Begin typing your search above and press return to search.

ఈ ఏడాది మిస్ యూనివర్స్ ను చూశారా?

By:  Tupaki Desk   |   9 Dec 2019 12:17 PM IST
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ను చూశారా?
X
అందంగా ఉండటం అంటే? అన్న ప్రశ్నను వేసిన వెంటనే చెప్పే సమాధానాలు విన్నప్పుడు.. అందంగా ఉండటం ఎలా అన్నది తేల్చటం ఇంత కష్టమా? అన్న భావన కలుగక మానదు. ఎందుకంటే.. ఎవరిష్టం వారిది. అందరూ అభిరుచి ఒకేలా ఉండాలన్న రూల్ లేదు కదా? అందాల పోటీలు.. అందునా మిస్ యూనివర్ష్ లాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో విజేలతలుగా ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో విజేతను ఎంపిక చేసిన వైనం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

అందమంటే తెల్లతోలు మాత్రమే అన్న నానుడిలో ఏ మాత్రం నిజం లేదని తాజా విజేత స్పష్టం చేసింది. తన అందం గురించి విశ్వవిజేత నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు చూస్తేనే అర్థమయ్యే పరిస్థితి. నా రంగు.. నా జట్టును చూసిన ఎవరూ అందంగా ఉందని అనరు.. అలాంటి ప్రపంచంలో నేను పెరిగా. అలాంటి వివక్షకు ముగింపు పలికే సమయం ఇదేనని భావిస్తున్నా అంటూ ఆమె తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు.

ఇంతకూ ఈసారి మిస్ యూనివర్స్ విజేత ఎవరంటే దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టుంజీ. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలో ఆదివారం రాత్రి జరిగిన తుది పోటీల్లో టుంజీని విజేతగా ప్రకటించటం సంచలనంగా మారింది. మొత్తం 90 మంది అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో కిరీటం మాత్రం టుంజీని వరించింది. 26 ఏళ్ల టుంజీ స్వస్థలం సౌతాఫ్రికాలోని సోలో. లింగ ఆధారిత వివక్ష.. హింసకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నారు. భారత్ నుంచి ఈ పోటీలో పాల్గొన్న వర్తికా సింగ్ టాప్ 20లో కూడా స్థానాన్ని సొంతం చేసుకోలేకపోయారు.