Begin typing your search above and press return to search.

పవన్ పార్టీ కోసమే ఆ సినిమానా?

By:  Tupaki Desk   |   1 May 2019 2:30 PM GMT
పవన్ పార్టీ కోసమే ఆ సినిమానా?
X
సీనియర్ దర్శకుడు సముద్ర రీసెంట్ గా 'జై సేన' టైటిల్ తో ఒక పొలిటికల్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నానని ప్రకటించాడు. వేరే ఏదైనా టైటిల్ అయితే పెద్దగా చర్చ జరిగి ఉండేది కాదు కానీ ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పేరుకు ఈ టైటిల్ చాలా దగ్గరగా అనిపిస్తుండడంతో ఈ సినిమా పవన్ పార్టీ కోసమే తెరకెక్కిస్తున్నారా అని చర్చలు మొదలయ్యాయి.

రైతుల సమస్యలపై స్థానికంగా ఉండే యువకులు ఎలా గళమెత్తారు? వారు ఏ విధంగా ప్రభుత్వంతో పోరాడి రైతుసమస్యలను తీర్చారు అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్ అని దర్శకుడు వెల్లడించడం కూడా ఈ సినిమా జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉందనే అభిప్రాయం కలగజేస్తోంది. అయితే ఇక్కడ అనుమానం రేకెత్తిస్తున్న అంశం ఏంటంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక పార్టీ కోసం పొలిటకల్ టచ్ ఉండే సినిమాలు తీసుకురావడం అరుదుగా జరుగుతుంది. ఎలెక్షన్స్ సీజన్లో అయితే సినిమాను ఓట్ల కోసం ప్రచారాస్త్రంగా ఉపయోగ పడుతుందని భావించవచ్చు. కానీ రాజకీయ నాయకుల.. పార్టీల ఐదేళ్ళ భవిష్యత్తు ఆల్రెడీ ఓటింగ్ మిషన్లలో నిక్షిప్తం అయి ఉన్న ఈ సమయంలో ఇలాంటి సినిమాను ఎందుకు తలకెత్తుకుంటారు?

నిజానికి ఎలెక్షన్స్ కంటే ముందే జనసేన కు అనుకూలంగా సినిమాలు తెరకెక్కించే ఆలోచన కొందరిలో ఉన్నప్పటికీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదనే టాక్ ఉంది. మరి ఈ సమయంలో ఈ సినిమా తీసినా రాజకీయంగా ప్రభావం ఉండే అవకాశం లేదు. మరొక విషయం ఏంటంటే 'సింహరాశి'.. 'పంచాక్షరి' లాంటి సినిమాలను రూపొందించిన సముద్ర ఇప్పుడు ఫాం లో లేడు. ఇలాంటి సమయంలో పొలిటికల్ థ్రిల్లర్ తో ఈ సోషల్ మీడియా జెనరేషన్ ఆడియన్స్ ను మెప్పించగలడా అనేది వేచి చూడాలి.