Begin typing your search above and press return to search.

అప్పుడు వెలుగు ఇప్పుడు చీకటి

By:  Tupaki Desk   |   5 July 2018 11:20 AM GMT
అప్పుడు వెలుగు ఇప్పుడు చీకటి
X
ఓడలు బండ్లు అవుతాయి పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాలి లాంటి సామెతలు సినిమా పరిశ్రమకు సరిగ్గా సరిపోతాయి. ఒక్క సినిమా ఇక్కడ జాతకాలు మార్చేస్తుంది. నిన్నా మొన్నటి దాకా నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగిన ఒక యూత్ హీరో ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ దెబ్బకు తన ఫోన్ హ్యాంగ్ అయ్యే రేంజ్ లో ఫోన్ కాల్స్ అందుకుంటాడు. స్టార్ హీరోలు డేట్స్ ఖాళీగా ఉంచుకుని ఎదురు చూసేలా చేసిన ఓ డైరెక్టర్ రెండు డిజాస్టర్ల దెబ్బకు తన ఫోన్ కాల్ ఎవరూ రిసీవ్ చేసుకోలేని స్థితికి చేరుకుంటాడు. ఇక్కడ సక్సెస్ తప్ప ఇంకేదీ లెక్కలోకి రాదు. హీరో అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా అందరికి ఒకటే సూత్రం. ఇది ఇప్పుడు ఓ దర్శకుడికి స్వీయానుభవంలోకి వస్తోంది.

సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు ఎందరో నిర్మాతలు పోటీ పడి అడ్వాన్సులు ఇచ్చారు. ఒకరి తర్వాత ఒకరికి చేద్దామని అందరి దగ్గర ఇబ్బడిముబ్బడిగా తీసుకున్నాడు. కథ అడ్డం తిరిగింది. వరస ఫెయిల్యూర్స్ తో కెరీర్ తిరోగమనం పట్టింది. పట్టిందల్లా ఇత్తడి తరహాలో ఏ హీరోతో చేసినా ఫలితం మాత్రం మారడం లేదు. దెబ్బకు గురుడికి బడ్జెట్ చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలో అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు వెనక్కు ఇచ్చేయమని పోరు పెడుతున్నారు. ఇప్పటికే వడ్డీ నష్టపోయాం అంటూ నిలదీసి అడుగుతున్నారు. షూటింగ్ మొదలు పెట్టిన సినిమా నత్తనడకన సాగుతోంది. పోనీ ఇంకెవరైనా అడ్వాన్స్ ఇచ్చి తనతో సినిమాకు ఒప్పుకుంటే ఆ సొమ్ములను పాత వాళ్లకు వెనక్కు ఇద్దాం అంటే కొత్త నిర్మాతలు ఎవరు సాహసించడం లేదు.

కెరీర్ ఊపుమీదున్నప్పుడు ఆదాయం రియల్ ఎస్టేట్ లో పెట్టాడు. మోడీ చేసిన నోట్ల రద్దు తర్వాత అది కాస్త భారంగా మారింది. అమ్ముదామంటే కొనేవారు లేరు పెట్టుకుందామంటే అప్పులవారి పోరు. ఈ ఒత్తిడితో చాలా స్ట్రగుల్ అవుతున్న దర్శకుడిని చూసి అయ్యో పాపం అనటం తప్ప అతనితో సినిమాలు చేసిన హీరోలు ఏమి చేయలేరు. ఏదైనా పెద్ద బ్రేక్ వస్తే తప్ప కోలుకోలేని పరిస్థితిలో ఉన్న ఆ దర్శకుడి నిన్నటి వైభవాన్ని తలుచుకుని ఇది కదా సినిమా రంగం మాయాజాలం అని నిట్టూరుస్తున్నారు సినిమా జనం.