Begin typing your search above and press return to search.

టూరిజం.. టాలీవుడ్ స్టార్లు అత‌డిని చూసి నేర్వాలి!

By:  Tupaki Desk   |   19 Jun 2022 11:30 PM GMT
టూరిజం.. టాలీవుడ్ స్టార్లు అత‌డిని చూసి నేర్వాలి!
X
గ్లామ‌ర్ రంగంతో బోలెడంత ప‌బ్లిసిటీ. స్టార్లకు ఉన్న అసాధార‌ణ ఫాలోయింగ్ దృష్ట్యా ఏదైనా ప్రాంతానికి ప్ర‌చారం సులువుగా ద‌క్కుతుంది. ఇది టూరిజం అభివృద్ధికి త‌ద్వారా ప్ర‌భుత్వ ఆదాయానికి ఎంతో స‌హ‌కారం అవుతుంది. మాల్దీవులు - ఫిజీ- ఆస్ట్రేలియా స‌హా ఎన్నో ద్వీప దేశాలు ఈ త‌ర‌హా ప్ర‌చారానికి అన్నివేళ‌లా ప్రాధాన్య‌త‌నిస్తున్నాయి. సినిమా స్టార్ల‌కు ఉచితంగా టికెట్లు కొనిచ్చి త‌మ ద్వీపాల‌కు ర‌ప్పిస్తూ బోలెడంత ప్ర‌చారాన్ని కొట్టేస్తున్నాయి అక్క‌డి ప్ర‌భుత్వాలు. ఇక సుదీర్ఘ‌మైన బీచ్ లు ఉన్న యూర‌ప్ దేశాలు సైతం టూరిజానికి ప్రాముఖ్య‌త‌నిస్తూ సినిమాల షూటింగుల కోసం అనుకూల వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. భార‌తీయ స్టార్ల‌కు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి.

ఆస‌క్తిక‌రంగా భార‌త‌దేశానికి చెందిన ప్ర‌ముఖ స్టార్లు అమితాబ్ బ‌చ్చ‌న్- ఇలియానా వంటి వారు ఇత‌ర దేశాల టూరిజం కోసం బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా కొన‌సాగారు. కానీ భార‌త‌దేశ టూరిజానికి స్టార్లు ప్ర‌చారం చేసేది త‌క్కువే. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి సుదీర్ఘ‌మైన బీచ్ ఉన్నా కానీ దానికి స‌రైన ప్రచారం లేదు. టూరిజం ప్రాశ‌స్త్యాన్ని క‌ల్పించేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నాలు సాగలేదు. బీచ్ సొగ‌సుల విశాఖ ప‌ట్నం నుంచి విజ‌య‌న‌గ‌రం - శ్రీ‌కాకుళం వ‌ర‌కూ అద్భుత‌మైన ఒంట‌రి ప్ర‌దేశాల‌తో బీచ్ లు ఉన్నా కానీ బీచ్ టూరిజానికి స‌రైన ప్ర‌చారం అయితే లేదు. మ‌న స్టార్ల‌ను ఉప‌యోగించుకుని ప్ర‌భుత్వాలు ప్ర‌చారానికి పూనుకున్న‌ది కూడా లేదు. అయితే ప్ర‌భుత్వాలు ముందుకు వ‌స్తే ఏపీలోని సుదీర్ఘ బీచ్ కి టూరిజం యోగం క‌లిగి ఉండేద‌ని విశ్లేష‌ణ‌లు లేక‌పోలేదు. కానీ రాజ‌ధాని వ్య‌వ‌హారం తేల‌క‌ ఆ స‌న్నివేశం అక్క‌డ క‌నిపించ‌డం లేదు. ప‌దేళ్లుగా కేంద్ర స‌హ‌కారం లేక‌పోవ‌డంతో ఏపీకి కోస్ట‌ల్ కారిడార్ రోడ్ల నిర్మాణం కూడా క‌ల‌గానే మిగిలిపోయింది.

ఇక దేశం అంటే దేశ‌భ‌క్తి అంటే ఏంటో నిరూపిస్తూ వంద‌ల కోట్ల విలువ చేసే ఆఫ‌ర్ల‌ను కాద‌నుకున్న ఆస్ట్రేలియ‌న్ స్టార్ క్రిస్ హేమ్స్ వర్త్ ఒక ర‌కంగా స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. సంచ‌ల‌నాల‌ థోర్.. అవెంజ‌ర్స్ ఎండ్‌ గేమ్ చిత్రాల‌ క‌థానాయ‌కుడిగా క్రిస్ హేమ్స్‌వర్త్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అత‌డు త‌దుప‌రి చిత్రం స్పైడర్ హెడ్ ను నెట్ ఫ్లిక్స్ లో ప్రమోట్ చేసుకుంటున్నాడు.

ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ్స్‌వర్త్ ఇంతకుముందు తన స్వదేశమైన ఆస్ట్రేలియాలో షూటింగ్ చేయనందున చాలా ప్రాజెక్ట్ లను తిరస్కరించినట్లు వెల్లడించాడు. ఇంకా అత‌డు మ‌రో మూడు-నాలుగు ప్రాజెక్ట్ ల కోసం అట్లాంటాలో షూట్ చేయాల్సి ఉంది. అయితే హేమ్స్ వర్త్ ఆస్ట్రేలియాలో షూట్ చేయాలని డిమాండ్ చేశాడు. అతను కొన్నిసార్లు త‌న అభ్యర్థన ఫలించిందని కూడా తెలిపాడు.. కానీ కొన్నిసార్లు కుద‌ర‌లేద‌ట‌. ఆస్ట్రేలియాలో పని చేయడం తన కుటుంబానికి దగ్గరగా ఉండటానికి త‌మ దేశానికి టూరిజం అభివృద్ధికి ఎలా సహాయపడుతుందో కూడా వెల్ల‌డించాడు. హేమ్స్‌వర్త్ తన ముగ్గురు చిన్న పిల్లల గురించి చెబుతూ..ఇంట్లో ఉంటూ అక్కడ పని చేయడం ఎంత ఇష్టమో ప్రస్తావించాడు. షూటింగ్ లొకేషన్ల విషయంలో చిన్న సినిమాలకు భారీ బడ్జెట్ సినిమాలకు ఉన్న తేడా గురించి కూడా చెప్పాడు.

త‌మ దేశ అభివృద్ధికి టూరిజం ఆదాయం చాలా అవ‌స‌ర‌మని దానికోసం తాను త‌న సినిమాల‌ని ఆస్ట్రేలియాలో చిత్రీకరించేందుకు నిర్మాత‌ల‌ను ప్రేరేపిస్తాన‌ని తెలిపాడు. అత‌డిలానే తెలుగు స్టార్లు కూడా ఆలోచిస్తే బావుంటుందేమో! నిజానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి చెందిన స్టార్లు ఎవ‌రూ హైద‌రాబాద్ ని విడిచి రావ‌డానికి సిద్ధంగా లేరు. ఏపీలో తెలుగు చిత్ర‌సీమ అభివృద్ధికి వీరంతా స‌హ‌క‌రిస్తారా లేదా? అన్న‌ది కూడా సందేహంగా మారింది. గ్లామ‌ర్ రంగం .. టూరిజం అభివృద్ధి అనేది ఏపీకి క‌ల‌గానే మిగిలి ఉంది.