Begin typing your search above and press return to search.

మోహన్ లాల్ షాకింగ్ డెసిషన్

By:  Tupaki Desk   |   19 Aug 2015 5:46 PM GMT
మోహన్ లాల్ షాకింగ్ డెసిషన్
X
మోహన్ లాల్ మలయాళంలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్. పాతికేళ్లకు పైగా కెరీర్ లో అద్భుతమైన విజయాలందుకున్నారాయన. అడపాదడపా పొరుగున ఉన్న కోలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇద్దరు సినిమాలో ఆయన పోషించిన పాత్రను ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ మధ్య విజయ్ తో కలిసి ‘జిల్లా’ సినిమాతోనూ సందడి చేశారు. ఆ సినిమా తెలుగులోనూ బాగానే ఆడి.. మోహన్ లాల్ ను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది. ఐతే ఈ ఊపులో మోహన్ లాల్ ను ఓ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటింపజేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఐతే మోహన్ లాల్ తెలుగులోకి వస్తే ఏదో పెద్ద బ్యానర్ లో, పెద్ద హీరో సినిమాతో వస్తారనుకుంటే.. ఓ చిన్న సినిమాలో కీలక పాత్ర చేయడానికి ఒప్పుకుని అందరికీ షాకిచ్చారాయన.

సూరజ్, కవిత అనే కొత్త హీరో హీరోయిన్లతో సురేష్ వంశీ అనే కొత్త దర్శకుడు రూపొందించబోయే ఓ చిన్న సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించబోతున్నాడట. విశ్వనాథ్ అనే కొత్త నిర్మాత తెరకెక్కించే ఈ సినిమా ఆగస్టు చివరి వారంలో మొదలుకానుంది. మోహన్ లాల్ తమ సినిమాలో నటిస్తున్న సంగతి తెలియజేస్తూ ఆ చిత్ర యూనిట్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఐతే మోహన్ లాల్ ఇలాంటి పేరులేని దర్శకుడు, నిర్మాతల సినిమాలో నటించడమేంటని ఎవరికీ అర్థం కావడం లేదు. అందుకే ఈ వార్త నిజమా కాదా అని కూడా సందేహాలు వచ్చేస్తున్నాయి. ఒకవేళ మోహన్ లాల్ ఈ సినిమాలో నటిస్తే అదే ఆయనకు తొలి తెలుగు సినిమా కాదు. రెండు దశాబ్దాల కిందట బాలయ్య కథానాయకుడిగా మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన ‘గాండీవం’ సినిమాలో ఆయన ఓ పాటలో తళుక్కుమన్నారు.