Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'మోసగాళ్లు'

By:  Tupaki Desk   |   19 March 2021 1:25 PM GMT
మూవీ రివ్యూ: మోసగాళ్లు
X
చిత్రం : 'మోసగాళ్లు'

నటీనటులు: మంచు విష్ణు - కాజల్ అగర్వాల్ - నవదీప్ - నవీన్ చంద్ర - సునీల్ శెట్టి - వైవా హర్ష తదితరులు
సంగీతం: సామ్ సీఎస్
ఛాయాగ్రహణం: షెల్డన్ చౌ
రచన: మంచు విష్ణు - డైమండ్ రత్నబాబు
నిర్మాత: మంచు విష్ణు
దర్శకత్వం: జెఫ్రీ జీ చిన్

చాలా ఏళ్ల నుంచి వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్నాడు మంచు విష్ణు. కొంత విరామం తర్వాత ఇప్పుడతడి నుంచి వచ్చిన సినిమా ‘మోసగాళ్ళు’. మంచు విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా అయినా అతను కోరుకున్న విజయాన్నందించేలా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

అను (కాజల్ అగర్వాల్).. అర్జున్ (మంచు విష్ణు) పది సెకన్ల తేడాలో పుట్టిన అక్కా తమ్ముళ్లు. చిన్నప్పట్నుంచి ఆర్థిక సమస్యలతో అల్లాడిపోయిన వీళ్లిద్దరూ తమ జీవితాలను మార్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి సమయంలోనే అర్జున్ పని చేసే కాల్ సెంటర్ యజమాని ద్వారా ఒక స్కామ్ చేసే అవకాశం వస్తుంది. డబ్బున్న వాడి దగ్గర దోచుకోవడం తప్పేమీ కాదన్న ఉద్దేశంతో అను-అర్జున్ ఆ కుంభకోణంలో భాగం కావడానికి సిద్ధపడతారు. ఇంతకీ వాళ్లు చేసిన స్కామ్ ఏంటి.. దీని ద్వారా వాళ్లేం సాధించారు.. చివరికి వ్యవస్థల కళ్లుగప్పి అర్జున్-అను తప్పించుకోగలిగారా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మోసగాళ్ళు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా. ముంబయి నుంచి ఒక ఫేక్ కంపెనీ పెట్టి అమెరికన్ల దగ్గర్నుంచి 300 మిలియన్ డాలర్లు కొల్లగొట్టేసిన ఘరానా మోసగాళ్ల కథనే సినిమాగా తీశారు. మనకంటే ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న అమెరికన్ల నుంచి కొందరు ఇండియన్స్ కాల్ సెంటర్ పెట్టి వేల కోట్లు కొట్టేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ నేపథ్యంలో సినిమా తీయాలనుకోవడం తెలివైన నిర్ణయమే. కానీ ఈ కథను తెరపై ఎంత ఉత్కంఠభరితంగా.. ఆసక్తికరంగా చెబుతారన్నది కీలకం. మంచు విష్ణు ఎక్కడో హాలీవుడ్ నుంచి జెఫ్రీ చిన్ అనే దర్శకుడిని తీసుకొచ్చాడంటే.. అతను మన కథను అంతర్జాతీయ ప్రమాణాల్లో తీస్తాడేమో.. హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఎంతో ఉత్కంఠభరితంగా ఈ సినిమా నడుస్తుందేమో అనుకుంటాం. కానీ ‘మోసగాళ్ళు’ చూస్తుంటే.. నిజంగా వాస్తవంగా ఇలా జరిగిందా అని సందేహాలు రేకెత్తేంత సాదాసీదాగా ఈ కథను డీల్ చేశారు దీని మేకర్స్. మంచి కథా వస్తువు చేతిలో ఉండి కూడా అనాసక్తికరమైన స్క్రీన్ ప్లే.. సాధారణమైన నరేషన్ కారణంగా ‘మోసగాళ్ళు’ ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది. బేసిగ్గా కథలో ఉన్న ఆసక్తి మూలంగా ‘మోసగాళ్ళు’ అక్కడక్కడా కొంచెం ఎంగేజ్ చేస్తుంది కానీ.. అంతకుమించి ఇందులో విశేషాలేమీ లేవు.

