Begin typing your search above and press return to search.

#కరోనా: ప్రజలకు మోహన్ బాబు ఆత్మీయ విన్నపం

By:  Tupaki Desk   |   17 March 2020 7:00 PM IST
#కరోనా: ప్రజలకు మోహన్ బాబు ఆత్మీయ విన్నపం
X
కరోనా...ప్రస్తుతం ప్రపంచ దేశాల ప్రజలను కలలో కూడా కలవరపెడుతోన్న మహమ్మారి వైరస్. కరో్నా వ్యాప్తిని అరికట్టేందుకు ఇటు ప్రభుత్వ...అటు ప్రైవేటు యంత్రాంగాలు ముమ్మరంగా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి. కరోనాపై అప్రమత్తంగా ఉండాలంటూ పలువురు సెలబ్రిటీలు తమకు తోచిన విధంగా సందేశాలిస్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి, సుమ...లతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కరోనాపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ఇక, తాజాగా విలక్షణ నటుడు మోహన్ బాబు కరోనాపై ట్వీట్ చేశారు. కరోనా గాలికంటే వేగంగా ప్రయాణిస్తోందని, ఈ మహమ్మారి వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మోహన్ బాబు పిలుపునిచ్చారు. అంతేకాదు, మార్చి 19న జరగాల్సిన శ్రీ విద్యా నికేతన్ పాఠశాల, కళాశాలల వార్షికోత్సవాన్ని, అదే రోజున జరుపుకుంటున్న తన పుట్టిన రోజు వేడుకలను వాయిదా వేస్తున్నట్లు మోహన్ బాబు ట్వీట్ చేశారు.

కరోనా వ్యాప్తి పై మోహన్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. పంచ భూతాలు మనకు ఇచ్చిన వరాలను మనమే శాపాలుగా మార్చుకుంటున్నామని, ప్రకృతిని మనమే చేజేతులా నాశనం చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జనం ఎక్కువ సంఖ్యలో గుమిగూడవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని, అందుకే మార్చి 19న జరగాల్సిన శ్రీ విద్యా నికేతన్ పాఠశాల, కళాశాలల వార్షికోత్సవాన్ని, అదే రోజున జరుపుకుంటున్న నా పుట్టిన రోజు వేడుకలను వాయిదా వేస్తున్నానని తెలిపారు. తనకు అభినందనలు తెలియజేయడానికి రావద్దని, కరోనా పై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు వివాహాలు, ఈవెంట్లు, క్రీడా కార్యక్రమాలు, మ్యాచ్ లు రద్దయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ లో మార్చి 31వరకు థియేటర్లు మూసివేయగా....మార్చి 21 వరకు టాలీవుడ్ లోని షూటింగ్ లను రద్దు చేశారు.