుకొని పాత్రలను తీర్చిదిద్దటం సరైంది కాదు. రామాయణ పాత్రలతో వినోదాన్ని పంచాలనుకుంటే ప్రజలు మిమ్మల్నే చూసి నవ్వటమే కాదు.. వారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పొచ్చు. కానీ.. దయచేసి రామాయణం అని మాత్రం చెప్పకండి. సంప్రదాయాలు.. మత విశ్వాసాలు.. ఇతిహాసాలను మార్చటానికి డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఇతర మతాలతో ఇలాగే చేయగలరా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా.. వచ్చే ఏడాది జనవరి 12న వివిధ భాషల్లో విడుదల కానుంది. రాముడు రాముడిగా.. హనుమాన్ హనుమంతుడిగానూ కనిపించటం లేదన్న ముఖేశ్.. దేవుళ్లు ఎవరూ ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్ లా ఉండరన్నారు. 'రాముడు.. క్రిష్ణుడు బాడీ బిల్డర్స్ కాదు. వాళ్ల ముఖాలు సున్నితంగా.. విధేయతతో ఉంటాయి.

కోమలమైన సౌందర్యంతో వారు ఉంటారే తప్పించి గడ్డాలు.. మీసాలతో ఉండరు' అంటూ ఆదిపురుష్ లోని పాత్రల రూపాలపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ పూర్తి చేసుకొని.. నిర్మాణంతర పనులతో బిజీగా ఉన్న వేళ.. టీజర్ తో వెల్లువెత్తిన వ్యతిరేకత ఇప్పుడు మూవీ టీంకు సరికొత్త టెన్షన్ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.