Begin typing your search above and press return to search.

#మా ఎల‌క్ష‌న్.. నువ్వా నేనా? ఢీ అంటే ఢీ! ఈసారి రాజ‌కీయం ప‌రాకాష్ట‌లో!!

By:  Tupaki Desk   |   3 Sep 2021 12:30 AM GMT
#మా ఎల‌క్ష‌న్.. నువ్వా నేనా? ఢీ అంటే ఢీ! ఈసారి రాజ‌కీయం ప‌రాకాష్ట‌లో!!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు కాక‌లు పుట్టిస్తున్నాయి. కేవ‌లం 950 మంది స‌భ్యులున్న మా అసోసియేష‌న్ ఎల‌క్ష‌న్ మునుపెన్న‌డూ లేనంత‌గా హీట్ పుట్టిస్తోంది. అక్టోబ‌ర్ లో ఎన్నిక‌ల తేదీని ఫిక్స్ చేస్తూ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం ప్ర‌క‌ట‌న వెలువ‌రించిన అనంత‌రం ఎవ‌రికి వారు త‌మ వ‌ర్గాన్ని వెంట తిప్పుకుంటూ రాజ‌కీయాల‌కు సిద్ధ‌మ‌య్యారు. అయితే ఈసారి ప్ర‌ధానంగా పోటీ ఓ రెండు ప్యానెళ్ల మ‌ధ్య‌నే ఉండ‌గా.. ప్ర‌కాష్ రాజ్.. మంచు విష్ణు మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది. జీవిత‌-హేమ‌.. సీవీఎల్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డతామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇందులో ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు పోటీ కీల‌కంగా మార‌నుంది. ఇక‌పోతే ఐదుగురు స‌భ్యులు ఎవ‌రికి వారు ప్యానెల్స్ ని రెడీ చేసుకుని రాజ‌కీయాల‌కు దిగుతున్నారు. వీరంద‌రిలోనూ విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ త‌న‌లోని విల‌క్ష‌ణ‌త‌ను చాటుకుంటూ అందరి కంటే ముందే త‌మ ప్యాన‌ల్ ని ప్ర‌కటించి ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలోకి దూకారు. ఆయ‌న‌కు మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు మ‌ద్ధ‌తు బ‌హిరంగంగా ఉంది. ఇప్ప‌టికే తమ ప్యానెల్ గెలుపు కోసం నాగ‌బాబు చేయాల్సిన‌దంతా చేస్తున్నారు. ఇక‌పోతే ఇంత‌కుముందు ప్ర‌కాష్ రాజ్ ప్ర‌క‌టించిన ప్యానెల్ లో ఇద్ద‌రికి పోటీ అర్హ‌త లేక‌పోవ‌డంతో కొత్త స‌భ్యుల‌ను బ‌రిలోకి దించుతార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు మంచు విష్ణు త‌మ ప్యానెల్ స‌భ్యుల‌ను రెడీ చేసుకుని రాజ‌కీయంలో హీట్ పెంచుతున్నారు. ప్ర‌కాష్ రాజ్ కి మెగా కాంపౌండ్ అండ‌దండ‌లు మెగాస్టార్ అండా పుష్క‌లంగా ఉంటాయ‌ని అంచ‌నా వేస్తుంటే.. అటు విష్ణుకు కృష్ణంరాజు- కృష్ణ‌- మ‌హేష్ సేన‌ల మ‌ద్ధ‌తు ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. బాల‌య్య బాబు స‌పోర్ట్ ఎలానూ ఉంటుంది.

