Begin typing your search above and press return to search.

అందరూ కలిసి సమస్యను బాగా పెంచేస్తున్నారా ?

By:  Tupaki Desk   |   11 Jan 2022 6:30 AM GMT
అందరూ కలిసి సమస్యను బాగా పెంచేస్తున్నారా ?
X
సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు విషయాన్ని అందరూ కలిసి పెంచేస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తుండటంతో వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. నిజానికి సినిమా టికెట్ల ధర పెంచడం, తగ్గించడం అన్నది ప్రత్యక్షంగా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు సంబంధించింది. సినిమా టికెట్ల ధరలను తగ్గింపుపై నిర్మాతలో లేకపోతే ఎగ్జిబిటర్ల సంఘం బాధ్యులో ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుంది.

ఒకవైపు ఎగ్జిబిటర్ల సంఘం ఈ ప్రయత్నాలు చేస్తుండగానే మరోవైపు ఎవరికి తోచినట్లు వాళ్ళు జోక్యం చేసుకుని సమస్యను కెలికేస్తున్నారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మంత్రి పేర్ని నానితో జరిగిన భేటీయే ఉదాహరణ. భేటీలో ఏమి చర్చించారనేది పక్కన పెట్టేస్తే మీడియాతో మాట్లాడిన మాటలు మాత్రం అభ్యంతరకరమే. టికెట్ల ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. టికెట్ల ధరలు సవరణలో ప్రభుత్వానికి అధికారం లేదని చెప్పటాన్ని మంత్రి నాని తీవ్రంగా తప్పు పట్టారు. సినిమా టికెట్ల ధరల సవరణలో ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉన్నట్లు స్పష్టంగా చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటి అని సినిమా వాళ్ళు ప్రశ్నించేందుకు లేదు. పొద్దున లేచింది మొదలు ఏదో విషయంలో ప్రభుత్వంతోనే సినిమా వాళ్ళకు పనుంటుంది. అలాంటపుడు అధికారాలు గురించి కాకుండా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఎవరు పడితే వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడేస్తే సమస్య మరింత పెరుగుతుంది. కోవూరు ఎంఎల్ఏ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరమే. టికెట్ల ధరల సవరణ అంశంపై ప్రసన్న మాట్లాడాల్సిన అవసరమే లేదు.

సినిమా పరిశ్రమలోనే కొందరు టికెట్ల ధరలు తగ్గించటాన్ని స్వాగతిస్తున్నారు. కొందరు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్న వారు మంచి వాతావరణంలో చర్చలు జరిపితే సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది. అంతేకానీ ప్రభుత్వంపై నోరుపారేసుకుంటే సమస్య పెరుగుతుందే కానీ తగ్గేది కాదు. ఈ విషయాన్ని గమనించి పరిశ్రమ పెద్దలు ముందు తమ వాళ్ళని కట్టడి చేయాలి.

టికెట్ల ధరల తగ్గింపులో ప్రభుత్వానికి అధికారం లేదన్నపుడు తెలంగాణాలో టికెట్ల ధరలను సవరించినపుడు ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎలా చెప్పారు ? అంటే టికెట్ల ధరలు పెంచితే ధన్యవాదాలు చెప్పి తగ్గిస్తే అధికారాలను ప్రశ్నిస్తారా ? అధికారం ఉంది కాబట్టే కదా తెలంగాణా ప్రభుత్వం టికెట్ల ధరలను సవరించింది. మరదే అధికారం ఏపీ ప్రభుత్వానికి కూడా ఉందని మరచిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రభుత్వం అధికారాల గురించి కాకుండా సమస్య పరిష్కారం గురించి చర్చించుకుంటే బాగుంటుంది.