Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : జార్జి రెడ్డి

By:  Tupaki Desk   |   22 Nov 2019 12:09 PM GMT
మూవీ రివ్యూ : జార్జి రెడ్డి
X
'జార్జి రెడ్డి' మూవీ రివ్యూ
నటీనటులు: సందీప్ మాధవ్-అభయ్ బేతిగంటి-సత్యదేవ్-శత్రు-మనోజ్ నందం, ముస్కాన్
సంగీతం: సురేష్ బొబ్బిలి
నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
ఛాయాగ్రహణం: సుధాకర్ యక్కంటి
నిర్మాతలు: సంజీవ్ రెడ్డి-అప్పిరెడ్డి-దాము రెడ్డి
రచన-దర్శకత్వం: జీవన్ రెడ్డి

జార్జి రెడ్డి.. కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక సెన్సేషనల్ ట్రైలర్‌తో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 70వ దశకంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: చిన్నప్పట్నుంచి సైంటిఫిక్ టెంపర్ తో పాటు ఆవేశం బాగా ఉన్న జార్జి రెడ్డి (సందీప్ మాధవ్) పీజీ చదవడం కోసం ఉస్మానియా యూనివర్శిటీకి వస్తాడు. ఐతే అతడికి ఇక్కడ అడుగడుగునా సమస్యలు కనిపిస్తాయి. సందీప్ చూస్తూ ఊరుకోకుండా విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్లందరికీ బుద్ధి చెప్పడం మొదలుపెడతాడు. దీంతో పాటు చూస్తుండగానే నాయకుడిగా ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతాడు. ఇది చాలామందికి కంటగింపుగా మారుతుంది. వాళ్లు జార్జి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలుపెడతారు. ఈ క్రమంలో జార్జి రెడ్డి వారిని ఎలా ఎదుర్కొన్నాడు.. చివరికి అతడి కథకు ముగింపు ఏంటి అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాాలి.

కథనం:-విశ్లేషణ: జార్జి రెడ్డి సినిమాకు 'ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్' అని క్యాప్షన్ పెట్టారు. ఇక్కడ యాక్షన్ అంటే.. ఫైట్లే చేయాల్సిన పని లేదు. తన ఆలోచనలతో, మాటలతో ప్రవర్తనతో కూడా అతను ప్రభావం చూపించొచ్చు. నిజానికి మనం చరిత్రలో జార్జి రెడ్డి గురించి చదివితే.. తన బాక్సింగ్ నైపుణ్యంతో ఒక్కడే పది మందికి సమాధానం చెప్పగలిగిన జార్జి రెడ్డి సామర్థ్యంతో పాటు అతడిలో ఇంకెన్నో కోణాలు కనిపిస్తాయి. అతనో మేధావి. ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్. పరీక్షల్లో అతడి సమాధాన పత్రం చూసి మంబయి యూనివర్శిటీ నుంచి ఒక ప్రొఫెసర్ వెతుక్కుంటూ ఉస్మానియా యూనివర్శిటీకి వచ్చేంత ప్రతిభ అతడిది. జార్జి రెడ్డి వ్యక్తిత్వం.. అతడి రచనలు.. ప్రసంగాల గురించి గొప్పగా చెబుతారు. వీటి గురించి చదువుతుంటే మనకు కలిగే గొప్ప అనుభూతి.. 'జార్జిరెడ్డి' చూస్తే కలగదు. అతను ప్రధానంగా ఫైట్లు చేస్తూ నాయకుడిగా ఎదిగిన ఒక 'యాక్షన్' హీరోగానే సినిమాలో ప్రొజెక్ట్ చేశారు. జార్జి రెడ్డి జీవితాన్ని వాస్తవిక కోణంలో.. ఉద్వేగభరిత రీతిలో తెరపైకి తీసుకురావడం కంటే... సగటు కమర్షియల్ సినిమాలో కథానాయకుడిలా అతడిని ప్రొజెక్ట్ చేయాలని చూడటంతో ఈ చిత్రం అంచనాలకు దూరంలో నిలిచిపోయింది.

