Begin typing your search above and press return to search.

'మేజర్' తల్లికి బర్త్ డే విషెస్ అందించిన చిత్ర యూనిట్..!

By:  Tupaki Desk   |   8 July 2021 7:30 AM GMT
మేజర్ తల్లికి బర్త్ డే విషెస్ అందించిన చిత్ర యూనిట్..!
X
సీనియర్ నటి రేవతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘మౌనరాగం’ సినిమాలో తనదైన అభినయంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడిన రేవతి.. ‘రావుగారిల్లు’ ‘ప్రేమ’ సినిమాలతో బాగా దగ్గరైంది. ‘అంకురం’ ’గాయం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా మెప్పించిన సహజ నటి.. డబ్బింగ్ సినిమాలతోనూ అలరించింది. ఈ క్రమంలో మూడు నేషనల్ అవార్డ్స్ అందుకుంది. ఆ తర్వాత తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ మరోవైపు డైరెక్షన్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది.

అయితే ‘ఈశ్వర్’ సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించిన రేవతి.. కొన్నేళ్ళ పాటు తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి 'లోఫర్' 'సైజ్ జీరో' 'బ్రహ్మోత్సవం' 'యుద్ధం శరణం' వంటి చిత్రాలలో కీలక పాత్రల్లో నటించి అలరించింది. ప్రస్తుతం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ''మేజర్'' అనే పాన్ ఇండియా మూవీలో రేవతి కీలక పాత్ర పోషిస్తోంది. నేడు టాలెంటెడ్ నటి రేవతి పుట్టినరోజు సందర్భంగా 'మేజర్' టీమ్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది.

మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న అత్యంత ప్రతిభావంతులైన రేవతి.. 'మేజర్' చిత్రంలో అమ్మ ప్రేమను వ్యక్తీకరించిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో రేవతి మేజర్ ఉన్నికృష్ణన్ రోల్ పోషిస్తున్న వర్సటైల్ యాక్టర్ అడవి శేష్ కు తల్లిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో ఆమె పాత్రను పరిచయం చేసారు. ఇందులో శోభితా దూళిపాళ్ల - సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

'గూఢచారి' ఫేమ్ శ‌శి కిర‌ణ్‌ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ''మేజర్'' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముంబై 26/11 ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన ఎన్ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ ఏడాదే 'మేజర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.