Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేస్ ఓకే.. మ‌రి డేట్స్ చెప్ప‌రేంటీ?

By:  Tupaki Desk   |   19 Nov 2022 3:30 AM GMT
సంక్రాంతి రేస్ ఓకే.. మ‌రి డేట్స్ చెప్ప‌రేంటీ?
X
ఈ ఏడాది కోవిడ్ సెకండ్‌, థ‌ర్డ్ వేవ్ భ‌యాల కార‌ణంగా సంక్రాంతి స‌మరం పెద్ద‌గా మ‌జా ఇవ్వ‌లేదు. కార‌ణం పెద్ద సినిమాలేవీ పోటీకి దిగ‌లేదు. ముందు పోటీప‌డాల‌నుకున్నా సెకండ్‌, థ‌ర్డ్ వేవ్ భ‌యాల కార‌ణంగా భారీ స్థాయిలో థియేట‌ర్లు ల‌భించే ప‌రిస్థితి లేద‌ని గ్ర‌హించడంతో రిలీజ్ ల‌ని వాయిదా వేసుకున్నారు. దీంతో ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో సింగిల్ గా 'బంగార్రాజు' సినిమా మాత్ర‌మే నిలిచింది. అయితే వ‌చ్చే ఏడాది 2023 సంక్రాంతి స‌మ‌రానికి మాత్రం భారీ స్థాయిలోనే పోటీ జ‌ర‌గ‌బోతోంది.

ఈ పోటీలో వెట‌ర‌న్ సూప‌ర్‌ స్టార్స్ తో పాటు త‌మిళ స్టార్స్ కూడా పోటీప‌డ‌బోతున్నారు. ఇప్ప‌టికే వార్ కి సై అంటూ సిగ్న‌ల్ ఇచ్చేశారు కూడా. వ‌చ్చే సంక్రాంతికి తెలుగు స్టార్స్.. సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ బ‌రిలో ద‌గ‌బోతున్నారు. చిరు న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీర‌య్య‌'. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ వారు నిర్మిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

'అన్న‌య్య‌' త‌రువాత మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత చిరుతో క‌లిసి ర‌వితేజ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో స‌హ‌జంగానే ఈ మూవీపై అంచ‌నాలున్నాయి. ర‌వితేజ‌కు జోడీగా ఈ మూవీలో కేథ‌రిన్ న‌టిస్తోంది. ఈ మూవీతో సంక్రాంతి బ‌రిలో దిగుతున్నామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారే కానీ రిలీజ్ డేట్ ని ఇంత వ‌ర‌కు వెల్ల‌డించ‌లేదు. కాగా ఈ మూవీని జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఇక ఇదే సీజ‌న్ లో నంద‌మూరి బాల‌య్య త‌న తాజా మూవీ 'వీర‌సింహారెడ్డి'తో బ‌రిలో దిగుతున్నాడు.

బాల‌య్య న‌టిస్తున్న ఈ మూవీని గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తుండ‌గా ఈ మూవీని కూడా మైత్రీ మూవీ మేక‌ర్స్ వారే నిర్మిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. 'అఖండ‌'తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన బాల‌య్య ఈ మూవీతోనూ మ‌రో స‌క్సెస్ ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. సినిమా కూడా భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌డంతో ఫ్యాన్స్ కూడా భారీ హిట్ ఖాయం అంటున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ని మాత్రం ఇంత వ‌ర‌కు చిత్ర బృందం ప్ర‌క‌టించ‌లేదు.

ఇక వీటితో పాటు రెండు డ‌బ్బింగ్ సినిమాలు కూడా పోటీ ప‌డుతున్నాయి. ఇందులో విజ‌య్ హీరోగా న‌టిస్తున్న మూవీ 'వారీసు'. దీన్ని తెలుగులో 'వార‌సుడు' పేరుతో రిలీజ్ చేయ‌బోతున్నారు. దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా థియేట‌ర్ల వివాదం సృష్టించేలా వుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ మూవీని జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాల‌ని దిల్ రాజు ప్లాన్ చేసుకున్నార‌ట‌.

ఇప్ప‌టికే ఈ మూవీ కోసం ఏపీ, తెలంగాణ‌లో థియేట‌ర్ల‌ని దిల్ రాజు బ్లాక్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాల‌తో పాటు త‌మిళ హీరో అజిత్ న‌టిస్తున్న 'తునీవు' కూడా రాబోతోంది. హెచ్ వినోద్ డైరెక్ష‌న్ లో బోనీ క‌పూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాపై కూడా అంచ‌నాలు భారీగానే వున్నాయి



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.