విలన్ బ్యాచ్ కు మామూలు ఫుట్ బాల్ తో కంటే నిప్పంటించిన ఇనుప బంతితో ఫుట్ బాల్ ఆడటం సరదా. ఒక లెక్చరర్ ను విలన్ కొట్టాడని తెలుసుకున్న హీరో అతడి అడ్డాకు వెళ్లే అదే ఫైర్ బాల్ కు బెల్టు కట్టి అందరినీ రఫ్ఫాడించేస్తాడు. మరో సన్నివేశంలో తన మీదికి ఒక్కసారిగా ఆయుధాలతో దాడికి దిగిన బ్యాచ్ ను ఎదుర్కోవడానికి కర్చీఫ్ తీస్తాడు. దీంతో ఏం చేస్తాడా అనుకుంటే.. బ్లేడ్లు కట్టిన ఆ కర్చీఫ్ ను రౌడీల మీదికి విసురుతూ వర్షంలో ఫైట్ చేస్తాడు. ఈ పోరాట దృశ్యాలు చూస్తే పెద్ద స్టార్ హీరో సినిమాలో యాక్షన్ ఘట్టాలు చూసినపుడు కలిగే గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది. ఐతే జార్జి రెడ్డి కేవలం ఫైట్లు చేయడం వల్ల గొప్పోడైపోలేదు కదా? అంతకుమించిన గొప్ప లక్షణాలు అతడిలో ఉన్నాయి కదా? వాటిని ఎలివేట్ చేయడంలో దర్శకుడు జీవన్ రెడ్డి అనుకున్న మేర విజయవంతం కాలేదు. జార్జి రెడ్డి గురించి తెలియని వాళ్లు ఇంతకీ అతనేం చేశాడు అనే ఉత్సుకతతో థియేటర్లలో అడుగుపెడతారు. కానీ సినిమా చూసిన వాళ్లను ఇదే ప్రశ్న అడిగితే.. జార్జి రెడ్డి ఫైట్లే చేశాడు అనే సమాధానం వస్తే ఆశ్చర్యం లేదు.

జార్జి రెడ్డి జీవితంలోని మిగతా కోణాల్ని చూపించలేదా అంటే లేదని కాదు. అవన్నీ మొక్కుబడి వ్యవహరాలే అయ్యాయి. పది మందిని ఒక్కడే కొట్టగల శారీరక దృఢత్వంతో పాటు.. తన ప్రతిభతో ప్రశ్నపత్రాలు దిద్దే ప్రొఫెసర్లను కూడా ఆశ్చర్యపరిచే.. గోల్డ్ మెడల్ సాధించే.. అద్భుతమైన రచనలు వెలువరించే నైపుణ్యం అందరికీ ఉండదు. ఇంకా జార్జి రెడ్డిలో మరెన్నో విభిన్న కోణాలున్నాయి. ఐతే సినిమాలో మాత్రం ప్రధానంగా ఎవడు తప్పు చేస్తే వాణ్ని కొట్టే సగటు తెలుగు 'హీరో'గానే ప్రొజెక్ట్ చేశారు. అతడి మిగతా శక్తుల్ని ఊరికే అలా అలా పైపైన చూపించేశారు. కాబట్టే 'జార్జిరెడ్డి' మనసు లోతుల్లోకి వెళ్లదు. తెలుగులో బయోపిక్స్ కు బెంచ్ మార్క్ గా నిలిచిన 'మహానటి'లో మాదిరి ప్రధాన పాత్రతో ఏర్పడ్డ ఎమోషనల్ కనెక్ట్ 'జార్జి రెడ్డి'లో మిస్ అయింది. జార్జి రెడ్డి శారీరక దృఢత్వాన్నే కాకుండా.. అతడి వ్యక్తిత్వాన్ని, తనలోని మిగతా మంచి లక్షణాల్ని కూడా ఎలివేట్ చేసి ఉంటే.. చివర్లో ఆ పాత్ర చనిపోతున్నపుడు ప్రేక్షకుల గుండెలు బరువయ్యేవి. కానీ అలాంటి భావన కలగకపోవడాన్ని బట్టే సినిమా ఎలా నడిచిందో ఒక అంచనాకు రావచ్చు.

ఇప్పుడొస్తున్న సినిమాలతో పోలిస్తే 'జార్జి రెడ్డి' కచ్చితంగా భిన్నమైందే. 70ల నాటి ఉస్మానియా యూనివర్శిటీ వాతావరణాన్ని అభినందించదగ్గ రీతిలో తెరపైకి తీసుకొచ్చారు. ఒక వింటేజ్ ఫీలింగ్ తీసుకురాగలిగారు. కాలేజీ సన్నివేశాలంటే సహజంగానే యువ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ప్రథమార్ధంలో కథనం వేగంగానే సాగిపోతుంది. మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ కు లోటేమీ లేదు. యాక్షన్ ఘట్టాలు వేటికవే ప్రత్యేకంగా ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. కానీ ద్వితీయార్ధంలో కథను చెప్పాల్సిన చోట జీవన్ రెడ్డి బాగా తడబడ్డాడు. జార్జి రెడ్డి జీవితాన్ని ఒక కథగా క్రమ పద్ధతిలో చెప్పడంలో.. అతడి పాత్రను బిల్డ్ చేయడంలో దర్శకుడు ఫెయిలయ్యాడనే చెప్పాలి. ద్వితీయార్ధంలో ఎన్నికల రాజకీయాలు.. సామాజిక సమస్యలపై జార్జి రెడ్డి పోరాటం.. ఇవన్నీ పార్టులు పార్టులుగా విడిపోయాయి. సినిమాలో అంతగా సింక్ అవ్వలేదు. సెకండాఫ్ చాలా వరకు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ప్రథమార్ధంలో కలిగిన మంచి ఫీలింగ్ ను కూడా చెడగొడుతుంది. చివరికి ఒక మిశ్రమానుభూతితో థియేటర్ల నుంచి బయటికొస్తాం. 'జార్జి రెడ్డి'ని ఒక క్లాసిక్ గా నిలబెట్టడానికి మంచి అవకాశముండి కూడా ఒక సగటు సినిమాతో సరిపెట్టారన్నది వాస్తవం.

నటీనటులు: 'వంగవీటి' సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఆ పాత్రలో కొత్త నటుడు సందీప్ మాధవ్ ఒదిగిపోయిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు 'జార్జి రెడ్డి'గానూ అతను అలాగే ఒదిగిపోయాడు. ఎంతమాత్రం కొత్త నటుడు అనే ఫీలింగే అతను కలగనివ్వలేదు. నూటికి నూరు శాతం ఆ పాత్రకు అతను ఫిట్ అనిపించాడు. బాగా అలవాటైన నటుడిలా కనిపించడం అతడి ప్రత్యేకత. ఇంటర్వెల్ ముంగిట విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించే ఎపిసోడ్లో.. క్లైమాక్సులో సందీప్ నట కౌశలం తెలుస్తుంది. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో స్టార్ హీరోలకు కూడా సందీప్ పాఠాలు నేర్పించాడంటే అతిశయోక్తి కాదు. హీరోయిన్ ముస్కాన్ బాగానే చేసింది. ఆమె కూడా పాత్రకు తగ్గట్లుగా కనిపించింది. తన హావభావాలు ఆకట్టుకుంటాయి. మిగతా నటీనటుల్లో రాజన్నగా అభయ్ తనదైన ముద్ర వేశాడు. లలన్ పాత్రలో నటించిన నటుడు అదరగొట్టేశాడు. సత్యదేవ్ పాత్ర ఆశించిన స్థాయిలో లేదు. కృష్ణచైతన్య, శత్రు, మనోజ్ నందం ముగ్గురూ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా బాగా చేశారు.

సాంకేతికవర్గం: సురేష్ బొబ్బిలి పాటలు ఓకే అనిపిస్తాయి. బుల్లెట్, విజయం పాటలు బాగున్నాయి. పాటల కంటే కూడా హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం ప్రత్యేకంగా అనిపిస్తుంది. 'అర్జున్ రెడ్డి'కి దీటుగా అతను ఔట్ పుట్ ఇచ్చాడు. చాలా చోట్ల ఆర్ఆర్ గూస్ బంప్స్ ఇస్తుంది. జార్జి రెడ్డి థీమ్ మ్యూజిక్ భలేగా అనిపిస్తుంది. ఐతే కొన్ని మామూలు సన్నివేశాలకు కూడా మరీ లౌడ్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడం కొంత చికాకు పెడుతుంది. ఇక జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకున్న సినిమాటోగ్రాఫర్ సుధాకర్ యక్కంటి.. తన కెమెరాతో మ్యాజిక్ చేశాడు. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ సాయంతో 70ల నాటి ఉస్మానియా యూనివర్శిటీ వాతావరణాన్ని అతను తెరపైకి తీసుకొచ్చిన వైనం అమోఘం. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఒక డిఫరెంట్ మూవీని చూస్తున్న భావన కలిగించాడతను. ఈ చిన్న సినిమా స్థాయికి మించిన నిర్మాణ విలువలు కనిపిస్తాయి. అందుకు నిర్మాతలు అభినందనీయులు. ఇంతకుముందు 'దళం'తో ప్రతిభ చాటుకున్న దర్శకుడు జీవన్ రెడ్డి.. చాలా గ్యాప్ తీసుకుని మంచి కథతోనే సినిమా తీశాడు. అతడి స్టైలిష్ టేకింగ్ ఆకట్టుకుంది. యాక్షన్ ఘట్టాల్ని తీర్చిదిద్దిన వైనం బాగుంది. కొన్ని చోట్ల మంచి డైలాగులు కూడా రాశాడు. అతను సినిమా కోసం చాలా కష్టపడ్డ వైనం కనిపిస్తుంది కానీ.. డీటైలింగ్ కూడా బాగుంది కానీ.. స్క్రీన్ ప్లే విషయంలో అంత పట్టు చూపించలేదు. జార్జి రెడ్డి కథలో దేన్ని ఎలివేట్ చేయాలి.. దేన్ని తగ్గించాలనే విషయంలో అతను చేసిన పొరబాట్లు సినిమాకు ప్రతికూలంగా మారాయి. మంచి ప్రయత్నమే చేసినా.. ఇంకా మెరుగైన ఫలితం అందుకునే అవకాశాన్ని దర్శకుడు చేజేతులా వృథా చేశాడు.

చివరగా: జార్జి రెడ్డి.. ఓన్లీ యాక్షన్?

రేటింగ్-2.5/5