‘మోసగాళ్ళు’ సినిమాను హాలీవుడ్ టెక్నీషియన్ డైరెక్ట్ చేశాడు అన్న మాటే కానీ.. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలైతే ఎక్కడా కనిపించవు. మన దగ్గర షార్ట్ ఫిలిం మేకర్స్ దర్శకులుగా మారి ఎంతో పకడ్బందీగా.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో థ్రిల్లర్లు తీస్తున్నారు. కానీ జెఫ్రీ చిన్ మాత్రం ‘మోసగాళ్ళు’ను పక్కా లోకల్ స్టయిల్లో ఈ సినిమాను డీల్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇండియా నుంచి కాల్ సెంటర్ ద్వారా అమెరికన్ల నుంచి వేల కోట్లు దోచేశారని తెలిసి అక్కడి పోలీసులు స్పందించే తీరు.. వాళ్లు ఇన్వెస్టిగేషన్ చేసే తీరు చూస్తే మన లోకల్ పోలీసులు కూడా ఇంత కంటే నయం కదా అనిపిస్తుంది. అక్కడి ఇన్వెస్టిగేషన్ అధికారి పాత్రను మలిచిన విధానం చూస్తేనే ‘మోసగాళ్ళు’ మీద ఇంప్రెషన్ తగ్గిపోతుంది. ఇక ఇండియాలో ఈ స్కామ్ గురించి తెలుసుకుని దాన్ని బట్టబయలు చేయడానికి ప్రయత్నించే సునీల్ శెట్టి పాత్ర సైతం అంతే సాధారణంగా అనిపిస్తుంది. బాలీవుడ్ నుంచి ఆయన్ని తీసుకొచ్చి పెట్టుకున్నందుకైనా ఆ పాత్రను ఇంకొంచెం బలంగా.. పకడ్బందీగా తీర్చిదిద్ది ఉండాల్సింది. తమ స్కామ్ గురించి అటు అమెరికాలో.. ఇటు ఇండియాలో పోలీసులకు తెలిసినా కూడా హీరో అండ్ కో థిలాసాగా ఉండటంలో ఔచిత్యం కనిపించదు. రెండు చోట్లా అనాసక్తికరంగా సాగే ఇన్వెస్టిగేషన్ సినిమాపై ఆసక్తిని తగ్గించేస్తుంది.

అసలు ‘మోసగాళ్ళు’లో చూపించే స్కామ్ కు సంబంధించి వాస్తవంగా ఈ స్కామ్ ఎలా జరిగిందో ఏమో కానీ.. సినిమాలో మాత్రం అదంత నమ్మశక్యం కాని విధంగా చూపించారు. కాల్ సెంటర్ల నుంచి ఫోన్ చేసి అమెరికన్లతో ట్యాక్స్ పేరుతో డబ్బులు రాబట్టుకునే వ్యవహారాన్ని సిల్లీగా డీల్ చేశారిందులో. అందులో ఉండాల్సినంత ఇంటెన్సిటీ.. ఉత్కంఠ కరవయ్యాయి. ఇంత ఈజీగా డబ్బులు సంపాదించేస్తారా అని తేలిగ్గా తీసుకునేలా సాగుతాయి సంబంధిత సన్నివేశాలు. కాకపోతే ప్రథమార్ధంలో కొన్ని మలుపులుండటం.. కథనంలో కొంచెం వేగం కనిపించడంతో సర్దుకుపోవచ్చు. కానీ ద్వితీయార్ధంలో మాత్రం ‘మోసగాళ్ళు’ పూర్తిగా నిరాశకు గురి చేస్తుంది. ఇదొక థ్రిల్లర్ సినిమా అని మరిచిపోయేలా సాగుతుంది కథనం. ఒక సన్నివేశానికి ఇంకో సన్నివేశంతో పొంతన లేకుండా.. ఏమాత్రం ఉత్కంఠ లేకుండా సన్నివేశాలు పేర్చుకుంటూ పోయారు. అన్నాచెల్లెళ్ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే సన్నివేశాలు మరీ పేలవంగా తయారయ్యాయి. ఇక హీరో చేసిన స్కామ్ బయటపడిపోతుందంటే అతను దొరికిపోతాడేమో అని ప్రేక్షకుల్లో ఎలాంటి భయం కలగదు అంటే సంబంధిత సీన్లు ఎలా నడుస్తాయో అర్థం చేసుకోవచ్చు. హీరోకు అసలు సవాలే లేనట్లుగా చూపించడంతో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠే లేకపోయింది. ముగింపులో కూడా పెద్దగా మెరుపులేమీ లేవు. చివరికొచ్చేసరికి ఇలాంటి కంటెంట్ తో మంచు విష్ణు ఈ చిత్రాన్ని హాలీవుడ్లో రిలీజ్ చేయాలని ఎలా అనుకున్నాడు.. దీన్ని పాన్ ఇండియా రేంజికి తీసుకెళ్లాలని ఎలా అనుకున్నాడు అన్న సందేహాలు కలుగుతాయి. విష్ణు గత సినిమాలతో పోలిస్తే కొంచెం మెరుగే కానీ.. ‘మోసగాళ్ళు’ గురించి ప్రచారం చేసిన దానికి, తెరమీద చూసిన దానికి పొంతనే లేదసలు.

