Begin typing your search above and press return to search.

అసలేం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

By:  Tupaki Desk   |   14 Feb 2022 12:43 PM GMT
అసలేం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?
X
కరోనా నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ గత రెండున్నరేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందనే విషయం అందరికీ తెలిసిందే. ఓవైపు సినిమా షూటింగులు జరగకపోవడంతో.. మరోవైపు చిత్రీకరణ పూర్తైన సినిమాలు థియేటర్లలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో నిర్మాతలు ఆర్ధికంగా బాగా నష్టపోయారు.

షూటింగులు లేకపోవడంతో నటీనటులు టెక్నిషియన్స్ నానా కష్టాలు పడాల్సి వచ్చింది. అయితే అప్పుడప్పుడు వైరస్ విజృభన తగ్గుతూ వస్తుండటం అందరికీ ఉపశమనం కలిగించింది.

ఇండస్ట్రీకి ఎప్పటిలాగే పూర్వవైభవం వస్తుందని భావిస్తున్న సమయంలో టికెట్ ధరల నియంత్రణ పేరుతో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన జీవో నెం.35 పెద్ద సినిమాలకు ఇబ్బందికరంగా మారింది. గతేడాది ఏప్రిల్ లో ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం మీద సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేసారు.

ఒక పక్క కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్లకు రాక.. ఇంకో పక్కన టికెట్ రేట్స్ తగ్గించడం వల్ల థియేటర్స్ క్లోజ్ చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని ఎగ్జిబిటర్లు వాపోయారు.

ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందో రాదో అనే భయంతో పెద్ద సినిమాలేవీ విడుదలకు ముందుకు రాలేదు. ధైర్యం చేసి థియేటర్లలోకి వచ్చిన సినిమాలకు ఏపీలో నష్టాలు తప్పలేదు.

ఇక రెండు రాష్ట్రాల్లో తక్కువ టికెట్ ధరలతో పాటుగా కోవిడ్ ఆంక్షల్లో వ్యత్యాసం ఉండటం కూడా సినిమా వాళ్ళని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకపోయినా.. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ మరియు నైట్ కర్ఫ్యూ పెట్టారు.

ఆక్యుపెన్సీ వల్ల వసూళ్లకు గండి పడుతుంటే.. రాత్రిపూట ఆంక్షల కారణంగా సెకెండ్ షో వేసుకోవడానికి అవకాశం లేకపోవడం సమస్యగా మారింది. ఈ కారణంతో విడుదల ప్లాన చేసిన కొన్ని సినిమాల నిర్మాత‌లు వెనుకంజ వేశారు.

కరోనా పాండమిక్ థర్డ్ వేవ్ ను పరిగణలోకి తీసుకొని ఇతర రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రా ప్రభుత్వం విధించిన నిబంధనలు నేటితో (ఫిబ్రవరి 14) ముగియనున్నాయి.

అయితే గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేశాయి. ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ఆంక్షలను ఎత్తివేస్తుందని.. ఈరోజు ప్రకటన వెలువరించే అవకాశం ఉందని టాలీవుడ్ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

అలానే టికెట్ ధరల సమస్య కూడా వచ్చే పది రోజుల్లో ఓ కిలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇటీవల సీఎం జగన్ తో భేటీ అయిన మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం చెప్పినదాని ప్రకారం ఫిబ్రవరి నెలాఖరుకు ఇండస్ట్రీకి సానుకూలమైన జీవో రావాలి.

గత పది నెలలుగా కొనసాగుతున్న టికెట్ రేట్ల ఇష్యూకి ఈసారి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ నమ్ముతున్నారు. టికెట్ ధరల పెంపుతో పాటుగా రాత్రిపూట కర్ఫ్యూలు మరియు 50 శాతం ఆక్యుపెన్సీ ఆంక్షలు ఎత్తివేస్తే థియేటర్లలోకి రావడానికి అనేక సినిమాలు రెడీగా ఉన్నాయి. ఫిబ్రవరి 25న 'భీమ్లా నాయక్' 'ఆడవాళ్లు మీకు జోహార్లు' 'గని' వంటి క్రేజీ సినిమాలు అన్నటికంటే ముందున్నాయి.

ఫిబ్రవరి చివరి వారం నుంచి మొదలు పెడితే మార్చి - ఏప్రిల్ మరియు మే నెలల్లో అనేక పెద్ద సినిమాలు - పాన్ ఇండియా రిలీజులు ప్లాన్ చేసుకున్నారు. పాండమిక్ తర్వాత టాలీవుడ్‌ కి ఇది అతిపెద్ద సీజన్ అని అనుకోవాలి.

అందుకే ఏపీలో స‌మ‌స్య‌లు స‌త్వ‌ర‌గా ప‌రిష్కారం అయితే మళ్లీ ట్రాక్ లోకి రావొచ్చని అందరూ భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఇండస్ట్రీకి అనుకూలంగా ఉంటుందా లేదా? ఆతృతగా ఎదురుచూస్తున్నారు.