Begin typing your search above and press return to search.

పేరు గొప్ప ఊరు దిబ్బ : ఐమాక్స్‌ పైన పటారం..!

By:  Tupaki Desk   |   16 April 2022 8:30 AM GMT
పేరు గొప్ప ఊరు దిబ్బ : ఐమాక్స్‌ పైన పటారం..!
X
హైదరాబాద్‌ లో మల్టీ ప్లెక్స్‌ అనగానే ఠక్కున వినిపించే పేరు ఐమాక్స్. ప్రస్తుతం మల్టీప్లెక్స్ లు చాలా అయ్యాయి. అయినా కూడా సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు హుస్సేన్‌ సాగర తీరాన ఉన్న ప్రసాద్ మల్టీప్లెక్స్ పై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. స్టార్‌ హీరోల సినిమాల నుండి చిన్న హీరోల సినిమాల వరకు ప్రసాద్‌ మల్టీప్లెక్స్ లో విడుదల అవ్వడం పరిపాటి.

ఒక మోస్తరు హీరో నుండి స్టార్ హీరోల సినిమాలు విడుదల అయిన సమయంలో అక్కడ హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడి సమస్యలు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాయి. పార్కింగ్‌ మొదలుకుని ట్రాపిక్ వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా సమస్యలు తారా స్థాయిలో ఉన్నాయి.

ముఖ్యంగా పార్కింగ్‌ విషయంలో ప్రేక్షకులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. గతంలో ఐమాక్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ ఉండేది. ప్రస్తుతం అక్కడ భారీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు జరుగుతుంది. దాంతో అక్కడ ఎలాంటి పార్కింగ్‌ కు అవకాశం లేకుండా పోయింది. అక్కడే ఉన్న ఖాళీ స్థలంలో ఫంక్షన్ హాల్‌ ఏర్పాటు చేయబోతున్నారు.

అక్కడ కూడా పార్కింగ్‌ కు సంబంధించిన అవకాశం లేకుండా పోయింది. దాంతో ఇప్పుడు ఐమాక్స్ కు వెళ్లే ప్రేక్షకులు ట్రాఫిక్ మరియు పార్కింగ్‌ ఇబ్బందులు పడుతున్నారు. థియేటర్‌ సెల్లార్ లో 150 వాహనాల వరకు పార్కింగ్‌ అవకాశం ఉంటుంది. కాని కొత్త సినిమాలు విడుదల అయిన సమయంలో 550 వాహనాల వరకు వచ్చే అవకాశం ఉంది.

వాటన్నింటికి కూడా పార్కింగ్ కావాలంటే చాలా పెద్ద టాస్క్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఐమాక్స్‌ వెళ్లాలి అంటే ప్రేక్షకులు చిరాకు పడుతున్నారు. సినిమా పూర్తయిన తర్వాత కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సి వస్తుంది.

నగరంలోనే గొప్ప మల్టీప్లెక్స్ గా పేరు దక్కించుకున్న ప్రసాద్‌ ఐమాక్స్ కు ఇలాంటి సమస్య రావడం చాలా దారుణం. ట్రాఫిక్ మరియు పార్కింగ్‌ సమస్య మాత్రమే కాకుండా స్క్రీన్‌ లు అన్నింటికి కూడా భారీ ఎత్తున జనాలు పోటెత్తినప్పుడు కనీసం అక్కడ నిల్చోడానికి కూడా ఇబ్బంది గా ఉంది. కొత్త సినిమాలను చూసేందుకు వెళ్లిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి.