Begin typing your search above and press return to search.

84 ఏళ్లలో ఇదే బిగ్గెస్ట్ సీజన్

By:  Tupaki Desk   |   1 Feb 2016 5:30 PM GMT
84 ఏళ్లలో ఇదే బిగ్గెస్ట్ సీజన్
X
ఒక బ్లాక్ బస్టర్.. రెండు సూపర్ హిట్లు.. ఒక హిట్టు సినిమా.. ఇంకో మూడు ఏవరేజ్ మూవీస్.. ఇవన్నీ కూడా ఒకే ఒక్క నెలలో సాధ్యమయ్యాయి. అది కూడా సక్సెస్ రేట్ బాగా తగ్గిపోయిన టాలీవుడ్లో. అందుకే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 2016 జనవరి నెల సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఈ నెలలో ఏకంగా రూ.225 కోట్ల వసూళ్లు వచ్చినట్లు అంచనా. 84 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఇది బిగ్గెస్ట్ సంక్రాంతి సీజన్ అని కూడా తీర్పిచ్చేస్తున్నారు.

రామ్ మూవీ ‘నేను శైలజ’తో ఈ సీజన్ ఆరంభమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అయి ఈ ఏడాదికి శుభారంభాన్నివ్వగా.. తర్వాతి వారం వచ్చిన వర్మ సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’ కూడా మంచి టాక్ తో ఓ మోస్తరుగా నడిచింది. ఈ చిత్రాన్ని ఏవరేజ్ కేటగిరీలో వేయొచ్చు. ఇక సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయనా’ బ్లాక్ బస్టర్ హిట్టవగా.. ‘ఎక్స్ ప్రెస్’ రాజా సూపర్ హిట్టయింది. ‘నాన్నకు ప్రేమతో’ హిట్టు కేటగిరిలోకి రావడానికి ట్రై చేస్తోంది. ‘డిక్టేటర్’తో పాటు లేటెస్ట్ రిలీజ్ ‘సీతమ్మ అందాలు’ కూడా ఏవరేజ్ అనిపించుకుంటోంది.

సోగ్గాడే చిన్నినాయనా, నాన్నకు ప్రేమతో సినిమాలు మాత్రమే రూ.100 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేస్తుండటం విశేషం. మిగతా సినిమాలన్నీ కలిపి రూ.125 కోట్ల దాకా వసూలు చేసి.. సంక్రాంతి సీజన్ ను చిరస్మరణీయం చేశాయి. పది శాతం కూడా సక్సెస్ రేట్ లేని టాలీవుడ్లో ఒకే నెలలో ఇన్ని సినిమాలు విజయం సాధించి.. ఈ స్థాయిలో వసూళ్ల పంట పండిస్తుండటం అద్భుతమే.