నటీనటులు:

మంచు విష్ణు పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికేమీ లేదు. కొన్ని సన్నివేశాల్లో ఒద్దికగా నటించి ఓకే అనిపించాడు. కానీ కొన్ని సీన్లలో మాత్రం అతడి హావభావాలు.. డైలాగ్ డెలివరీ విసుగు తెప్పిస్తాయి. ఓవరాల్ గా అర్జున్ పాత్ర ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోదు. అనుగా కాజల్ అగర్వాల్ తనకు అలవాటు లేని.. భిన్నమైన పాత్ర చేసింది. ఆమె నటన బాగానే సాగింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె విష్ణును డామినేట్ చేసింది. ఐతే ద్వితీయార్ధంలో కొంతసేపు కాజల్ పాత్ర అంతర్ధానం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నవదీప్ తనకు అలవాటైన నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశాడు. తన పాత్రకు అతను న్యాయం చేశాడు. పాత్ర డిమాండ్ మేరకు చేశాడేమో కానీ.. నవీన్ చంద్ర నటన అతిగా అనిపిస్తుంది. సునీల్ శెట్టి చేయాల్సినంత ప్రత్యేకమైందైతే కాదు ఏసీపీ కుమార్ పాత్ర. ఆయన నటనలోనూ ఏమంత ప్రత్యేకత కనిపించదు. తనికెళ్ల భరణి.. రాజా రవీంద్ర తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం:

సామ్ సీఎస్ స్వరపరిచిన పాటలు ఊరికే అలా బ్యాగ్రౌండ్లో వచ్చి పోయేవే. అవేమంత గుర్తుండవు. నేపథ్య సంగీతంతో సన్నివేశాల్లో ఉత్కంఠ పెంచడానికి అతను ప్రయత్నించాడు. సామ్ పనితనం ఓకే. షెల్డన్ చౌ ఛాయాగ్రహణంలో ఏమంత విశేషం లేదు. విజువల్స్ అంతా సాధారణంగానే అనిపిస్తాయి. మంచు విష్ణు చెప్పిన బడ్జెట్ కు తగ్గ నిర్మాణ విలువలు సినిమాలో కనిపించవు. ముఖ్యంగా అమెరికా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు స్థాయికి తగ్గట్లు లేవు. విష్ణు-డైమండ్ రత్నబాబు కలిసి వండిన స్క్రిప్టే బలహీనం. రియల్ స్టోరీలో విషయం ఉన్నప్పటికీ.. దాన్ని స్క్రీన్ మీదికి తీసుకొచ్చిన విధానం ఆసక్తికరంగా లేదు. స్క్రీన్ ప్లే బిగి లేదు. కథ ‘ఇంటర్నేషనల్’ రేంజే కానీ.. దాన్ని నరేట్ చేసిన విధానం మాత్రం పక్కా ‘లోకల్’గా అనిపిస్తుంది. జెఫ్రీ చిన్ దర్శకత్వం గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదు.

చివరగా: మోసగాళ్ళు.. మెరుపుల్లేవ్..!

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre