Begin typing your search above and press return to search.

మరోసారి కనువిందు చేయబోతున్న కలర్ఫుల్ జోడీలు ఇవే!

By:  Tupaki Desk   |   28 Jun 2022 4:55 AM GMT
మరోసారి కనువిందు చేయబోతున్న కలర్ఫుల్ జోడీలు ఇవే!
X
ఒకప్పుడు ఎన్టీఆర్ - ఏఎన్నార్ కథానాయకులుగా రాజ్యం చేస్తున్నప్పుడు, వారి సరసన కథానాయికలుగా ఎక్కువగా సావిత్రి - జమున కనిపించేవారు. ఇక కృష్ణ - శోభన్ బాబు జోరు కొనసాగుతున్న సమయంలో వారి జోడీగా జయసుధ.. జయప్రద.. శ్రీదేవి ఎక్కువగా అలరించేవారు. చిరంజీవి.. బాలకృష్ణ వంటివారి సరసన విజయశాంతి.. రాధ.. భానుప్రియ అందాల సందడి చేశారు. అప్పట్లో ఒక హీరో సరసన ఒక హీరోయిన్ ఎక్కువ సినిమాల్లో కనిపించినా ఆడియన్స్ కి రొటీన్ ఫీలింగ్ కలిగేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోలు ఎక్కువైపోయారు.. హీరోయిన్స్ ఎక్కువైపోయారు. హీరోల సంగతి అలా ఉంచితే సినిమా.. సినిమాకీ హీరోయిన్స్ మారిపోతున్నారు. కొత్త హీరోయిన్స్ ను చూడటానికే ప్రేక్షకులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. దాంతో ఒక హీరో జోడీగా ఒక సినిమా చేసిన హీరోయిన్ మళ్లీ ఆ హీరోతో కలిసి తెరపై కనిపిస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. స్టార్ హీరోయిన్స్ లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నవారు రిపీట్ అవుతున్నారు తప్ప, మిగతా హీరోయిన్స్ రిపీట్ కావడమనేది చాలా తక్కువగా కనిపిస్తోంది.

అలా ఈ మధ్య కాలంలో హీరోల సరసన మళ్లీ ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్స్ జాబితాలోకి వెళితే ముందుగా తమన్నా కనిపిస్తుంది. ఆ మధ్య చిరంజీవితో కలిసి 'సైరా' సినిమాలో కనిపించిన తమన్నా, మళ్లీ ఆయనతో కలిసి 'భోళా శంకర్' సినిమాలో సందడి చేయనుంది.

మెహర్ రమేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే మహేశ్ బాబుతో కలిసి 'మహర్షి' సినిమాలో మెరిసిన పూజ హెగ్డే, ఆయనతో కలిసి మరోసారి త్రివిక్రమ్ సినిమాలో కనువిందు చేయనుంది. ఇక చరణ్ విషయంలోను ఇలాగే జరిగింది. ఆయన జోడీగా 'వినయ విధేయ రామ'లో ఆకట్టుకున్న కియారా, ఇప్పుడు శంకర్ సినిమా కోసం మళ్లీ చరణ్ జోడీ కట్టింది.

'నేను లోకల్' సినిమాతో నాని జోడీగా ఆకట్టుకున్న కీర్తి సురేశ్, ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ఆయనతో కలిసి 'దసరా' సినిమాను చేస్తోంది. సాధ్యమైనంత వరకూ దసరాకే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇక నాగచైతన్యతో కలిసి 'వెంకీమామ'లో కనిపించిన రాశీ ఖన్నా, త్వరలో 'థ్యాంక్యూ' సినిమాతోను అలరించనుంది. విజయదేవరకొండతో కలిసి 'మహానటి'లో కనిపించిన సమంత, 'ఖుషీ' సినిమాలో ఆయనతో కలిసి ఆడిపాడనుంది. మొత్తానికి ఈ ఏడాది చాలా జోడీలను మళ్లీ తెరపై చూసి మురిసిపోయే అవకాశం.. అదృష్టం అభిమానులకి కలగనుందన్న మాట.