Begin typing your search above and press return to search.

మీటూ తో ఆ సెలబ్రిటీల కు పోయిందే ఎక్కువ!

By:  Tupaki Desk   |   15 Nov 2019 4:36 AM GMT
మీటూ తో ఆ సెలబ్రిటీల కు పోయిందే ఎక్కువ!
X
దేశం కాని దేశం లో స్టార్ట్ అయిన మీటూ ఉద్యమం దేశం లోకి అడుగు పెట్టి ఏడాది అవుతోంది. దేశంలోని ప్రఖ్యాత సెలబ్రిటీలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి గళం విప్పి సంచలనంగా మారారు. అయితే.. మనదేశంలో ఇలా గళం విప్పిన ఐదుగురు ప్రముఖ సెలబ్రిటీలకు ఎలాంటి అనుభవం ఎదురైంది? తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టిన వారికి సాంత్వన లభించిందా? న్యాయం జరిగిందా? సమాజం వారి వేదన ను ఎలా అర్థం చేసుకుందన్న విషయం లోకి వెళ్లినప్పుడు ఆసక్తి కర అంశాలు వెలుగు చూస్తాయి.

మీటూ ఉద్యమం దేశంలోకి అడుగు పెట్టిన తర్వాత చాలామంది స్పందించినా.. ఆ నలుగురు మహిళా సెలబ్రిటీలు మాత్రం హాట్ టాపిక్ గా మారారు. వారెవరంటే.. ప్రఖ్యాత జర్నలిస్టు రీతుపర్ణ చటర్జీ.. గాయని సోనా మహాపాత్ర.. బాలీవుడ్ రచయిత వినీతా నందా.. గాయని కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి..

ఏడాది క్రితం వరకూ ప్రొఫెషనల్ గా మంచి పేరున్న వీరు మీటూ వ్యవహారంలో తమకు జరిగిన అన్యాయంపై గొంతు విప్పిన దానికి భారీగానే మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కానీ.. సమాజం లో వీరిని ప్రత్యేకం గా నిలబెట్టిందని చెప్పాలి. అయితే.. సానుకూలతల కంటే ప్రతికూలతల్నే వారు ఎదుర్కొనటం గమనార్హం. ఫేమస్ జర్నలిస్టు గా పేరున్న రీతుపర్ణా చటర్జీ మీటూ గురించి మాట్లాడిన తర్వాత ఆమె కొత్త ఉద్యోగం కోసం ట్విట్టర్ అకౌంట్లో పెట్టారు. అదింకా అలానే ఉంది. నిరుద్యోగి గానే ఉన్నారు. ఆమెకు జాబ్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఒక జాతీయ పత్రిక కు పదిహేనేళ్లు ఎడిటర్ గా ఉన్న ఆమె.. ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏర్పడేలా చేసింది మీటూ.

గాయని సోనా మహా పాత్ర పెదవి విప్పినప్పుడు దేశం ఉలిక్కిపడింది. తన భర్త రామ్ సంపత్ ఎదుటే గాయకుడు అను మాలిక్ తనను లైంగికం గా కించపరుస్తూ మాట్లాడిన వైనాన్ని బయట పెట్టారు. ఇండియన్ ఐడల్ జడ్జిగా వ్యవహరిస్తున్న అను మాలిక్ మీద ఆమె చేసిన ఆరోపణ సంచలనం గా మారింది. వేళ కాని వేళలో సోనాకు ఫోన్ చేసిన అసభ్యకరంగా మాట్లాడిన వైనాన్ని ఆమె బయటపెట్టారు. ఆమె చేసిన మీటూ ఆరోపణలకు భారీగానే మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఏడాదిగా సోనాకు అవకాశాల్లేకుండా చేసింది. భర్త.. కుటుంబ సభ్యులు తప్పించి మిగిలిన వారంతా ఆమెకు దూరం గా ఉంటూ.. ఎలాంటి అవకాశాల్లేకుండా చేయటం గమనార్హం.

బాలీవుడ్ రచయిత గా.. నిర్మాతగా సుపరిచితమైన మహిళ వినీతా నందా. 19 ఏళ్ల క్రితం తనను బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ రేప్ చేసిన వైనంపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు ఇవ్వలేదన్న వాదన ఒకటైతే.. ఆమె చేతిలో ఉన్న రెండు వెబ్ సిరీస్ లు వెనక్కి వెళ్లిపోయాయి. తాను మౌనంగా ఉండిపోతే అంతా సవ్యంగా ఉండేదని.. అయితే జరుగుతున్న దానికి తాను బాధ పడటం లేదంటారు.

తెలుగు.. తమిళ గాయని గా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సుపరిచితురాలు చిన్మయి శ్రీపాద. ఆమె గొంతుకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి చిన్మయి తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయ్యారు. తనను లైంగికం గా వేధించిన వైరముత్తు ఎపిసోడ్ ను 2018 అక్టోబరు లో ఆమె వెలుగు లోకి తీసుకొచ్చారు. ఇదో పెను సంచలనం గా మారింది. పద్మశ్రీ.. పద్మభూషణ్.. సాహిత్య అకాడమీ లాంటి ఏడు జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న వ్యక్తి మీద లైంగిక ఆరోపణలు రావటం తో తమిళ సమాజం ఉలిక్కి పడింది. తెలుగు రాష్ట్రం లోనూ సంచలనం గా మారింది. తనకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే మాట్లాడని చిన్మయి.. తమకూ మీటూ విషాదం ఎదురైందన్న వారికి అండగా నిలిచారు. దానికి మూల్యంగా ఆమెకు అవకాశాల్ని తగ్గించేశారు. ఆమె ఆరోపణలు చేసిన వైరముత్తు ఇప్పటికి ప్రముఖులు నిర్వహించే కార్యక్రమాలకు దర్జా గా వెళుతుంటే.. చిన్మయి మాత్రం బాధితురాలిగా చూసే దుస్థితి. మీటూ పుణ్యమా అని ప్రముఖల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల మాటేమిటి?