Begin typing your search above and press return to search.

ఫోటో టాక్‌: చె గువేరా పాత్ర‌లో మోహ‌న్ లాల్?

By:  Tupaki Desk   |   18 July 2020 10:10 AM GMT
ఫోటో టాక్‌: చె గువేరా పాత్ర‌లో మోహ‌న్ లాల్?
X
సూప‌ర్ స్టార్ .. కంప్లీట్ స్టార్ అంటూ మోహ‌న్ లాల్ ని అభిమానులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ద‌శాబ్ధాల పాటు ఆయ‌న ఎదురేలేని ఛ‌రిష్మాతో స్టార్ డ‌మ్ ని పెంచుకుంటూనే ఉన్నారు కానీ ఎక్క‌డా త‌గ్గలేదు. మ‌ల‌యాళ చిత్ర‌సీమ స‌హా టాలీవుడ్ లోనూ తిరుగులేని స్టార్ గా కంటిన్యూ అవుతున్నారు. ఆయ‌న న‌టించిన సినిమాల్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు మ‌న‌వాళ్లు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు అంటే ఇక్క‌డా అభిమానులు ఉండ‌డం వ‌ల్ల‌నే.

లాల్ న‌టించిన లూసీఫ‌ర్ సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా రీమేక్ చేస్తున్నారు. ఇప్ప‌టికే స్క్రిప్టు రెడీ అవుతోంది. అన్న‌ట్టు లూసీఫ‌ర్ చిత్రంలో మోహ‌న్ లాల్ ఒక రాజ‌కీయ నాయ‌కుడిగా .. ఎదురేలేని వాడిగా క‌నిపిస్తారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి న‌మ్మిన బంటుగా విధేయుడిగా క‌నిపించే ఆ పాత్ర లో ట్విస్టులు ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తాయి. మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ నాయ‌కుడిగా అత‌డి న‌ట‌న ఆహార్యం అద్భుతంగా కుదిరాయి. మ‌రోసారి అలాంటి పాత్ర‌లో న‌టించినా మ‌ల‌యాళీలు నెత్తిన పెట్టుకుంటారు.

అదంతా స‌రే కానీ.. తాజాగా ఆయ‌న మ‌రో కొత్త లుక్ ని అభిమానుల‌కు అంత‌ర్జాలంలో షేర్ చేశారు. ఈ గెట‌ప్ చూస్తుంటే .. జ‌ర్మ‌న్ ఫిలాస‌ఫ‌ర్.. పొలిటిక‌ల్ థియ‌రిస్ట్ కార్ల్ మార్క్స్ గుర్తుకు రావడం లేదూ? ఆయ‌నా ఇలానే ఫుల్ గా గ‌డ్డం పెంచి నెరిసిన జుట్టుతో ప్ర‌భావ‌వంత‌మైన స్ఫుర‌ద్రూపంతో ఆక‌ట్టుకుంటారు. మ‌రో కోణంలో చూస్తే క్యూబ‌న్ మిసైల్ .. రివ‌ల్యూష‌న‌రీ ఆర్మీ అధినాయ‌కుడు చెగువేరాను త‌ల‌పిస్తున్నారు. త‌ల‌పై హ్యాట్ పెట్టారు కాబ‌ట్టి చెగువేరాకు ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. మొత్తానికి ఈ న్యూలుక్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. బ‌హుశా ఆయ‌న త‌న త‌దుప‌రి చిత్రం కోస‌మే ఈ గెట‌ప్ వేశారా అన్న‌ది ఆయ‌నే చెప్పాలి.