Begin typing your search above and press return to search.

ఇండిపెండెన్స్ వీక్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..!

By:  Tupaki Desk   |   11 Aug 2021 5:00 PM IST
ఇండిపెండెన్స్ వీక్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..!
X
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత సినిమా హాళ్లు తెరుచుకువడంతో చిన్న సినిమాలన్నీ విడుదలకు క్యూ కడుతున్నాయి. జూలై 30న 'తిమ్మరుసు' 'ఇష్క్‌' లతో కలిపి అర డజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఇందులో 'తిమ్మరుసు' మినహా మిగతా సినిమాలు ఏవీ ప్రభావం చూపించలేకపోయాయి. దీంతో జనాలు సినిమాల కోసం థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే కంక్లూజన్ కి వచ్చేసారు. అయినప్పటికీ ఆగస్ట్ ఫస్ట్ వీకెండ్ లో మరో అర డజను చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో 'SR కళ్యాణమండపం' సినిమా ఒక్కటే హిట్ టాక్ తో నడుస్తోంది.

'తిమ్మరుసు' 'ఎస్ఆర్ కళ్యాణమండపం' చిత్రాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో.. ఆగస్ట్ సెకండ్ వీక్ లో ఏకంగా 10 చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అయ్యాయి. శుక్రవారం ఆగస్టు 13న ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పూర్ణ 'సుందరి' - సునీల్ 'కనబడుట లేదు' చిత్రాలతో పాటుగా 'బ్రాందీ డైరీస్' 'సలామ్ నమస్తే' 'చైతన్యం' వంటి సినిమాలు వస్తున్నాయి. అదే రోజు బొమ్మరిల్లు సిద్దార్థ్ - జీవీ ప్రకాష్ కలిసి నటించిన 'ఒరేయ్ బామ్మర్ది' అనే తమిళ డబ్బింగ్ సినిమా.. 'ది కన్జ్యురింగ్' అనే హాలీవుడ్ అనువాద చిత్రం విడుదల కానున్నాయి.

ఆగస్ట్ 14న దిల్ రాజు సమర్పణలో 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటించిన ''పాగల్'' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ వీకెండ్ లో వస్తున్న సినిమాలలో ఎక్కువ క్రేజ్ ఉన్న చిత్రం ఇదేనని చెప్పవచ్చు. అలానే పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ''రైతన్న'' చిత్రాన్ని కూడా ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ అవుతుంటే.. ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం థియేటర్ కెపాసిటీతో ప్రదర్శించబడనున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలు జనాలను థియేటర్ల వరకు రప్పించి మంచి వసూళ్ళు రాబడతాయో చూడాలి.

ఇదిలా ఉంటే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో కూడా కొన్ని క్రేజీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన 'నేత్రికాన్' చిత్రాన్ని ఆగస్ట్ 13న డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. అలానే సిద్ధార్థ్ మల్హోత్రా - కియరా అద్వానీ నటించిన హిందీ మూవీ 'షేర్షా' అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఇక అజయ్ దేవగన్ - సంజయ్ దత్ - సోనాక్షి సిన్హా కలిసి నటించిన 'భూజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' చిత్రం ఆగస్ట్ 13న డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది.