Begin typing your search above and press return to search.

తెరుచుకున్న సినిమా థియేట‌ర్‌.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   13 Jun 2021 9:30 AM GMT
తెరుచుకున్న సినిమా థియేట‌ర్‌.. ఎక్కడంటే?
X
అన్ని రంగాల‌క‌న్నా.. సినీ ఇండ‌స్ట్రీపై కొవిడ్ చూపిన ప్ర‌భావం చాలా ఎక్కువ‌. అయితే.. సెకండ్ వేవ్ నుంచి త్వ‌ర‌గానే కోలుకునే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఫ‌స్ట్ వేవ్ లో దాదాపు 8 నెల‌లపైనే థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. కానీ.. ఇప్పుడు మాత్రం రెండు నెల‌ల విరామం త‌ర్వాతే ఇండ‌స్ట్రీకి మంచి రోజులు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితి త్వ‌ర‌గా చ‌క్క‌బ‌డుతోంది. ఏప్రిల్ 9న వ‌కీల్ సాబ్ విడుదలైన సంద‌ర్భంగా థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడాయి. ఈ సినిమా థియేట‌ర్ల‌లో ఉండ‌గానే.. సెకండ్ వేవ్ విజృంభించింది. దీంతో.. ప్రేక్ష‌కులు భ‌యంతో టాకీసుల‌కు రావ‌డం మానేశారు. ఫ‌లితంగా.. అనివార్యంగా టాకీసులు మూసేశారు. ఆ త‌ర్వాత రావాల్సిన చిత్రాల‌న్నీ వెనక్కు వెళ్లిపోయాయి. ఈ ప‌రిస్థితి ఎప్పుడు చ‌క్క‌బ‌డుతుందో అర్థంకాక ఇండ‌స్ట్రీ జ‌నాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతూనే ఉన్నారు.

అయితే.. ఇలాంటి స‌మ‌యంలో ఓ థియేట‌ర్ తెరుచుకోవ‌డం విశేషం! ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశాఖ‌లోని జ‌గ‌దాంబ థియేట‌ర్ ను ఓపెన్ చేస్తున్నారు. గ‌త సంక్రాంతికి వ‌చ్చిన క్రాక్ చిత్రాన్ని ఇందులో ప్ర‌ద‌ర్శించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఏపీలో క‌ర్ఫ్యూ స‌మ‌యాన్ని ప్ర‌భుత్వం స‌డ‌లించిన సంగ‌తి తెలిసిందే. ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు అన్ని వ్యాపారాలు న‌డుస్తాయి. పైగా.. థియేట‌ర్ల‌పై ఎలాంటి ఆంక్ష‌లూ విధించ‌లేదు.

అందువ‌ల్ల మార్నింగ్ షో ప్లాన్ చేస్తోంది యాజ‌మాన్యం. స‌మ‌యం కాస్త ముందుకు జ‌రిపి.. ఉద‌యం 10.30 నుంచి ఒక షో న‌డిపించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలుస్తోంది. సెకండ్ వేవ్ కార‌ణంగా మూత‌ప‌డిన థియేట‌ర్ల‌లో తెరుచుకోబోతున్న మొద‌టి టాకీసు ఇదే కావ‌డం విశేషం.

ప్ర‌స్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య త‌గ్గుతోంది. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ఏపీలో నిత్యం 8 వేల ద‌గ్గ‌ర కేసులు న‌మోద‌వుతుండ‌గా.. టీఎస్ లో 2 వేల దిగువ‌న న‌మోద‌వుతున్నాయి. మ‌రి, జ‌గ‌దాంబ థియేట‌ర్ స్ఫూర్తితో మిగిలిన టాకీసులు కూడా తెరుచుకుంటాయేమో చూడాలి.