ఇక గ‌త అధ్య‌క్షుడు వీకే న‌రేష్ త‌ర‌పున 100 ఓట్లు ఎవ‌రికి ప‌డ‌తాయి? అన్న మీమాంశ ఎలానూ ఉంది. ఆయ‌న తొలి నుంచి ప్ర‌కాష్ రాజ్ కి వ్య‌తిరేకిగా ఉన్నారు కాబ‌ట్టి క‌చ్ఛితంగా మంచు విష్ణుకు ప‌డ‌తాయా ? అంటే చివ‌రి నిమిషంలో ఏం జ‌రిగినా జ‌ర‌గొచ్చు అన్న టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు హేమ‌.. జీవిత ఎవ‌రికి వారు లేడీ మ‌ద్ధ‌తును కూడ‌గ‌ట్టుకుని ఎన్నిక‌ల ద‌శ దిశ మార్చాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. హేమ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతుంద‌ని భావిస్తున్నా... చివ‌రి నిమిషంలో డ్రాప‌య్యే వీలుంది.

మ‌రోవైపు జీవితా రాజశేఖర్ `మా` సెక్రటరీ ప‌ద‌వి కోసం పోటీపడతార‌ని తెలిసింది. అయితే ఇండిపెండెంట్ గా పోటీప‌డుతూ ప్ర‌కాష్ రాజ్ .. మంచు విష్ణు ఇరువైపుల నుంచి స‌పోర్టుని కోరే ప్లాన్ తో ఉన్నార‌ట‌. అయితే ఎవ‌రు త‌న‌కు మ‌ద్ధ‌తునిస్తారు? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. విష్ణు మ‌ద్ధ‌తునిచ్చినా ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం మాత్రం పోటీకి దిగే వీలుంద‌ని అంచ‌నా. అలాగే హీరో రాజ‌శేఖ‌ర్ ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్‌ పదవి కోసం పోటీ చేసే వీలుంద‌ట‌. ఒక‌వేళ అదే జ‌రిగితే మెగా స‌పోర్ట్ ఉన్న ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ నుంచి శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ ఆ ప‌ద‌వికి పోటీప‌డే వీలుంద‌ని అంచనా.

ఇక అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డ‌తాన‌ని చెప్పిన హేమ‌ను విర‌మింప‌జేసి కీల‌క ప‌ద‌విని అప్ప‌గించేందుకు ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం పావులు క‌దుపుతోంద‌ని స‌మాచారం. ప్రకాష్ రాజ్ టీంలో ఉన్న సీనియర్ నటి జయసుధ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం అనుమానమేనని అంటున్నారు. మంచు ఫ్యామిలీకి ఆమె అత్యంత సన్నిహితంగా ఉంటారు. దీంతో ఆమె మంచు విష్ణుకు వ్యతిరేకంగా పోటీ చేయ‌ర‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు సీవీఎల్ న‌రసింహారావు తెలంగాణ క‌ళాకారులు అన్న ఎజెండాతో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ఓట్లు చీల్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారాయ‌న‌.

ఎన్నిక‌ల‌కు స‌మ‌య‌మాస‌న్న‌మ‌వ్వ‌డంతో ఎవ‌రికి వారు విందు రాజ‌కీయాలు మొద‌లు పెట్టి గుట్టు చ‌ప్పుడు కాకుండా ప్ర‌చారం కానిచ్చేస్తున్నారు. ఈగోలు అల‌క‌లు గొడ‌వ‌లు అంటూ మా ఎన్నిక‌ల ర‌చ్చ పీక్స్ కి చేర‌నుంది. ఒక‌రిపై ఒక‌రు ఎత్తులు పైఎత్తుల‌తో సాధార‌ణ ఎన్నిక‌ల్లా గ‌డ‌బిడ‌కు తెర తీసారు. ఎవ‌రు గెలిచినా 2021-24 సీజ‌న్ కి ఈసారి మా అధ్య‌క్ష కార్య‌వ‌ర్గం పాల‌న సాగించాల్సి ఉంటుంది. మేమంతా ఒక‌టే .. ఒకే త‌ల్లి బిడ్డ‌లం అని చెప్పుకునే మా స‌భ్యులంతా రాజ‌కీయాలు ప‌ద‌వుల కోసం ఇంత‌గా వెంప‌ర్లాడ‌డం అన్న‌ది ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.