Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కెరీర్ లో మేలి మ‌లుపునిచ్చిన చిత్రాలు

By:  Tupaki Desk   |   22 Aug 2021 1:00 PM IST
మెగాస్టార్ కెరీర్ లో మేలి మ‌లుపునిచ్చిన చిత్రాలు
X
మెగాస్టార్ చిరంజీవి 66 వ‌య‌సులో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఆయ‌న దూకుడు చూస్తుంటే 150 నుంచి 200 సినిమాలు చేసేందుకు పెద్ద స‌మ‌యం ప‌ట్ట‌ద‌నే అర్థ‌మ‌వుతోంది. చిరు కెరీర్ జ‌ర్నీలో 151 సినిమాలు ఇప్ప‌టికే రిలీజ‌య్యాయి. ప్ర‌స్తుతం కొర‌టాల దర్శ‌క‌త్వంలో ఆచార్య ఆయ‌న కెరీర్ 152వ చిత్రం. ఇది త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. మ‌రో ఐదు చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఇక బాస్ కెరీర్ లో స‌క్సెస్ లు సంచ‌ల‌నాల‌ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ్లాస్ట‌ర్లు... మ‌రెన్నో స్ఫూర్తిని నింపే చిత్రాలు ఉన్నాయి. క్లాస్..మాస్.. స‌హా అన్నిర‌కాల పాత్ర‌ల‌తో ద‌శాబ్ధాలుగా ప్రేక్ష‌కాభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నారు.

దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత మెగాస్టార్ రీఎంట్రీ మూవీ `ఖైదీ నంబ‌ర్ 150` ఇండ‌స్ట్రీ రికార్డుల్ని తిర‌గ‌రాసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత సైరా-న‌ర‌సింహారెడ్డిలో ఉయ్యాల‌వాడ పాత్ర‌లో చిరు న‌ట‌న జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చి పెట్టింది. సైరా పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజై బాక్సాఫీస్ ఫ‌లితంతో సంబంధం లేకుండా క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది.

ప్ర‌స్తుతం మెగాస్టార్ సెకెండ్ ఇన్నింగ్స్ విజ‌యవంతంగా సాగిపోతుంది. సైరా త‌ర్వాత ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌`లో న‌టిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి. అభిమానులు ఈ సినిమా గురించి ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఈ శుభ‌సంద‌ర్భంలో ఓమారు చిరంజీవి కెరీర్ ని మ‌లుపుతిప్పిన సినిమాల‌ గురించి గుర్తు చేసుకుంటే ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇలా ఉన్నాయి.

కెరీర్ ఆరంభం పున్న‌మినాగు- ఖైదీ- స్వ‌యం కృషి- ఛాలెంజ్ లాంటి చిత్రాలు చిరు కెరీర్ కి కీల‌క మ‌లుపునిచ్చాయి. ఇక కెరీర్ పీక్స్ లో ఘ‌రానా మొగుడు- రౌడీ అల్లుడు- గ్యాంగ్ లీడ‌ర్ లాంటి చిత్రాలు అత‌డి స్టార్ డ‌మ్ ని అమాంతం పై స్థాయికి తీసుకెళ్లాయి. చిరు కెరీర్ లో ఎన్నో చిత్రాలు ఉన్నా ఇంద్ర(2002) ప్ర‌త్యేక‌తే వేరు. `ఇంద్ర` సినిమాతో చిరంజీవి మార్కెట్ ప‌దింత‌లైంది. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం చిరంజీవి స్టామినాని ప‌దింత‌లు పెంచింది. బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం అప్ప‌ట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కొన్ని సెంట‌ర్ల‌లో ఏకంగా ఏడాది పాటు దిగ్విజ‌యంగా న‌డిచింది. ఇక చిరంజీవి కెరీర్ లో మ‌రో ప్ర‌యోగాత్మ‌క క‌ళాత్మ‌క‌ చిత్రం `స్వ‌యం కృషి`(1987). క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా చిరుని న‌టడిగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లింది. చిరంజీవిని సంపూర్ణ న‌టుడిగా తీర్చిదిద్దిన చిత్ర‌మిది. నేటిత‌రానికి ఈ చిత్రం ఎంతో స్ఫూర్తిదాయ‌కం. అలాగే కె.రాఘ‌వేంద్ర‌రావు- చిరంజీవి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. చిరు కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ ఇది. అలాగే రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలోనే `ఘ‌రానా మొగుడు` క‌మ‌ర్శియ‌ల్ గా భారీ విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇక కోదండ రామిరెడ్డి- మెగాస్టార్ కాంబినేష‌న్ లో ఎన్నో బ్లాక్ బ్లాస్ట‌ర్లున్నాయి. `కొండ‌వీటి దొంగ‌`.. `ఛాలెంజ్` .. `ముఠామేస్త్రి` .. `ఖైదీ` చిత్రాల స‌క్సెస్ లే ఆ కాంబినేష‌న్ క్రేజ్ గురించి చెబుతుంది. ఈ సినిమాల‌న్నీ అప్ప‌ట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన‌వే. విజ‌య్ బాపినీడు తెర‌కెక్కించిన `గ్యాంగ్ లీడ‌ర్` తో చిరంజీవి ఫాలోయింగ్ మ‌రింత పెరిగింది. ఇందులో చిరు డ్యూయ‌ల్ రోల్.. ఆయ‌న‌ మ్యాన‌రిజ‌మ్ సినిమాకి ప్ర‌త్యేక ఆర్ష‌ణ‌గా నిలిచాయి. జంధ్యాల తెర‌కెక్కించిన `చంట‌బ్బాయ్`.. బాల‌చంద‌ర్ రూపొందించిన `రుద్ర‌వీణ` లాంటి చిత్రాలు చిరంజీవికి నటుడిగా ఎంతో మంచి పేరును తీసుకొచ్చాయి. చిరు ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తున్నారు. చిరు 153.. చిరు 154.. చిరు 155 అధికారికంగా ప్ర‌క‌టించారు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో గాడ్ ఫాద‌ర్ (చిరు 153) తెర‌కెక్కుతోంది. లూసీఫ‌ర్ చిత్రానికి రీమేక్ ఇది. అలాగే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళా శంక‌ర్ టైటిల్ ని నేడు చిరు బ‌ర్త్ డేని పుర‌స్క‌రించుకుని ప్ర‌క‌టించారు. అజిత్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ వేదాళం కి రీమేక్ ఇది. అలాగే బాబి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇవ‌న్నీ కంటెంట్ ప‌రంగా పాన్ ఇండియా అప్పీల్ తో అల‌రిస్తాయ‌ని అంచ‌నా. సైరా చిత్రంతో బాస్ కి హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ ప్ర‌త్యేక‌ గౌర‌వం గుర్తింపు ద‌క్కాయి. ప్ర‌తిబంద్.. ది జెంటిల్ మేన్ చిత్రాల‌తో కెరీర్ ఆరంభ‌మే బాస్ హార్డ్ వ‌ర్క్ ఎలాంటిదో హిందీ ఆడియెన్ కి అర్థ‌మైంది. ఇటీవ‌ల సైరాతో ఆయ‌న స్టామినా ఎక్క‌డా త‌గ్గ‌లేద‌ని ప్రూవైంది. అందుకే ఇక‌పై రిలీజ్ కానున్న చిత్రాల‌కు పాన్ ఇండియా క్రేజ్ ఉంటుంద‌ని అంతా భావిస్తున్నారు.